సాక్షి ప్రతినిధి, అనంతపురం: భారీగా పెరిగిన విమానయాన చార్జీలు విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకుంటున్న వారికి ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా విమాన చార్జీలు పెరిగాయి. 60 నుంచి 70 శాతం వరకు పెరగడంతో అమెరికా, ఇతర దేశాలకు చదువు కోసం వెళ్లేవారు లబోదిబోమంటున్నారు. మరీ ముఖ్యంగా ఆగస్టు మాసంలో ఎక్కువ రేట్లు నమోదయ్యాయి. కోవిడ్‌కు ముందు అమెరికాకు విమాన చార్జీ రూ.80 వేల నుంచి రూ.90 వేల వరకూ మాత్రమే ఉండేది.
ఈ ఏడాది ఆగస్టులో అమెరికా వెళ్లే వారు కనీసం రూ.1.60 లక్షలు విమాన టికెట్‌కే వెచ్చించాల్సి వస్తోంది. దీంతో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల నుంచి ఈ ఏడాది 280 మంది దాకా విద్యార్థులు అమెరికాలో చదువుకోవడానికి వెళుతున్నారు. బ్రిటన్, కెనడా, ఆ్రస్టేలియా తదితర దేశాలకూ వెళుతున్న వారు పదుల సంఖ్యలోనే ఉన్నారు.
రెండు మాసాల ముందు బుక్ చేసుకుంటేనే...
అమెరికాలో సెప్టెంబర్ నుంచి విద్యా సంవత్సరం మొదలవుతుంది. దీంతో ఆగస్ట్ 25 నాటికే అక్కడికి చేరుకుంటారు. ఇందుకోసం జూన్‌లో విమాన టికెట్ బుక్ చేసుకున్న వారికి రమారమి రూ.1.55 లక్షలు అయ్యింది. ఇక అప్పటికప్పుడు అంటే రూ.2 లక్షల దాకా వెచ్చించాల్సి వస్తోందని శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బకు చెందిన ప్రసాద్‌కుమార్ అనే విద్యార్థి చెప్పారు. రోజు రోజుకూ చార్జీలు పెరుగుతున్నాయని, గత రెండు నెలల్లో పెరగడమే గానీ ఎప్పుడూ తగ్గలేదని పలువురు విద్యార్థులు తెలిపారు.
డాలర్ విలువ పెరగడంతో..
తాజాగా డాలర్‌తో రూపాయి మారకం విలువ సుమారు రూ.80కు పెరిగింది. దీనివల్ల అమెరికాకు వెళుతున్న భారతీయ విద్యార్థులపై పెనుభారం పడుతోంది. అమెరికాలో క్యూఎస్ ర్యాంకింగ్ 200 పైన ఉన్న ఏ యూనివర్సిటీలో అయినా కనీసం 40 వేల డాలర్ల ఫీజు ఉంటుంది. అదే వందలోపు ర్యాంకింగ్స్ ఉన్న వాటిలో 60 వేల నుంచి 70వేల డాలర్లు అవుతుంది. ప్రస్తుతం డాలర్ విలువ పెరగడంతో ఒక్కో విద్యార్థిపై రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ అదనపు భారం పడుతోంది.
విమాన చార్జీలు ఎక్కువగా ఉన్నాయి
నేను ఈ ఏడాది అమెరికాలోని బోస్టన్‌కు ఫార్మసీలో మాస్టర్స్ కోసం వెళుతున్నా. సాధారణంగా విద్యార్థులంతా ఆగస్టులోనే అమెరికాకు పయనమవుతారు. దీనివల్ల విమాన చార్జీలు ఎక్కువగా పెంచారు. సెప్టెంబర్ మాసంలో మళ్లీ తగ్గుతాయి.
–నితీష్ కుమార్‌రెడ్డి, అనంతపురం
డాలర్ రేటు పెరగడంతోనే..
నేను డల్లాస్‌లో మాస్టర్స్ చేయడానికి ఆగస్ట్ 23వ తేదీ వెళుతున్నా. విమాన టికెట్ రూ.1.55 లక్షలు అయ్యింది. దీంతో పాటు ఇటీవలే డాలర్ రేటు పెరగడంతో ఫీజుల్లోనూ తేడా వస్తోంది. దీనివల్ల మధ్యతరగతి వారికి ఆర్థిక భారం పడుతోంది.
–శ్రీచరణ్, అనంతపురం
విదేశాలకు వెళ్లే వారి సంఖ్య పెరిగింది
కరోనా తర్వాత విదేశాల్లో చదువులు, సందర్శన కోసం వెళ్లే వారి సంఖ్య బాగా పెరిగింది. ఫలితంగా పాస్‌పోర్టుల నమోదు కూడా పెరిగింది. ఒక్క హిందూపురం కేంద్రంలోనే ప్రస్తుతం రోజూ 50 వరకు నమోదు అవుతున్నాయి.
– రవిశంకర్, పాస్‌పోర్టు ఆఫీసర్, హిందూపురం
Comments
Please login to add a commentAdd a comment