చెన్నైలో వైఎస్ వర్ధంతి సంస్మరణ సభ
Published Wed, Sep 4 2013 6:06 AM | Last Updated on Mon, Aug 27 2018 9:19 PM
వైఎస్ వర్ధంతి సంస్మరణ సభలో నేతలు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. కుల, మత, భాషా భేదాలకు అతీతంగా ఏకమై రాజన్న రాజ్యం సాధించుకుందామని వైఎస్‌ఆర్‌సీపీ మైనారిటీ విభాగం చైర్మన్ రెహ్మాన్ పిలుపునిచ్చారు. కిరణ్, చంద్రబాబు లాంటి వాళ్లు ఎంతమంది వచ్చినా జగన్ ప్రభంజనాన్ని ఆపలేరని స్పష్టం చేశారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి నాలుగో వర్ధంతి సంస్మరణ సభ మంగళవారం చెన్నైలో జరిగింది. పెద్ద సంఖ్యలో నాయకులు, అభిమానులు తరలి వచ్చారు. అశ్రునివాళి అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ ఆర్‌సీపీ మైనారిటీ విభాగం చైర్మన్ రెహ్మాన్ ప్రసంగించారు. మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్‌కు దక్కుతుందన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం కుటిల రాజకీయాలతో వైఎస్‌ఆర్ కుటుంబం నలిగిపోతున్న తీరు తలచుకుంటే గుండె తరుక్కుపోతోందన్నారు.
పజల కోసం పోరాడిన ఫలితంగా వై.ఎస్.జగన్‌ను కాంగ్రెస్ జైల్లో పెట్టిందన్నారు. తండ్రి ప్రేమకు దూరమైన జగన్ పిల్లల ఆవేదన వర్ణనాతీతమని అన్నారు. ఈ పరిస్థితుల్లో వైఎస్ కుటుంబ సభ్యులకు అందరం సంఘీభావం తెలపాల్సి ఉందన్నారు. ఢిల్లీ పెద్దలకు లవ్‌లెటర్ ఇచ్చిన చంద్రబాబు నేడు సమైక్యాంధ్ర యాత్రలు సాగిస్తున్నారని, ఆయన సైకిల్‌కు హ్యాండిల్, చక్రాలు లేవని ఎద్దేవా చేశారు. వందమంది కిరణ్‌కుమార్‌రెడ్డిలు, చంద్రబాబులు వచ్చినా జగన్ ప్రభంజనాన్ని ఆపలేర ని అన్నారు. జగన్ ఒక వ్యక్తి కాదు శక్తి అని గుర్తించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పారు.
సంక్షేమ పథకాల సృష్టికర్త
మాజీ మంత్రి మారెప్ప మాట్లాడుతూ రాజ్యాంగాన్ని సృష్టించడానికి అంబేద్కర్ పుట్టినట్లే, ప్రజాసంక్షేమ పథకాల ను సృష్టించేందుకు వైఎస్ జన్మించారని కొనియాడారు. సుమారు 130 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్, 30 ఏళ్ల చరిత్ర కలిగిన టీడీపీ మూడేళ్ల క్రితం పుట్టిన వైఎస్‌ఆర్‌సీపీని చూసి భయపడతున్నాయని పేర్కొన్నారు. ప్రతి తల్లి విజయమ్మగా, ప్రతి సోదరి షర్మిలగా, ప్రతి సోదరుడు జగన్‌గా మారాలని పిలుపునిచ్చారు. పార్లమెంటులో వైఎస్ విగ్రహం ప్రతిష్టించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం వైఎస్‌ఆర్‌సీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు జూపూడి ప్రభాకరావు మాట్లాడారు. రాష్ట్రాన్ని 14 మంది ముఖ్యమంత్రులు పాలించారన్నారు. ప్రజల హృదయాల్లో నిలిచిపోయింది వైఎస్ మాత్రమేనన్నారు. కేంద్రమంత్రి చిదంబరం, మరికొందరి కుట్రలకు రాష్ట్రం బలైపోయిందన్నారు.
జగన్‌ను జైల్లో పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలను బలి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. జగన్ జైల్లో ఉన్నా ప్రజల కోసం ఆమరణదీక్ష చేసి నిజమైన నేతగా నిలిచారని కొనియాడారు. ప్రజల హృదయాల్లో నుంచి పుట్టిన వైఎస్‌ఆర్‌సీపీ తరపున జగన్ ఆదేశాలతో నేడు విజయమ్మ, షర్మిల సమైక్య శంఖారావాన్ని పూరించారని, రాష్ట్రంలో జైత్రయాత్ర సాగిస్తున్నారని తెలిపారు. తర్వాత చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రసంగించారు. స్వాతంత్య్రం తర్వాత ప్రధాని పదవి కోసం జిన్నా, జవహర్‌లాల్ నెహ్రూ దేశాన్ని భారతదేశం, పాకిస్తాన్‌లుగా చీల్చారన్నారు. తాతకు వారసుడిగా ఆంధ్రప్రదేశ్‌ను చీల్చడం ద్వారా రాహూల్ ప్రధాని పదవిని పొందవచ్చని ఆశిస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఒక రోజు మందు, మరో రోజు నిద్ర, మరుసటి రోజు ప్రెస్‌మీట్‌లతో కాలక్షేపం చేసే కేసీఆర్ కోర్కె మేరకు తెలంగాణ ప్రకటించారని అన్నారు. పొట్టి శ్రీరాములు, బూర్గుల రామకృష్ణారావు త్యాగాలను కాంగ్రెస్ బూడిదపాలు చేసిందని విమర్శించారు. వారి వారి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసిన చిదంబరం, అహ్మద్‌పటేల్, ఆంటోని, దిగ్విజయ్ సింగ్‌లు ఆంధ్రప్రదేశ్ పెద్దలుగా కొనసాగుతున్నారని ఎద్దేవా చేశారు. జైల్లో ఉన్నా జనం గురించి ఆలోచిస్తున్నది జగన్ మాత్రమేనని అన్నారు. కిరణ్, చంద్రబాబు పుట్టిన చిత్తూరు జిల్లాలో తానూ జన్మించినందుకు సిగ్గుతో తలవంచుకుంటూ క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. ైవె ఎస్ ఎక్కడికీ పోలేదని, ప్రజల హృదయాల్లో సుస్థిరంగా ఉన్నారని తెలిపారు. అనంతరం పార్టీ గుంటూరు జిల్లా ఇన్‌చార్జ్ గౌతంరెడ్డి, నేతలు విజయచందర్, రామిరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజ్‌కుమార్, ఆడిటర్ జేకే రెడ్డి, ఆస్కా ట్రస్టీలు శ్రీనివాసులు రెడ్డి, స్వర్ణలతారెడ్డి ప్రసంగించారు.
తరలివచ్చిన అభిమానులు
వైఎస్ సంస్మరణ సభకు పెద్దసంఖ్యలో ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. వక్తల ప్రసంగాలకు సభికులు జోహార్ వైఎస్‌ఆర్, జగన్ నాయకత్వం వర్థిలాల్లి అంటూ నినాదాలతో హోరెత్తించారు. పార్టీ తమిళనాడు విభాగం నేతలు శరత్, రామిరెడ్డి, శరవణన్, జకీర్ హుస్సేన్, ఆరిఫ్, శ్రీరామ్, మాధవరెడ్డి, ద్వారకనాథ్‌రెడ్డి, సాత్విక్, బోసు, ప్రదీప్, ఆదినారాయణ రెడ్డి తదితరులు సభను విజయవంతంగా నిర్వహించారు.
Advertisement
Advertisement