కళాశాల రిజిస్టర్‌లో విద్యార్థి వైఎస్సార్ పేరు , విద్యార్థిగా వైఎస్సార్
రాజశేఖరరెడ్డి.. ఈ పేరు వినగానే ప్రతి తెలుగు హృదయం సంతోషంతో పులకిస్తుంది. మల్లెపువ్వు వంటి చిరునవ్వు, నిష్కల్మషమైన హృదయానికి నిలువెత్తు రూపం ఆయనదని ప్రతి గుండే కొనియాడుతుంది. సంక్షేమ పథకాల రారాజుగా తెలుగునాట ప్రతి ఇంటా భోగభాగ్యాల కోసం అహరహం శ్రమించిన మహానేత పుట్టినరోజు నేడు. ఆ మహా వ్యక్తి నేడు మన మధ్య లేకపోయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా వ్యవహరించి అపారమైన ప్రజాసంక్షేమ పథకాలు, రైతు స్నేహి ఆలోచనలతో ఆయన కోట్లాది మంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కర్ణాటకలో కూడా ప్రజలపై వైఎస్సార్‌ది చెరగని ముద్ర. ముఖ్యంగా బళ్లారి జిల్లాతో విడదీయలేని అనుబంధం ఉంది. వైఎస్సార్ 7వ తరగతి నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌సీ (టెన్త్)తో పాటు డిగ్రీ ఫస్ట్ ఇయర్.. ఇలా ఆరేళ్ల పాటు బళ్లారి నగరంలో చదువుకున్నారు. ఎంతో మంది మిత్రులు ఉన్నారు.
సాక్షి, బళ్లారి: పువ్వు పుట్టగానే పరమళిస్తుందని పెద్దలు అంటారు. మహానుభావులు, మహానేతలు కూడా బాల్యం నుంచే సత్ప్రవర్తన, ఆదర్శభావాలతో అందరి మన్ననలు అందుకుంటూ సమాజంలో గుర్తింపు తెచ్చుకొంటారు. తెలుగు జాతి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన రాజకీయ నేతల్లో అగ్రస్థానం అలంకరించే మహాపురుషుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. కడప జిల్లా స్వస్థలమైనప్పటికీ, ఆ ప్రాంతం తరువాత కర్ణాటకలోని బళ్లారితో మహానేతకు అంతటి అనుబంధం పెనవేసుకుని ఉంది.
చిన్ననాడే గొప్ప వ్యక్తిత్వం
చదువుకున్న రోజుల్లోనే ఎంతో గొప్ప వ్యక్తిత్వంతో తోటివారికి సేవచేయాలనే తపన, ఉత్సాహం ఆయ నలో పువ్వులోని పరిమళంలా వెన్నంటే ఉండేవి. ఎన్నో సుగుణాలు కలిగిన వైఎస్ రాజశేఖరరెడ్డి బళ్లారిలో చదవడంతో బళ్లారి ఖ్యాతి కూడా దశదిశ లా వ్యాపించింది. ఆయనతో పాటు చదివినవారు, మిత్రులు తమ స్నేహితున్ని గురించి నిత్యం గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. 1958వ సంవత్సరంలో బళ్లారికి వచ్చారు. సెయింట్‌జాన్స్ పాఠశాలలో హైస్కూల్ చదువులను çపూర్తి చేసుకొని, అనంతరం 1964లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ బళ్లారిలో చదివారు. కోట ప్రాంతంలో ఇల్లు తండ్రి రాజారెడ్డి బళ్లారిలో కాంట్రాక్టర్‌గా పని చేసు ్తన్న సమయంలో ఆయన పిల్లల చదువుల కోసం బళ్లారిలోనే కోట ప్రాంతంలో కొంతకాలం నివసిం చారు. వైఎస్సార్‌తో పాటు ఆయన సోదరులు వైఎస్ జార్జిరెడ్డి, వివేకానందరెడ్డి, సోదరి విమలమ్మను బళ్లారిలో విద్యాభ్యాసం చేయించారు. వైఎస్ రాజారెడ్డి సంతానంలో అందరి కంటే ఎంతో చురుకైనవానిగా వైఎస్ రాజశేఖరరెడ్డి చిన్నప్పటి నుంచి తన ప్రతిభను చూపేవారు. హాస్టల్‌లో ఉన్నప్పుడు కూడా తోటి వి ద్యార్థులకు ఎంతో అండగా ఉండేవారు. తండ్రి రాజారెడ్డి ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బుల్లో ఆయన తోటి విద్యార్థులకు ఫీజులు కట్టిన సందర్భాలు ఎన్నో ఉ న్నాయన్నారు. అంతే కాదు నాయకత్వ లక్షణాలు ఆయనలో చిన్నప్పటి నుంచే పుష్కలంగా ఉన్నాయి. అవే లక్షణాలు ఆయన మునుముందు చరిత్ర పుట ల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా దోహదం చేశాయి.
అలనాడు బళ్లారిలో కాలేజీ రోజుల్లో వైఎస్ రాజశేఖరరెడ్డితో మిత్రులు
వీరశైవ కాలేజీలో డిగ్రీ, గుల్బర్గాలో మెడిసిన్
బళ్లారిలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ ముగిసిన తర్వాత ఇంటర్‌మీడియేట్‌ను విజయవాడలోని లయోలా కాలేజీలో పూర్తిచేశారు. అనంతరం డిగ్రీని బళ్లారి నగరంలోని వీరశైవ కళాశాలలో చదువుతుండగానే ఎంబీబీఎస్ సీటు రావడంతో గుల్బర్గా మెడికల్ కాలేజీలో చదివి డాక్టర్ అయ్యారు. ఎంబీబీఎస్ కూడా కర్ణాటకలో పూర్తి చేయడంతో ఆయన విద్యాభ్యాసం దాదాపు కర్ణాటకలోనే కొనసాగింది. మహానేత వైఎస్సార్ ఎంతఎత్తుకు ఎదిగినా చిన్ననాటి మిత్రులను, చదివిన పాఠశాలను ఆయన ఎప్పుడు గుర్తు చేసుకునేవారు. ఆ జ్ఞాపకాలు ఆయన మదిలో పచ్చని పొదలా ఉండేవి. సంక్షేమానికి పర్యాయపదంగా మారిన మహానేత జయంత్యుత్సవం సందర్భంగా ఆయనతో ఉన్న మధుర జ్ఞాపకాలను బళ్లారిలో మిత్రులు సాక్షితో గుర్తుచేసుకున్నారు.
ఆయనంటే అందరికీ ఇష్టం
వైఎస్సార్ అంటే అందరూ తరగతి గదిలో ఇష్టపడేవాళ్లం. ఎస్‌ఎస్‌ఎల్‌సీలో కూడా మంచి పార్కులతో పాసయ్యారు. ఆయన బళ్లారిలో విద్యనభ్యసించిన తర్వాత విజయవాడ, గుల్బర్గాలో విద్యాభాస్యం పూర్తి చేశారు. అనంతరం ఆయన చిన్ననాటి స్నేహితుడు, మా అందరికి మిత్రుడు దివంగత లెనార్డ్ గొంజాల్వెజ్ మాత్రమే వైఎస్సార్‌ను కలుస్తుండేవారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయాల్లోకి చేరిన తర్వాత అంచెలంచెలుగా అత్యున్నత స్థాయికి చేరుకోవడంతో తాము ఆయన్ను పలకరించేందుకు వెళితే ఆయన ఎంతో ఆత్మీయంగా మాట్లాడడం చూసి సంభ్రమానికి గురయ్యారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్‌ఆర్‌ను హైదరాబాద్‌లో క్యాంప్ ఆఫీస్‌లో కలిసేందుకు వెళ్లాం. సార్ బిజీగా ఉన్నారు.కలవడం ఇబ్బందిగా ఉంటుందని అక్కడ ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులు తమతో చెప్పారు. అయితే ఎంతో కష్టంతో తమ పేర్లను వైఎస్‌ఆర్‌కు చేర్చాం. తమ పేర్లు వైఎస్సార్‌కు చేరిన ఐదు నిమిషాల్లో తమ వద్దకే ఆయన లోపల నుంచి వచ్చి పలకరించడంతో పాటు తన వెంట లోపలికి తీసుకెళ్లడంతో తమనేకాకుండా అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. సీఎం క్యాంపు ఆఫీస్‌లో కూర్చొన్న తర్వాత ప్రతి ఒక్క క్లాస్‌మేట్ పేరు, పేరును గుర్తు చేసుకుంటూ వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. సీఎం అయిన తర్వాత ఎప్పుడు హైదరాబాద్ లేక ఆయన ఎక్కడ ఉన్న తాము అక్కడికి వెళితే ముందుగా తమకు అపాయింట్‌మెంట్ ఇచ్చేవారు. స్నేహితులు అంటే ఆయనకు పంచప్రాణాలు. అపారమైన జ్ఞాపకశక్తి ఉండటంతోనే ప్రతి ఒక్కరిని పేరు పేరును పలకరించేవారు. చిన్నప్పుడు హాస్టల్, పాఠశాలలో ఎలా మాట్లాడేవారో, అప్పుడూ అలాగే మాట్లాడారు. ఏ కష్టమొచ్చినా తనకు చెప్పాలని కోరారు. ప్రజలకు సేవ చేసే గుణం, నమ్మకం, స్నేహానికి ప్రతిరూపంగా, నమ్మిన వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడే ధీరత్వం ఆయనది. ఆయన మృతి చెందిన వార్త విని మా కుటుంబంలో ఒకరిని కోల్పోయామన్న బాధ కలిగింది. ఆయన ఈ లోకాన్ని వీడి 10 సంవత్సరాలు అయినా నేటికీ తమ మదిలో నిలిచిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment