
Airport Rules: ప్రస్తుతం విమాన ప్రయాణం సర్వ సాధారణంగా మారిపోయింది. విదేశాలకు, దూర ప్రాంతాలకు ప్రయాణించాలంటే విమానాల్లో వెళ్లడానికే చాలా మంది ఇష్టపడతారు. గమ్యాన్ని తక్కువ సమయంలో చేరుకోవడం, ఫ్లైట్ ఫేర్‌లు తక్కువగా ఉండటం వంటి కారణాలతో విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య ఇటీవల పెరుగుతూ వస్తోంది.
అయితే విమానంలో ప్రయాణించడానికి లగేజీకి సంబంధించిన పరిమితులు ఉంటాయని చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ ప్రయాణికులు తమ వెంట ఎంత నగదు తీసుకువెళ్లవచ్చు అనే దానిపైనా పరిమితులు ఉన్నాయని మీకు తెలుసా? దేశం వెలుపల, విదేశాలలో నగదు విత్‌డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులో ఉన్నప్పటికీ, తమ సౌలభ్యం కోసం నగదును తమ వెంట తీసుకెళ్లేందుకు ఇష్టపడే వారు చాలా మందే ఉన్నారు.
ఎంత తీసుకెళ్లొచ్చు?
నగదును తీసుకెళ్లేందుకు సంబంధించిన నిబంధనలు దేశీయ విమానాలకు, అంతర్జాతీయ విమానాలకు వేరువేరుగా ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం.. దేశీయ విమానాల్లో గరిష్టంగా రూ. 2 లక్షల నగదును తీసుకెళ్లవచ్చు. కానీ మీరు విదేశీ పర్యటనకు వెళుతున్నట్లయితే ఈ నిబంధన వర్తించదు.
ఇక మీరు నేపాల్, భూటాన్ మినహా మరే ఇతర దేశానికి వెళుతున్నా 3000 డాలర్ల వరకు విదేశీ కరెన్సీని తీసుకెళ్లవచ్చు. దీని కంటే ఎక్కువ నగదును తీసుకెళ్లాలనుకుంటే స్టోర్ వ్యాల్యూ, ప్రయాణ తనిఖీలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
లగేజీ బరువు ఎంత ఉండాలి?
విమానంలో మీ హ్యాండ్‌బ్యాగ్‌లో 7 నుండి 14 కిలోల బరువును తీసుకెళ్లవచ్చు. మీరు చెక్-ఇన్ కౌంటర్ వద్ద ఇచ్చే చెక్-ఇన్ బ్యాగేజీ బరువు 20 నుండి 30 కిలోల వరకు ఉంటుంది. అంతర్జాతీయ విమానాలకు కూడా ఇదే నిబంధనలు వర్తిస్తాయి.
ఏవి తీసుకెళ్లకూడదు?
విమాన ప్రయాణంలో మీరు కొన్ని వస్తువులను తీసుకెళ్లకూడదు. క్లోరిన్, యాసిడ్, బ్లీచ్ మొదలైన రసాయనాలను అస్సలు తీసుకెళ్లలేరు. ఇక మద్యం విషయానికి వస్తే దేశీయ విమానాల్లో మీ చెక్-ఇన్ బ్యాగ్‌లో ఆల్కహాల్ తీసుకెళ్లవచ్చు. కానీ అది 5 లీటర్లకు మించకూడదు.
Comments
Please login to add a commentAdd a comment