సాక్షి, రంగారెడ్డి జిల్లా: అదుపులేకుండా తారాజువ్వల్లా పైకిపోతున్న నిత్యావసరాల ధరలు.. నెలకోమారు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న క్రమంలో సామాన్యుడిపై ఇంకో భారం పడింది. మరోమారు చార్జీలు పెంచుతూ ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం సామాన్యుడిని మరింత కష్టాల్లోకి నెట్టింది. ఆర్టీసీ చార్జీల పెంపు ఫైలుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం ఆమోదముద్ర వేశారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి రానున్నాయి. మరోవైపు నెలవారీ సిటీ బస్‌పాసులపైనా రూ.50 అదనపు భారాన్ని మోపారు.
కనిష్టంగా రూపాయి పెంపు..
సిటీ బస్సుల్లో టిక్కెట్టు ధర కనిష్టంగా రూపాయి పెరగనుంది. దూరాన్ని బట్టి పెంపు ప్రభావం పడనుంది. అదేవిధంగా పల్లెవెలుగు బస్సులో కిలోమీటరుకు 4 పైసలు, ఎక్స్‌ప్రెస్‌లో కి.మీ.కు 7పైసలు, డీలక్స్‌లో కి.మీ.కు 9 పైసలు, సూపర్ లగ్జరీలో కి.మీ.కు 11పైసలు పెరిగింది. దీంతో కిలోమీటర్ల వారీగా చార్జీల మోత పడనుంది. ప్రస్తుతం పరిగి నుంచి హైదరాబాద్‌కు పల్లెవెలుగు బస్సు చార్జీ రూ.50గా ఉంది. చార్జీల పెంపుతో ఈ ధర రూ.54కు చేరనుంది.
అదేవిధంగా తాండూరు నుంచి హైదరాబాద్‌కు ఎక్స్‌ప్రెస్ బస్ చార్జీ రూ.87కాగా, తాజాగా రూ.97కు పెరగనుంది. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో తాండూరు, వికారాబాద్, పరిగి డిపోలున్నాయి. జిల్లా పరిధిలో హైదరాబాద్ 1, 2, పికెట్ డిపోలున్నప్పటికీ ఈ సర్వీసులు ఇతర రాష్ట్రాలకు రాకపోకలు సాగించనున్నాయి. చేవెళ్ల, మహేశ్వరం, మేడ్చల్, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం తదితర నియోజకవర్గాల్లో అంతా సిటీ డిపోలుండడంతో దూరం, స్టాపులను బట్టి చార్జీల పెంపు ఉంటుందని, మంగళవారం సాయంత్రానికల్లా ధర లు పూర్తిస్థాయిలో ఖరారుకానున్నాయ ని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
పెరిగిన ఆర్టీసీ బస్సు చార్జీలు ఇలా
గమ్యస్థానం-ఎక్స్‌ప్రెస్- పల్లెవెలుగు
పాతది -పెరిగింది- పాతది- పెరిగింది
పరిగి నుంచి హైదరాబాద్ -రూ.65 -71 రూ.50 -54
పరిగి నుంచి చేవెళ్ల-రూ.30 -32 రూ.22- 24
చేవెళ్ల నుంచి హైదరాబాద్-రూ.37- 40-రూ.28-30
పరిగి నుంచి మహబూబ్‌నగర్- - రూ.36 -39
పరిగి నుంచి షాద్‌నగర్ - - రూ.25- 27
పరిగి నుంచి కొడంగల్ - - రూ.20 -21
పరిగి నుంచి వికారాబాద్ - - రూ.17- 18
తాండూరు నుంచి వికారాబాద్ - - రూ.22- 24
తాండూరు నుంచి హైదరాబాద్-రూ.87- 97 - -
తాండూరు టు మహబూబ్‌నగర్ - - రూ.44- రూ.47
- న్యూస్‌లైన్, పరిగి, తాండూరు