శ్రీకాళహస్తి ఆలయం రాహుకేతు పూజలకు ప్రసిద్ధి. ఆలయ ఆదాయంలో 85శాతం కేవలం ఈ పూజల ద్వారానే వస్తుంది. అంతటి ప్రాశస్త్యం ఉన్న పూజలు పేదలకు అందుబాటులో లేకుండా టిక్కెట్ ధరలు పెంచడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై పునరాలోచించాలని భక్తులు కోరుతున్నారు.
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి ఆలయంలో రాహుకేతు పూజలు చేయిస్తే సర్వ దోషాలు నివారణ అవుతాయని భక్తుల నమ్మకం. అందుకే ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న పూజలు పెద్దలకు మాత్రమే పరిమితం కాకూడదనే ఉద్దేశంతో పేదల కోసం రూ.250 టికెట్ ఏర్పాటు చేశారు. అలాగే రూ.750, రూ.1,500, రూ.2,500, రూ.5000 టికెట్లు కూడా ఉన్నాయి. భక్తులు వారివారి స్థోమతను బట్టి పూజలు చేయించుకుంటున్నారు. పెద్దలు ఎక్కువగా చేయించే టికెట్ల జోలికిపోని అధికారులు పదేళ్ల క్రితం రూ.250 టికెట్‌ను రూ.300కు పెంచారు. ఇకపై దాని ధర పెంచబోమని అప్పటి అధికారులు వెల్ల డించారు. ఆ మాటను పక్కనబెట్టి ప్రస్తుతం రూ.300 టికెట్‌ను రూ.500లు చేశారు. దీనిపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానాన్ని పూర్తిగా వ్యాపార కేంద్రం చేసేశారంటూ మండిపడుతున్నారు.
మాస్టర్ ప్లాన్ అమలుకు రూ.కోట్లలో ఖర్చు చేయాలి..
భక్తుల సౌకర్యం కోసం ఏర్పాటు చేస్తున్న మాస్టర్‌ప్లాన్ పూర్తి చేయడానికి కొన్ని కోట్ల రూపాయిలు ఖర్చు చేయాల్సి ఉంది. ఇక పూజా సామగ్రి ధరలు పెరిగిపోయిన విషయం తెలిసిందే. విధిలేని పరిస్థితుల్లో రూ.300 టికెట్‌ను రూ.500 చేయాల్సి వచ్చింది. – భ్రమరాంబ, ఆలయ ఈఓ
ముందస్తు సమాచారం లేకుండా పెంచేశారు
దేవస్థానం వారు ధరలు పెంచాలంటే పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేయాల్సి ఉంది. ముందస్తు సమాచారం లేకుండా ఇలా ఒక్కసారిగా పెంచడం సరికాదు. చిన్నపాటి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న మాలాంటి వారికి ఇది భారమవుతుంది. రూ.200 అదనంగా ఖర్చు కావడంవల్ల శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లోని ఆలయాలను దర్శించుకో కుండా వెళ్లిపోతున్నాం. –రామయ్యగౌడ్, మహేశ్వరి
ఒక్కసారిగా రూ.200 పెంచడం సరికాదు
రూ.300 టికెట్ ధరను ఒక్కసారిగా రూ.200 పెంచడం సరికాదు. పేద వారికి అందుబాటులో ఉండే టికెట్ ఇదొక్కటే. దాన్నే పెంచేశారు. నేను ఆరు నెలలకొకసారి సికింద్రాబాద్ నుంచి వచ్చి పూజ చేయిస్తుంటాను. దేవాదాయ శాఖ మరోసారి ధర పెంపుపై ఆలోచన చేయాల్సి ఉంది. – నివేద్‌వర్మ, ఆశ, దంపతులు
Comments
Please login to add a commentAdd a comment