సాక్షి, హైదరాబాద్ : సూపర్ స్టార్ రజనీ కాంత్ పొలిటికల్ ఎంట్రీపై అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి ప్రకటనను డిసెంబర్ 31న చేస్తానని రజనీ చెప్పడంతో ఆయన అభిమానుల్లో ఓ సందిగ్ధం నెలకొంది. కొత్త నిర్ణయాలను నూతన సంవత్సరంలో తీసుకుంటారు. కానీ, రజనీ పాత ఏడాది చివరి రోజున వెల్లడిస్తానని చెప్పడంతో.. రజనీ రాజకీయ రంగ ప్రవేశ తేదీపై ఓ చర్చ కొనసాగుతోంది. డిసెంబర్31 రోజునే రాజకీయ ప్రవేశంపై ప్రకటన ఎందుకు? పుట్టిన రోజున ఎందుకు చెప్పలేదు? కొత్త సంవత్సరం రోజున చెప్పోచ్చు కదా? అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. రాజకీయ ప్రవేశంపై రజనీ ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. రజనీలో ఆధ్యాత్మికత పాలు కాస్త ఎక్కువ. మాస్ హీరోగా ఉన్న సమయంలో తన వందో చిత్రంగా రాఘవేంద్ర స్వామి జీవిత కథతో సినిమా రూపొందించడం సాహసమే. రాజకీయాల్లో పడిపోతున్న విలువల నేపథ్యంలో ఆధ్మాత్మికత తప్ప దేశాన్ని రక్షించే మార్గం మరోటి లేదని బలంగా నమ్ముతారు రజనీ.
రజనీ న్యూమరాలజీ నమ్ముతారని తన అదృష్ట సంఖ్య ఎనిమిది అని అందుకే తేదీలో ఎనిమిది వచ్చే రోజును ఎంచుకున్నారని 31–12–2017(3+1+1+2+2+0+1+7=17=1+7=8) సంఖ్యానిపుణులు అంటున్నారు. అంతేకాకుండా రజనీ ఆల్‌టైం హిట్ చిత్రం భాషాలోనూ ఎనిమిది అంకె ప్రాముఖ్యత వచ్చేలా 'రా రా రామయ్య ఎనిమిదిలో లోకం ఉంది చూడయా' ఓ పాట కూడా ఉండటం విశేషం. దీనికి తోడు సంఖ్యా నిపుణులు కూడా రజనీకి ఎనిమిది అదృష్ట సంఖ్య అని చెబుతున్నారు. రజనీ రాజకీయ ప్రవేశం చేస్తారా? చేస్తే న్యూమరాలజీ తో విజయం సాధిస్తారా అని వేచిచూడాలి.
Comments
Please login to add a commentAdd a comment