రాఖీ గిఫ్ట్: బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త ఆఫర్
రక్షా బంధన్ సెలబ్రేషన్స్‌లో భాగంగా ప్రభుత్వరంగ టెలికాం బీఎస్‌ఎన్‌ఎల్ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. 'రాఖీ పె సౌగత్' రీఛార్జ్ ప్లాన్‌ను తన ప్రీపెయిడ్ కస్టమర్లకు ప్రకటించింది. ఈ ప్లాన్‌లో 74 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే అపరిమిత ఆన్-నెట్ వాయిస్ కాల్స్‌ను, డేటా ప్రయోజనాలను వినియోగదారులకు అందించనుంది. అయితే ఇది కేవలం తమ ప్రీపెయిడ్ కస్టమర్లకు, ఐదు రోజుల వరకే వాలిడ్‌లో ఉంటుంది. కానీ ఐదురోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్ ఆన్ నెట్ ద్వారా తమ కస్టమర్లకు చేసుకోవచ్చు. టాక్ వాల్యుతో పాటు ఐదు రోజుల వరకు 1జీబీ డేటాను యూజర్లు వాడుకోవచ్చు. నేటి(ఆగస్టు3) నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి వస్తోందని బీఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది. 12 రోజుల వరకు ఇది అందుబాటులో ఉంటుందని పేర్కొంది.
పండుగలను పురస్కరించుకుని ఇలాంటి చౌక టారిఫ్‌లను బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫర్ చేయడం సంప్రదాయమని బీఎస్‌ఎన్‌ఎల్ బోర్డు డైరెక్టర్ ఆర్‌కే మిట్టల్ తెలిపారు. అదనంగా రూ.189, రూ.289, రూ.389లతో కొన్ని కొంబో ఆఫర్లను కూడా బీఎస్‌ఎన్‌ఎల్ లాంచ్‌చేసింది. ఈ ఆఫర్స్‌లో అదనంగా 18 శాతం టాక్ వాల్యు, 1జీబీ డేటాను ఉచితంగా అందించనుంది. ఇటీవలే బీఎస్‌ఎన్‌ఎల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం 128జీబీ డేటాతో 'సిక్సర్ 666' ప్యాక్‌ను లాంచ్ చేసింది. ఈ ప్లాన్ కింద తన ప్రీపెయిడ్ యూజర్లు రోజుకు 2జీబీ డేటాను పొందుతారు. ఈ ప్లాన్ 60 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. రిలయన్స్ జియోకు కౌంటర్ ఇచ్చేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ఆఫర్లను ప్రకటిస్తోంది. ఫెస్టివ్ సీజన్‌లో కస్టమర్లను మరింత ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తోంది.