Ticket Prices Hiked
-
అమెరికా వెళ్లి చదువుకునే విద్యార్థులకు షాక్
సాక్షి ప్రతినిధి, అనంతపురం: భారీగా పెరిగిన విమానయాన చార్జీలు విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకుంటున్న వారికి ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా విమాన చార్జీలు పెరిగాయి. 60 నుంచి 70 శాతం వరకు పెరగడంతో అమెరికా, ఇతర దేశాలకు చదువు కోసం వెళ్లేవారు లబోదిబోమంటున్నారు. మరీ ముఖ్యంగా ఆగస్టు మాసంలో ఎక్కువ రేట్లు నమోదయ్యాయి. కోవిడ్‌కు ముందు అమెరికాకు విమాన చార్జీ రూ.80 వేల నుంచి రూ.90 వేల వరకూ మాత్రమే ఉండేది. ఈ ఏడాది ఆగస్టులో అమెరికా వెళ్లే వారు కనీసం రూ.1.60 లక్షలు విమాన టికెట్‌కే వెచ్చించాల్సి వస్తోంది. దీంతో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల నుంచి ఈ ఏడాది 280 మంది దాకా విద్యార్థులు అమెరికాలో చదువుకోవడానికి వెళుతున్నారు. బ్రిటన్, కెనడా, ఆ్రస్టేలియా తదితర దేశాలకూ వెళుతున్న వారు పదుల సంఖ్యలోనే ఉన్నారు. రెండు మాసాల ముందు బుక్ చేసుకుంటేనే... అమెరికాలో సెప్టెంబర్ నుంచి విద్యా సంవత్సరం మొదలవుతుంది. దీంతో ఆగస్ట్ 25 నాటికే అక్కడికి చేరుకుంటారు. ఇందుకోసం జూన్‌లో విమాన టికెట్ బుక్ చేసుకున్న వారికి రమారమి రూ.1.55 లక్షలు అయ్యింది. ఇక అప్పటికప్పుడు అంటే రూ.2 లక్షల దాకా వెచ్చించాల్సి వస్తోందని శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బకు చెందిన ప్రసాద్‌కుమార్ అనే విద్యార్థి చెప్పారు. రోజు రోజుకూ చార్జీలు పెరుగుతున్నాయని, గత రెండు నెలల్లో పెరగడమే గానీ ఎప్పుడూ తగ్గలేదని పలువురు విద్యార్థులు తెలిపారు. డాలర్ విలువ పెరగడంతో.. తాజాగా డాలర్‌తో రూపాయి మారకం విలువ సుమారు రూ.80కు పెరిగింది. దీనివల్ల అమెరికాకు వెళుతున్న భారతీయ విద్యార్థులపై పెనుభారం పడుతోంది. అమెరికాలో క్యూఎస్ ర్యాంకింగ్ 200 పైన ఉన్న ఏ యూనివర్సిటీలో అయినా కనీసం 40 వేల డాలర్ల ఫీజు ఉంటుంది. అదే వందలోపు ర్యాంకింగ్స్ ఉన్న వాటిలో 60 వేల నుంచి 70వేల డాలర్లు అవుతుంది. ప్రస్తుతం డాలర్ విలువ పెరగడంతో ఒక్కో విద్యార్థిపై రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ అదనపు భారం పడుతోంది. విమాన చార్జీలు ఎక్కువగా ఉన్నాయి నేను ఈ ఏడాది అమెరికాలోని బోస్టన్‌కు ఫార్మసీలో మాస్టర్స్ కోసం వెళుతున్నా. సాధారణంగా విద్యార్థులంతా ఆగస్టులోనే అమెరికాకు పయనమవుతారు. దీనివల్ల విమాన చార్జీలు ఎక్కువగా పెంచారు. సెప్టెంబర్ మాసంలో మళ్లీ తగ్గుతాయి. –నితీష్ కుమార్‌రెడ్డి, అనంతపురం డాలర్ రేటు పెరగడంతోనే.. నేను డల్లాస్‌లో మాస్టర్స్ చేయడానికి ఆగస్ట్ 23వ తేదీ వెళుతున్నా. విమాన టికెట్ రూ.1.55 లక్షలు అయ్యింది. దీంతో పాటు ఇటీవలే డాలర్ రేటు పెరగడంతో ఫీజుల్లోనూ తేడా వస్తోంది. దీనివల్ల మధ్యతరగతి వారికి ఆర్థిక భారం పడుతోంది. –శ్రీచరణ్, అనంతపురం విదేశాలకు వెళ్లే వారి సంఖ్య పెరిగింది కరోనా తర్వాత విదేశాల్లో చదువులు, సందర్శన కోసం వెళ్లే వారి సంఖ్య బాగా పెరిగింది. ఫలితంగా పాస్‌పోర్టుల నమోదు కూడా పెరిగింది. ఒక్క హిందూపురం కేంద్రంలోనే ప్రస్తుతం రోజూ 50 వరకు నమోదు అవుతున్నాయి. – రవిశంకర్, పాస్‌పోర్టు ఆఫీసర్, హిందూపురం -
‘ఆచార్య’ టికెట్ ధరల పెంపునకు అనుమతి
సాక్షి, అమరావతి: మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమా టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఆ సినిమా సూపర్ హైబడ్జెట్ కేటగిరీ కిందకు వస్తోంది. దాంతో ఆ సినిమా నిర్మాతల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి టికెట్ ధరల పెంపునకు అనుమతిచ్చింది. సినిమా విడుదల నాటి నుంచి పది రోజుల పాటు టికెట్‌పై రూ.50 పెంపునకు అనుమతిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. -
'ఆచార్య' టీంకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ నటించిన చిత్రం ఆచార్య. సురేఖ కొణిదెల సమర్పణలో నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఆచార్య టికెట్ ధరలు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈనెల 29 నుంచి మే 5వరకు టికెట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీని ప్రకారం ఒక్కో టికెట్‌పై మల్టీప్లెక్స్‌లో రూ. 50, సాధారణ థియేటర్స్‌లో రూ. 30 పెంచుకునేలా వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా ఆచార్య ఐదో ఆట ప్రదర్శనకు వారం రోజుల పాటు అనుమతి కల్పించింది. -
RRR Movie Tickets Prices: ఆర్ఆర్ఆర్ టికెట్ల ధరలు పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ల ధరలు పెంచుకొనేందుకు అనుమతిస్తూ హోంశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్ఆర్ఆర్ సినీ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఈ నెల 18న ప్రభుత్వానికి టికెట్ల ధరల పెంపుతోపాటు ఐదో షో నిర్వహణకు అనుమతివ్వాలని దరఖాస్తు చేసుకుంది. దీనిపై సానుకూలంగా స్పందించిన హోంశాఖ... ఏసీ థియేటర్లలో ఈ నెల 25 నుంచి 27 వరకు అంటే 3 రోజులపాటు టికెట్‌పై రూ. 50 పెంచుకొనేందుకు అవకాశం కల్పించింది. అలాగే 28వ తేదీ నుంచి వచ్చే నెల 3వరకు రూ.30 పెంచుకొనేలా వెసులుబాటు కల్పించింది. రిక్లైనర్, మల్టీఫ్లెక్స్, లార్జ్ స్క్రీన్ థియేటర్లలో ఈ నెల 25 నుంచి 27 వరకు టికెట్‌పై రూ. 100 పెంచుకొనేందుకు అంగీకరించింది. ఆ తర్వాత 28 నుంచి వచ్చే నెల 3 వరకు టికెట్‌పై రూ. 50 పెంచుకునేలా అవకాశం కల్పించినట్టు హోంశాఖ ఇన్చార్జి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు రోజుకు ఐదు షోలు ప్రదర్శించేందుకు సైతం అనుమతిచ్చినట్లు ఆయన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. -
టికెట్ ధరల విషయంలో ఏపీ నిర్ణయం బాగుంది
‘‘గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, జిల్లా కేంద్రాలు.. ఇలా ప్రాంతాలను బట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ ధరలు నిర్ణయించడం బాగుంది.. అలాంటి విధానం తెలంగాణ రాష్ట్రంలో కూడా వస్తే బాగుంటుంది’’ అని తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ– ‘‘తెలంగాణ ప్రభుత్వం టికెట్ల రేట్ల విషయంలో విడుదల చేసిన జీఓ 120 వల్ల చిన్న చిత్రాల నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు. ఏపీలోలాగా ప్రాంతాలను బట్టి టికెట్ రేటు ఉంటే తప్ప తెలంగాణలో చిన్న చిత్రాలు బతికి బట్టకట్టలేని పరిస్థితి. కచ్చితంగా జీవో 120ని సవరించాలి. అలాగే లీజు విధానాన్ని కూడా రద్దు చేయాలి. థియేటర్స్ యాజమాన్యాన్ని, ప్రభుత్వాలను పెద్ద నిర్మాతలు తప్పుదోవ పట్టిస్తున్నారు. టికెట్ రేట్లు పెంచుకున్నప్పుడు థియేటర్ అద్దెలు కూడా పెంచాలి.. కానీ పెంచడం లేదు. దీని వల్ల ఎగ్జిబిటర్స్ నష్టపోతున్నారు. ఇండస్ట్రీ ఆ నలుగురిది మాత్రమే కాదు. ఆ నలుగురైదుగురి దోపిడీ వల్ల చిన్న నిర్మాతలు, చిన్న హీరోలు మునిగిపోతున్నారు. అంతటా ఒకే రేటు కాకుండా పాత పద్ధతినే కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌గారిని కలిసి వివరిస్తాం’’ అన్నారు. తెలంగాణ డైరెక్టర్స్ యూనియన్ అధ్యక్షుడు ఆర్. రమేష్ నాయుడు, వైస్ ప్రెసిడెంట్ ఎస్. వంశీ గౌడ్, ‘టి మా’ జనరల్ సెక్రటరీలు సకమ్ స్నిగ్ధ, బి కిషోర్ తేజ, వైస్ ప్రెసిడెంట్ ఎ. కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఇలా..ఎలా?
ఉలవపాడు: చిల్లర తిప్పలు లేకుండా చేయడం కోసం అంటూ చార్జీల సవరణల పేరుతో ఆర్టీసీ ప్రయాణికుల నెత్తిన భారీ భారం మోపింది. పల్లె వెలుగు బస్సుల్లో ఒకటో తేదీ నుంచి కొత్త చార్జీలు అమల్లోకి తెచ్చింది. ఆదివారం బస్సులు ఎక్కిన ప్రయాణికులు కొత్త చార్జీలు చూసి అవాక్కయ్యారు. 10 శాతం టికెట్టు రాయితీ..అంటూ ఇచ్చిన క్యాట్‌కార్డులు, వనిత కార్డులు అసలు పనిచేయలేదు. ఇక 25 శాతం ఆధార్ తగ్గింపు కూడా 30 రూపాయలుపైన చార్జీ ఉన్న వారికి మాత్రమే వర్తించింది. ప్రయాణికులు ఇదేంటి ఇలా చేశారు.. ఇలా అయితే రాయితీ కార్డులు ఎందుకు అమ్మారని ఆర్టీసీ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఉలవపాడు నుంచి ఒంగోలుకు గతంలో 34 రూపాయల చార్జీ ఉంది. ఇప్పుడు ఆ చార్జీని చిల్లర పేరుతో 35 చేయాలి. కానీ 40 రూపాయలు చేశారు. రాయితీ కార్డులు ఉన్నా లేకున్నా అదే టికెట్టు కొనాల్సిందే. ప్రయాణికులు ఇదేంటని ప్రశ్నిస్తున్నారు. కండక్టర్లు సమాధానాలు చెప్పలేక సతమతమవుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా చార్జీలు భారీగా వడ్డించారని అర్థమైంది. ఉలవపాడు నుంచి సింగరాయకొండ, టంగుటూరు, కావలి వెళ్లాలంటే రాయితీ కార్డులు పనిచేయవు. వృద్ధుల ఆధార్ కార్డులు పనిచేయవు. ఇలా ప్రజలను ఇబ్బందులు పెట్టి ఎక్కువ వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. చార్జీల పెంపు అంటే ప్రభుత్వ వ్యతిరేకత వస్తుందని ఇలా చేశారని ప్రయాణికులంటున్నారు. ఉపయోగం లేని రాయితీ కార్డులు ఆదివారం ప్రారంభమైన కొత్త చార్జీల్లో రాయితీ కార్డులు ఏ మాత్రం పనిచేయలేదు. కార్డు నంబర్ కొట్టినా సాధారణ చార్జీనే వస్తోంది. గతంలో రాయితీ కార్డులు ఆర్టీసీ సిబ్బంది అన్ని గ్రామాలకు వెళ్లి వీలైనన్ని ఎక్కువ అమ్మారు. జిల్లా జనాభాలో సగం మందికి క్యాట్ కార్డులు ఉన్నాయి. తెల్లరేషన్ కార్డుదారుల్లో 80 శాతం మందికి వనిత కార్డులు ఉన్నాయి. రోజూ వీరు 10 శాతం రాయితీతో ప్రయాణాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాయితీలు అన్ని పోయాయి. చార్జీల పెంపుతో పాటు రాయితీ కూడా నొక్కేసారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గతంలో సీజన్ టికెట్టు ఉన్నప్పుడు టోల్‌గేటు 5 రూపాయల టికెట్టు కొట్టేవారు. కానీ ఇప్పుడు 10 రూపాయలు కొడుతున్నారు. ఇలా భారీగా ప్రజలపై భారం మోపారు. ప్రజల్లో అసంతృప్తి చిల్లర పేరుతో భారీగా చార్జీలు వడ్డించడంపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత వస్తుందనే చిల్లర పేరుతో చార్జీలు భారీగా పెంచేశారని అంటున్నారు. ఇక కార్డుల పనిచేయకపోవడం భాధాకరమని, అలాంటప్పుడు తమకు ఎందుకు అమ్మాలని ప్రశ్నిస్తున్నారు. టంగుటూరు నుంచి ఒంగోలుకు 25 రూపాయలు తీసుకుంటున్నారు. కార్డు పనిచేయదంటున్నారు. ఇలా అయితే ఆర్టీసీ బస్సులు ఎలా ఎక్కాలని ప్రశ్నిస్తున్నారు. అధికారులు తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు శాపాలుగా మారుతున్నాయని విమర్శించారు. వెంటనే రాయితీ కార్డులు అమల్లోకి వచ్చేలా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాయితీ కార్డులు పనిచేసేలా చేయాలి: ఆర్టీసీ ఇచ్చిన రాయితీ కార్డులు బస్సుల్లో పనిచేయవని అనడం బాధాకరం. దీని వలన ప్రయాణికులు భారీగా నష్టపోతున్నారు. వెంటనే రాయితీ చార్జీల్లో కల్పించాలి. ఊటుకూరి సతీష్ -
టికెట్ ధరలు పెంచుకోండి: రాష్ట్ర ప్రభుత్వం
పెరంబూరు(తమిళనాడు): ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు అనే సగటు జనం ఇప్పుడు కూసంత వినోదం కోసం సినిమాకు వెళ్లేటట్టూ లేదని పాడుకునే రోజు వచ్చింది. సినిమా టికెట్ ధరలకు ప్రభుత్వం గేట్లేసింది. ముందుగా థియేటర్లపై వినోదపు పన్ను భారం మొపేసి ఇప్పుడు టికెట్ ధరను పెంచుకోండంటూ థియేటర్ల యాజమాన్యానికి అనుమతి ఇచ్చింది. సినిమాలపై జీఎస్టీ 28 శాతం, రాష్ట్ర ప్రభుత్వ వినోదపు పన్ను 10 శాతం వేసేసింది. దీంతో బాబోయ్ మా వల్ల కాదంటూ ఆ 10 శాతం పన్నును రద్దు చేయాలని, లేని పక్షంలో థియేటర్లను మూసివేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని థియేటర్ల యాజమాన్యాలు గగ్గోలు పెట్టాయి. ఇక నిర్మాతలమండలి వినోదపు పన్నును వ్యతిరేకిస్తూ శుక్రవారం విడుదల కావలసిన కొత్త చిత్రాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రప్రభుత్వం సినిమా టికెట్ ధరలను పెంచుకోవచ్చునని శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో చెన్నై నగరంలోని మల్టీప్లెక్స్ థియేటర్లలో టికెట్ ధరను గరిష్టంగా రూ. 160 వరకూ పెంచుకోవచ్చుని తెలిపింది. ఇతర నగరాల్లో రూ.140 వరకూ పెంచుకోవచ్చుకోవడానికి అనుమతిస్తున్నట్లు పేర్కొంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో థియేటర్ల యాజమాన్యాలు సమ్మెను విరమిస్తాయా? లేదా? అన్నది వేచి చూడాల్సి ఉంది. ఏతా వాతా ప్రభుత్వం వినోదపు పన్ను వేసినా, థియేటర్లు టికెట్ ధరను పెంచినా ఆ భారం మోయాల్సింది ప్రజలే. ఇక సగటు ప్రేక్షకుడికి సినిమా మరింత ప్రియం అయింది. మొత్తం మీద ప్రభుత్వం, సినీ థియేటర్ల మధ్య వివాదంతో మధ్య తరగతి ప్రేక్షకులకు చుక్కలంటే ధరలతో నిజంగానే సినిమా చూపిస్తున్నారు. -
పేదోడికి పూజలూ భారమే
శ్రీకాళహస్తి ఆలయం రాహుకేతు పూజలకు ప్రసిద్ధి. ఆలయ ఆదాయంలో 85శాతం కేవలం ఈ పూజల ద్వారానే వస్తుంది. అంతటి ప్రాశస్త్యం ఉన్న పూజలు పేదలకు అందుబాటులో లేకుండా టిక్కెట్ ధరలు పెంచడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై పునరాలోచించాలని భక్తులు కోరుతున్నారు. శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి ఆలయంలో రాహుకేతు పూజలు చేయిస్తే సర్వ దోషాలు నివారణ అవుతాయని భక్తుల నమ్మకం. అందుకే ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న పూజలు పెద్దలకు మాత్రమే పరిమితం కాకూడదనే ఉద్దేశంతో పేదల కోసం రూ.250 టికెట్ ఏర్పాటు చేశారు. అలాగే రూ.750, రూ.1,500, రూ.2,500, రూ.5000 టికెట్లు కూడా ఉన్నాయి. భక్తులు వారివారి స్థోమతను బట్టి పూజలు చేయించుకుంటున్నారు. పెద్దలు ఎక్కువగా చేయించే టికెట్ల జోలికిపోని అధికారులు పదేళ్ల క్రితం రూ.250 టికెట్‌ను రూ.300కు పెంచారు. ఇకపై దాని ధర పెంచబోమని అప్పటి అధికారులు వెల్ల డించారు. ఆ మాటను పక్కనబెట్టి ప్రస్తుతం రూ.300 టికెట్‌ను రూ.500లు చేశారు. దీనిపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానాన్ని పూర్తిగా వ్యాపార కేంద్రం చేసేశారంటూ మండిపడుతున్నారు. మాస్టర్ ప్లాన్ అమలుకు రూ.కోట్లలో ఖర్చు చేయాలి.. భక్తుల సౌకర్యం కోసం ఏర్పాటు చేస్తున్న మాస్టర్‌ప్లాన్ పూర్తి చేయడానికి కొన్ని కోట్ల రూపాయిలు ఖర్చు చేయాల్సి ఉంది. ఇక పూజా సామగ్రి ధరలు పెరిగిపోయిన విషయం తెలిసిందే. విధిలేని పరిస్థితుల్లో రూ.300 టికెట్‌ను రూ.500 చేయాల్సి వచ్చింది. – భ్రమరాంబ, ఆలయ ఈఓ ముందస్తు సమాచారం లేకుండా పెంచేశారు దేవస్థానం వారు ధరలు పెంచాలంటే పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేయాల్సి ఉంది. ముందస్తు సమాచారం లేకుండా ఇలా ఒక్కసారిగా పెంచడం సరికాదు. చిన్నపాటి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న మాలాంటి వారికి ఇది భారమవుతుంది. రూ.200 అదనంగా ఖర్చు కావడంవల్ల శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లోని ఆలయాలను దర్శించుకో కుండా వెళ్లిపోతున్నాం. –రామయ్యగౌడ్, మహేశ్వరి ఒక్కసారిగా రూ.200 పెంచడం సరికాదు రూ.300 టికెట్ ధరను ఒక్కసారిగా రూ.200 పెంచడం సరికాదు. పేద వారికి అందుబాటులో ఉండే టికెట్ ఇదొక్కటే. దాన్నే పెంచేశారు. నేను ఆరు నెలలకొకసారి సికింద్రాబాద్ నుంచి వచ్చి పూజ చేయిస్తుంటాను. దేవాదాయ శాఖ మరోసారి ధర పెంపుపై ఆలోచన చేయాల్సి ఉంది. – నివేద్‌వర్మ, ఆశ, దంపతులు -
ఆర్టీసీ బాదుడు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అదుపులేకుండా తారాజువ్వల్లా పైకిపోతున్న నిత్యావసరాల ధరలు.. నెలకోమారు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న క్రమంలో సామాన్యుడిపై ఇంకో భారం పడింది. మరోమారు చార్జీలు పెంచుతూ ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం సామాన్యుడిని మరింత కష్టాల్లోకి నెట్టింది. ఆర్టీసీ చార్జీల పెంపు ఫైలుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం ఆమోదముద్ర వేశారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి రానున్నాయి. మరోవైపు నెలవారీ సిటీ బస్పాసులపైనా రూ.50 అదనపు భారాన్ని మోపారు. కనిష్టంగా రూపాయి పెంపు.. సిటీ బస్సుల్లో టిక్కెట్టు ధర కనిష్టంగా రూపాయి పెరగనుంది. దూరాన్ని బట్టి పెంపు ప్రభావం పడనుంది. అదేవిధంగా పల్లెవెలుగు బస్సులో కిలోమీటరుకు 4 పైసలు, ఎక్స్‌ప్రెస్‌లో కి.మీ.కు 7పైసలు, డీలక్స్‌లో కి.మీ.కు 9 పైసలు, సూపర్ లగ్జరీలో కి.మీ.కు 11పైసలు పెరిగింది. దీంతో కిలోమీటర్ల వారీగా చార్జీల మోత పడనుంది. ప్రస్తుతం పరిగి నుంచి హైదరాబాద్‌కు పల్లెవెలుగు బస్సు చార్జీ రూ.50గా ఉంది. చార్జీల పెంపుతో ఈ ధర రూ.54కు చేరనుంది. అదేవిధంగా తాండూరు నుంచి హైదరాబాద్‌కు ఎక్స్‌ప్రెస్ బస్ చార్జీ రూ.87కాగా, తాజాగా రూ.97కు పెరగనుంది. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో తాండూరు, వికారాబాద్, పరిగి డిపోలున్నాయి. జిల్లా పరిధిలో హైదరాబాద్ 1, 2, పికెట్ డిపోలున్నప్పటికీ ఈ సర్వీసులు ఇతర రాష్ట్రాలకు రాకపోకలు సాగించనున్నాయి. చేవెళ్ల, మహేశ్వరం, మేడ్చల్, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం తదితర నియోజకవర్గాల్లో అంతా సిటీ డిపోలుండడంతో దూరం, స్టాపులను బట్టి చార్జీల పెంపు ఉంటుందని, మంగళవారం సాయంత్రానికల్లా ధర లు పూర్తిస్థాయిలో ఖరారుకానున్నాయ ని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. పెరిగిన ఆర్టీసీ బస్సు చార్జీలు ఇలా గమ్యస్థానం-ఎక్స్‌ప్రెస్- పల్లెవెలుగు పాతది -పెరిగింది- పాతది- పెరిగింది పరిగి నుంచి హైదరాబాద్ -రూ.65 -71 రూ.50 -54 పరిగి నుంచి చేవెళ్ల-రూ.30 -32 రూ.22- 24 చేవెళ్ల నుంచి హైదరాబాద్-రూ.37- 40-రూ.28-30 పరిగి నుంచి మహబూబ్‌నగర్- - రూ.36 -39 పరిగి నుంచి షాద్‌నగర్ - - రూ.25- 27 పరిగి నుంచి కొడంగల్ - - రూ.20 -21 పరిగి నుంచి వికారాబాద్ - - రూ.17- 18 తాండూరు నుంచి వికారాబాద్ - - రూ.22- 24 తాండూరు నుంచి హైదరాబాద్-రూ.87- 97 - - తాండూరు టు మహబూబ్‌నగర్ - - రూ.44- రూ.47 - న్యూస్‌లైన్, పరిగి, తాండూరు