
30 వేల ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్ల ఏరివేత
ఫేక్ ఖాతాలపై ఫేస్‌బుక్ కొరడా ఝుళిపించింది. స్పామ్‌ను తగ్గించడానికి, తప్పుడు సమాచారం ప్రజల్లోకి వెళ్లకుండా నిరోధించడానికి వీలుగా ఫ్రాన్స్‌లోని 30 వేల ఫేక్ అకౌంట్లను సస్పెండ్ చేసింది. బాగా ఎక్కువ యాక్టివిటీ ఉంటూ, ఎక్కువ మందికి రీచ్ అవుతున్న ఫేక్ అకౌంట్లను తీసేయాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఫేస్‌బుక్ ఒక ప్రకటనలో తెలిపింది. తమ సామాజిక మాధ్యమం ద్వారా తప్పుడు సమాచారం ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లకుండా ఉండేందుకే ఈ చర్య తీసుకున్నట్లు ఫేస్‌బుక్ యాజమాన్యం చెబుతోంది.
ప్రధానంగా ఆర్థికపరమైన మోసాలు చేయడానికి ఫేస్‌బుక్‌ను వేదికగా వాడుకుంటున్నారని, యూజర్ల భద్రత కోసం తాము చర్యలు చేపడుతున్నామని ఫేస్‌బుక్ టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్ షబ్నమ్ షేక్ తెలిపారు. ఇలాంటి ఫేక్ అకౌంట్లు ఉన్నవారు ఫేస్‌బుక్ ప్లాట్‌ఫారాన్ని ఉపయోగించుకుని తప్పుడు విషయాలు ప్రచారం చేసి జనాన్ని దోచుకోవడం ఇకమీదట అంత సులభంగా ఉండబోదని అన్నారు. అయితే, అసలు ఈ ఫేక్ అకౌంట్లను ఎలా గుర్తిస‍్తారన్నది కూడా ముఖ్యమైన విషయమే. ఒకే కంటెంటును ఎక్కువ సార్లు పోస్ట్ చేయడం, పదే పదే మెసేజిలు పంపుతుండటం.. ఇలాంటి వ్యవహారాలు చేసేవాళ్లవి ఫేక్ అకౌంట్లుగా పరిగణిస్తారు.