వైఎస్ జగన్ గుంటూరు పర్యటన ప్రారంభం
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా గుంటూరు జిల్లాకు చేరుకున్నారు. సోమవారం మధ్యాహ్నానికి ఆయన గుంటూరు జిల్లా పొందుగల చేరుకున్నారు. భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాలలో సోమ, మంగళవారాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.
పొందుగల నుంచి ఆయన దాచేపల్లి, ముత్యాలంపాడు గ్రామాల్లో వరద వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులను పరామర్శిస్తారు. అనంతరం దాచేపల్లిలోని ఎస్టీ, ఎస్సీ, బీసీ కాలనీల్లో వరదకు దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడతారు. కాటేరు వాగును కూడా జగన్ పరిశీలిస్తారు. అనంతరం గురజాల మండలం చేరుకుని జంగమహేశ్వరపురం, చర్లగుడిపాడు గ్రామాల్లో వరదకు దెబ్బతిన్న పంటలను, మిర్యాలగూడలో కూడా జగన్ పర్యటించి బాధితుల్ని పరామర్శిస్తారు.