ఇలా..ఎలా? | RTC Charges Hikes In Palle Velugu Busses Prakasam | Sakshi
Sakshi News home page

ఇలా..ఎలా?

Published Mon, Jul 2 2018 1:01 PM | Last Updated on Mon, Jul 2 2018 1:01 PM

RTC Charges Hikes In Palle Velugu Busses Prakasam - Sakshi

రాయితీ కార్డులు పనిచేయని ఆర్టీసీ బస్సు

ఉలవపాడు: చిల్లర తిప్పలు లేకుండా చేయడం కోసం అంటూ చార్జీల సవరణల పేరుతో ఆర్టీసీ ప్రయాణికుల నెత్తిన భారీ భారం మోపింది. పల్లె వెలుగు బస్సుల్లో ఒకటో తేదీ నుంచి కొత్త చార్జీలు అమల్లోకి తెచ్చింది. ఆదివారం బస్సులు ఎక్కిన ప్రయాణికులు కొత్త చార్జీలు చూసి అవాక్కయ్యారు. 10 శాతం టికెట్టు రాయితీ..అంటూ ఇచ్చిన క్యాట్‌కార్డులు, వనిత కార్డులు అసలు పనిచేయలేదు. ఇక 25 శాతం ఆధార్‌ తగ్గింపు కూడా 30 రూపాయలుపైన చార్జీ ఉన్న వారికి మాత్రమే వర్తించింది. ప్రయాణికులు ఇదేంటి ఇలా చేశారు.. ఇలా అయితే రాయితీ కార్డులు ఎందుకు అమ్మారని ఆర్టీసీ అధికారులను ప్రశ్నిస్తున్నారు.  ఉలవపాడు నుంచి ఒంగోలుకు గతంలో 34 రూపాయల చార్జీ ఉంది.

ఇప్పుడు ఆ చార్జీని చిల్లర పేరుతో 35 చేయాలి. కానీ 40 రూపాయలు చేశారు. రాయితీ కార్డులు ఉన్నా లేకున్నా అదే టికెట్టు కొనాల్సిందే. ప్రయాణికులు ఇదేంటని ప్రశ్నిస్తున్నారు. కండక్టర్లు సమాధానాలు చెప్పలేక సతమతమవుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా చార్జీలు భారీగా వడ్డించారని అర్థమైంది. ఉలవపాడు నుంచి సింగరాయకొండ, టంగుటూరు, కావలి వెళ్లాలంటే రాయితీ కార్డులు పనిచేయవు. వృద్ధుల ఆధార్‌ కార్డులు పనిచేయవు. ఇలా ప్రజలను ఇబ్బందులు పెట్టి ఎక్కువ వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. చార్జీల పెంపు అంటే ప్రభుత్వ వ్యతిరేకత వస్తుందని ఇలా చేశారని ప్రయాణికులంటున్నారు.

ఉపయోగం లేని రాయితీ కార్డులు
ఆదివారం ప్రారంభమైన కొత్త చార్జీల్లో రాయితీ కార్డులు ఏ మాత్రం పనిచేయలేదు. కార్డు నంబర్‌ కొట్టినా సాధారణ చార్జీనే వస్తోంది. గతంలో రాయితీ కార్డులు ఆర్టీసీ సిబ్బంది అన్ని గ్రామాలకు వెళ్లి వీలైనన్ని ఎక్కువ అమ్మారు. జిల్లా జనాభాలో సగం మందికి క్యాట్‌ కార్డులు ఉన్నాయి. తెల్లరేషన్‌ కార్డుదారుల్లో 80 శాతం మందికి వనిత కార్డులు ఉన్నాయి. రోజూ వీరు 10 శాతం రాయితీతో ప్రయాణాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాయితీలు అన్ని పోయాయి. చార్జీల పెంపుతో పాటు రాయితీ కూడా నొక్కేసారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గతంలో సీజన్‌ టికెట్టు ఉన్నప్పుడు టోల్‌గేటు 5 రూపాయల టికెట్టు కొట్టేవారు. కానీ ఇప్పుడు 10 రూపాయలు కొడుతున్నారు. ఇలా భారీగా ప్రజలపై భారం మోపారు.

ప్రజల్లో అసంతృప్తి
చిల్లర పేరుతో భారీగా చార్జీలు వడ్డించడంపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత వస్తుందనే చిల్లర పేరుతో చార్జీలు భారీగా పెంచేశారని అంటున్నారు. ఇక కార్డుల పనిచేయకపోవడం భాధాకరమని, అలాంటప్పుడు తమకు ఎందుకు అమ్మాలని ప్రశ్నిస్తున్నారు. టంగుటూరు నుంచి ఒంగోలుకు 25 రూపాయలు తీసుకుంటున్నారు. కార్డు పనిచేయదంటున్నారు. ఇలా అయితే ఆర్టీసీ బస్సులు ఎలా ఎక్కాలని ప్రశ్నిస్తున్నారు. అధికారులు తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు శాపాలుగా మారుతున్నాయని విమర్శించారు. వెంటనే రాయితీ కార్డులు అమల్లోకి వచ్చేలా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

రాయితీ కార్డులు పనిచేసేలా చేయాలి: ఆర్టీసీ ఇచ్చిన రాయితీ కార్డులు బస్సుల్లో పనిచేయవని అనడం బాధాకరం. దీని వలన ప్రయాణికులు భారీగా నష్టపోతున్నారు. వెంటనే రాయితీ చార్జీల్లో కల్పించాలి.
ఊటుకూరి సతీష్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement