తస్మాత్‌ జాగ్రత్త! | Be Careful | Sakshi
Sakshi News home page

తస్మాత్‌ జాగ్రత్త!

Published Wed, Jun 20 2018 1:25 PM | Last Updated on Wed, Jun 20 2018 1:25 PM

Be Careful - Sakshi

విద్యార్థుల వద్ద తనిఖీలు 

సాక్షి, చెన్నై : ‘‘ వీరంగాలు సృష్టించినా, బస్సు డే పేరుతో హంగామా సృష్టించినా, ఆయుధాలతో పట్టుబడ్డా, ఈవ్‌ టీజింగ్, ర్యాంగింగ్‌ అంటూ వేధింపులకు పాల్పడ్డ పక్షంలో తస్మాత్‌ జాగ్రత్త ఇక, కట కటాల్లోకే అని విద్యార్థులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఆయుధాలతో కళాశాలలకు వస్తూ పట్టుబడ్డ ఎనిమిది మందిని మంగళవారం కటకటాల్లోకి నెట్టారు. చెన్నైలోని అన్ని కళాశాలల వద్ద నిఘాను కట్టుదిట్టం చేశారు. పోలీసు తనిఖీల అనంతరం విద్యార్థుల్ని కళాశాలల్లోకి అనుమతించారు.


విద్యాసంవత్సరం ప్రారంభమైతే చాలు చెన్నైలోని కళాశాలల వద్ద ఉత్కంఠ తప్పదు. ప్రధానంగా  పచ్చయప్పాస్, ప్రెసీడెన్సీ, నందనం, న్యూ కాలేజ్, త్యాగరాయ, క్వీన్‌ మేరిస్, ఎతిరాజ్, భారతీ ఆర్ట్స్, కాయిదేమిల్లత్‌ కళాశాలల బస్సు రూటు మార్గాల్లో కొందరు విద్యార్థుల వీరంగాలు ప్రయాణికుల్ని తీవ్ర ఇక్కట్లకు గురి చేయడం జరుగుతోంది. ఆయా రూట్లలో నాయకుడి చలామణి అయ్యే రీతిలో కొందరు విద్యార్థులు గ్రూపులుగ్రూపులుగా ఏర్పడి సాగించే వీరంగాలు వివాదాలకు, ఉద్రిక్తతకు దారి తీసిన సందర్భాలు అనేకం. అలాగే, బస్సుడే పేరుతో బస్సుల్ని తమ ఆధీనంలోకి తీసుకుని సాగించే హంగామాకు హద్దే లేదు. కోర్టు సైతం స్పందించి బస్‌ డేకు బ్రేక్‌ వేయాల్సిన పరిస్థితి గతంలో వచ్చింది.

అయినా, అడపాదడపా విద్యార్థులు తమ పనితనాన్ని ప్రదర్శించడం జరుగుతున్నాయి. అలాగే, ఆయుధాలతో కళాశాలలకు రావడం ఓ ఫ్యాషన్‌గా మలచుకుని ఉండడం గత ఏడాది సాగిన వివాదాల సందర్భంగా వెలుగులోకి వచ్చింది. ఇక, విద్యా సంస్థల్లో ర్యాంగింగ్‌ కట్టడి లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నా, కఠినంగా శిక్షించే చట్టాలు అమల్లోకి వచ్చినా, ఎక్కడో ఓ చోట ర్యాగింగ్‌ భూతం తాండవం చేస్తూనే ఉంది. కొన్ని కళాశాలల్లో ఆకతాయి తనంతో చాప కింద నీరులా ర్యాగింగ్‌ వ్యవహారం సాగుతూనే ఉంది. ఈ పరిణామాలన్నింటినీ పరిగణించిన పోలీసులు ఈ సారి వీరంగాలు సృష్టించే విద్యార్థులతో కఠినంగానే వ్యవహరించేందుకు ముందుగానే సిద్ధం అయ్యారు. 


తల్లిదండ్రులకు సైతం హెచ్చరికలు
గత అనుభవాల దృష్ట్యా, కొన్నిరూట్లలో సాగే బస్సుల్లో వీరంగాలు సృష్టించే విద్యార్థుల జాబితాల్ని ముందుగానే పోలీసులు సిద్ధం చేశారు. కమిషనర్‌ ఏకే విశ్వనాథన్‌ ఆదేశాలతో ఆయా విద్యార్థుల తల్లిదండ్రుల్ని పిలిపించి మరీ మరోమారు పిల్లల వీరంగాలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని మందలించి, క్లాస్‌ పీకి పంపించారు. అయినా, కుర్ర కారు ఏ మాత్రం తగ్గమన్నట్టుగా తొలిరోజే తమ పనితనాన్ని అనేక కళాశాలల వద్ద కొందరు విద్యార్థులు ప్రదర్శించారు. 
రైళ్లలోనూ :
బస్సులు, రోడ్ల మీదే కాదు, రైల్వేస్టేషన్లు, ఈఎంయూ రైళ్లల్లోనూ ఆకతాయి విద్యార్థుల వీరంగాలు మరీ ఎక్కువే. దీంతో రైల్వే పోలీసు యంత్రాంగం సైతం విద్యార్థులకు హెచ్చరికలు చేసింది. అలాగే, మంగళవారం ప్రయాణికుల్ని అప్రమత్తం చేస్తూ కరపత్రాల్ని పంపిణీ చేశారు. విద్యార్థులు వీరంగాలు సృష్టించి, రైల్వేస్టేషన్లలో గంటల తరబడి తిష్ట వేసి హంగామా సాగించినా, ఫుట్‌బోర్డులో వేలాడుతూ ప్రయాణికులకు ఇబ్బంది కల్గించే రీతిలో విద్యార్థులు ఎవరైనా వ్యవహరించిన పక్షంలో ఆర్‌పీఎఫ్‌–182 టోల్‌ ›ఫ్రీకి సమాచారం అందించాలని సూచించే పనిలో రైల్వే పోలీసులు నిమగ్నమయ్యారు. 

తొలిరోజే 
ఇంజినీరింగ్, న్యాయ, వైద్య కళాశాలల మినహా తక్కిన ఆర్ట్స్, సైన్స్‌ కళాశాలలు అన్నీ సోమవారం నుంచి పునఃప్రారంభమయ్యాయి. తొలి రోజే అనేక రూట్లలో విద్యార్థులు తమ పనితనాన్ని ప్రదర్శించారు. ముందుగానే పోలీసులు ఆయా మార్గాల్లో మాటేసి మరీ, వీరంగాలు సృష్టించి వారి భరతం పట్టే రీతిలో ముందుకు సాగారు. ఆయుధాలతో కళాశాలలకు వెళ్తున్న వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కొన్ని రూట్లలో అయితే, బస్సు టికెట్టును కూడా తీసుకోకుండా, కండక్టర్లను వేధిస్తూ అనేక మంది విద్యార్థులు ముందుకు సాగడంతో వారిని సైతం అదుపులోకి తీసుకున్నారు. ఇలా వంద మంది వరకు తమ చేతికి చిక్కడంతో వారి భరతం పట్టే రీతిలో తమ రుచిని పోలీసులు చూపించారని చెప్పవచ్చు.

మంగళవారం కొందరు విద్యార్థుల తల్లిదండ్రుల్ని పిలిపించి చీవాట్లు పెట్టారు. మరో మారు చిక్కిన పక్షంలో ఇక జైలే అన్న హెచ్చరికను చేసి పంపించారు. అలాగే, ఆయుధాలతో చిక్కిన 11 మందిని మాత్రం పోలీసులు విడిచిపెట్టలేదు. వీరి మీద కేసుల్ని నమోదు చేశారు. కోర్టులో హాజరు పరిచి కటకటాల్లోకి నెట్టారు. ఇందులో ముగ్గురు పూర్వ విద్యార్థులు, ఓ బాలుడు సైతం ఉండడం గమనార్హం. బాలుడ్ని జువెనల్‌ హోంకు తరలించి, మిగిలిన వారిని కటకటాల్లోకినెట్టారు. ఇక, ఉదయం నుంచి అన్ని కళాశాలల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. మహిళ కళాశాలను సైతం పోలీసులు వదలి పెట్టలే. అన్ని చోట్ల ప్రతి ఒక్క విద్యార్థిని తనిఖీలు చేసినానంతరం లోనికి అనుమతించారు. ఏ విద్యార్థి వద్దనైనా చిన్న పాటి ఆయుధం ఉన్నా సరే, అతడ్ని అదుపులోకి తీసుకుంటూ ముందుకు సాగారు. పచ్చయప్పాస్, ప్రెసిడెన్సీ విద్యార్థులు అత్యధికంగా రౌడీయిజం అన్నట్టుగా ముందుకు సాగడంతో రెండు రోజులు పాటుగా కళాశాలలకు సెలవు సైతం ప్రకటించినట్టు సమాచారం. ఇక, విద్యార్థి వద్ద ఆయుధం అన్నది కనిపించినా, బస్సుల్లో వీరంగాలు సృష్టిస్తున్నట్టు సమాచారం వచ్చినా వారి భరతం పట్టడమే కాదు, కటకట్టాలోకి నెట్టబడుతారని కమిషనర్‌ విశ్వనాథన్‌ హెచ్చరికలు చేయడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement