జీవితం ఎప్పటికప్పుడు నియామక పత్రం పంపుతుంది. గృహిణిగా.. ఉద్యోగినిగా.. అమ్మగా.. అత్తగారిగా.. అమ్మమ్మగా.. ‘జాయిన్ ఇమీడియట్‌లీ’ అని అపాయింట్మెంట్ లెటర్. అరవై ఏళ్లకు అన్ని ‘ఉద్యోగాల’ విరమణ! తర్వాతేంటి?! మనమే ఇచ్చుకోవాలి.. సెల్ఫ్ అపాయింట్మెంట్ లెటర్. సేవకు.. సంతృప్తికి.. సంతోషానికి.. సఫలతకు.
అరవై ఏళ్లంటే మహిళలు తమను తాము దూరం చేసుకునే వయసు. గృహిణి విషయానికి వస్తే... పిల్లలకు పెళ్లిళ్లు అయిపోయి ఉంటాయి. పిల్లల జీవితంలో తన అవసరం కనిపించకపోవడం ఆమెను ఆందోళనకు గురి చేస్తుంది. ప్రతి చిన్న విషయానికీ పిల్లల జీవితంలో జోక్యం చేసుకుంటూ సలహాలు ఇస్తుంటారు. అకారణంగా అభద్రత ఆవరిస్తుంది. కోడలు ఉద్యోగానికి వెళ్లే హడావుడిలో పెరుగు తోడు పెట్టి చిన్న గిన్నె మీద పెట్టిన పెద్ద మూత కూడా పెద్ద తప్పుగా కనిపిస్తుంది. ఇవన్నీ చెప్పుకోవడానికి కూతురికి ఫోన్ చేసి చెప్పడం అలవాటు అవుతుంది. కాలక్షేపం కోసం సాయంత్రాలు గుడికి వెళ్తున్నా అక్కడా తన వయసు వాళ్లతో ఇంటి అసంతృప్త కబుర్లలోనే గడిపేస్తుంటారు. మొత్తానికి ఏదో వెలితి. సంతోషంగా జీవించలేరు.
ఇకపై ఏం చేయాలి?
ఉద్యోగం నుంచి రిటైర్ అయిన వాళ్లది మరొక సమస్య. అప్పటి వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు డ్యూటీ చేసిన అలవాటుకు ఒక్కసారిగా ఫుల్‌స్టాప్ పడుతుంది. ఆ ఖాళీని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఇబ్బంది పడేవాళ్లు ఎందరో. నిజానికి జీవితాన్ని అర్థం చేసుకోగలిగిన వాళ్లకు అరవై అనేది మంచి సమయం. అప్పటి వరకు కుటుంబం కోసం పని చేసి ఉంటారు. అప్పటి నుంచి సమాజం కోసం పని చేయడానికి అరవై ఏళ్లవయసు అనువైన సమయం. అరవై నిండిన మహిళలను సామాజిక వ్యక్తులుగా మార్చడానికి పెద్ద ప్రయత్నమే జరగాలి. అలాంటి ఓ ప్రయత్నమే మిసెస్ ఇండియా సిక్స్‌టీ ప్లస్ పోటీలు. మిస్, మిసెస్ పోటీలనగానే కాస్మటిక్ కంపెనీలు నిర్వహించే అందాల పోటీలే గుర్తుకు వస్తాయి. కానీ ఇవి మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్న పోటీలు. ఒకసారి పోటీలో పాల్గొన్న తర్వాత ఆ మహిళలు సామాజికంగా పదిమందికి అవసరమైన కార్యక్రమాల్లో తమవంతు సేవలందించడానికి ముందుకు వస్తున్నారు.
నిజానికి మనం సంఘజీవులం అని తెలియచేసే ప్రయత్నమే ఈ మలివయసు పోటీలు. అయితే అరవై అనగానే దేహం మోకాళ్ల నొప్పులు, బీపీ, డయాబెటిస్‌ల నిలయం అనుకునే వాళ్లే ఎక్కువ. ఈ వయసులో మనకు మనమే బరువు, ఇక సమాజానికి ఏం చేస్తాం... అని నిర్లిప్తంగా ఉండే వాళ్లలో స్ఫూర్తి రగిలించడమే ఈ పోటీల ఉద్దేశం అని చెబుతున్నారు ‘మిసెస్ ఇండియా కర్నాటక’ పోటీల నిర్వహకురాలు ప్రతిభ. ఆమె గతంలో మిసెస్ ఇండియా పురస్కారగ్రహీత. ఇప్పటి వరకు నగరాలకే పరిమితమైన ఈ పోటీలను ఈ ఏడాది కర్నాటకలోని పట్టణాలకు తీసుకెళ్లారామె. ఈ ఏడాది పట్టణస్థాయి పోటీల్లో ‘మిసెస్ ఇండియా కర్నాటక, బళ్లారి’గా రజని లక్కా అనే మన తెలుగింటి మహిళ ఎంపికయ్యారు. అనంతపురం నుంచి బళ్లారికి వెళ్లి అక్కడే స్థిరపడిన కుటుంబం వాళ్లది.
మలి సంధ్య పూదోట
నా వయసు మహిళలందరికీ నేను చెప్పేది ఒక్కటే. కుటుంబానికి మీరు చేయాల్సిన పనులు కనిపించడం లేదంటే... ఇక మీరు సమాజం కోసం పని చేయాల్సిన సమయం మొదలైందని అర్థం. ఇతరుల కోసం మీకు చేతనైన పని చేయండి. వంట చేయడం తప్ప మరేమీ రావనుకుంటే... మీ చుట్టుపక్కల కొత్తగా పెళ్లయిన అమ్మాయిలకు వంటలో మెళకువలు నేర్పించండి. పిల్లలకు కథలు చెప్పడం మీకిష్టమైన వ్యాపకం అయినట్లయితే చుట్టుపక్కల పిల్లలకు కథలు చెప్పండి. కొత్తతరానికి ఈ అవసరాలున్నాయి. ఆ అవసరాన్ని మీరు నెరవేర్చండి. అరవైల తర్వాత జీవితం అంటే మీకోసం మీరు పెంచుకోగలిగిన చక్కటి పూలతోట. ఇంకా పాతికేళ్లు జీవించాల్సి ఉంటుంది. పాతికేళ్ల కాలాన్ని వృథాగా గడిపేయకూడదు. ఆరోగ్యవంతంగా, ఆత్మవిశ్వాసంతో జీవించాలి
– రజని లక్కా, ‘మిసెస్ ఇండియా కర్నాటక, బళ్లారి’ విజేత
నవ్వు వెనుక నమ్మకం
నలభై లోపు, నలభై పై బడిన వారు, అరవై నిండిన వాళ్లు... ఈ మూడు కేటగిరీల్లో పోటీలు జరిగాయి. టాలెంట్, స్మైల్, ఫిట్ అవార్డులు కూడా ఉంటాయి. ముఖ్యంగా మహిళల్లో ఆత్మవిశ్వాసం స్థాయిలే ఇందులో ప్రధానమైన కొలమానం. మొన్నటి పోటీలో.. ‘మీ గురించి మీరు చెప్పండి’ అనే ప్రశ్నకు సమాధానం చెప్పడానికి పోటీలో పాల్గొన్న చాలామంది తడబడ్డారు. ‘‘నిజానికి వాళ్లలో చాలామంది తమకంటూ చెప్పుకోగలిగిన కొన్ని ప్రత్యేకమైన నైపుణ్యాలు ఉన్నవాళ్లే. అయినా వాటిని ఎలా చెప్పాలో తెలియక పోవడమే వారి తడబాటుకు కారణం. ఈ పోటీలో విజేత కాలేక పోయినప్పటికీ ఇందులో పాల్గొన్న తర్వాత వాళ్లు ఆ ప్రశ్నకు జవాబు కోసం తమను తాము శోధించుకుంటారు. మరోసారి ఇలాంటి ప్రశ్న ఎదురైతే దీటుగా బదులివ్వగలుగుతారు. ఇందులో పాల్గొన్న వాళ్లకే కాదు, చూసిన వాళ్లలో కూడా ఆలోచన స్థాయిని విస్తృతపరుస్తాయి ఈ పోటీలు. నాకు ఈత వచ్చు.
వికలాంగులకు ఈత నేర్పిస్తున్నాను. సమాజానికి నేను ఇస్తున్న సహకారం ఇది. ప్రతిఫలాపేక్ష లేకుండా చేస్తున్న పనిలో నాకు కలుగుతున్న సంతోషాన్ని కొలవడానికి కొలమానాలు ఉండవు. సమాజానికి నేను చేయాల్సిన పని ఇంకా ఉందనే ఆలోచనే నన్ను నిత్యం పనిలో నిమగ్నం చేస్తోంది. అదే నాకు ఆరోగ్యం. అదే నాకు ఫిట్‌నెస్. నా నవ్వులో ప్రతిబింబించే ఆత్మవిశ్వాసం వెనుక ఇవన్నీ ఉన్నాయి’’ అన్నారు రజని లక్కా. తొలిదశ పోటీలు ఫిబ్రవరిలో మొదలయ్యాయి. కరోనా కారణంగా రాష్ట్ర స్థాయి పోటీలు వాయిదా పడ్డాయి. ఎప్పుడు జరిగితే అప్పుడు రాష్ట్ర స్థాయి పోటీలకు హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నట్లు’ రజని చెప్పారు.
– వాకా మంజులారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment