కొంచెం మోదం.. కొంచెం ఖేదం
సాక్షి, హైదరాబాద్: కొంచెం మోదం.. కొంచెం ఖేదం అన్నట్లుగా 14వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రాన్ని ఊరించి ఉసూరుమనిపించాయి. ప్రత్యేక నిధుల ఊసేమీ లేకుండా మిగులు రెవెన్యూ ఉన్న ఇతర రాష్ట్రాల తరహాలోనే తెలంగాణకూ కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా మొత్తం పెరిగింది. అయితే పాత జనాభా లెక్కలనే పరిగణనలోకి తీసుకుని నిధుల పంపిణీ శాతాన్ని తగ్గించడంతో ఆ మేరకు రాష్ర్టం కొంత నష్టపోవాల్సి వస్తోంది. ఆర్థిక సంఘం కొత్త సిఫార్సుల మేరకు కేంద్ర పన్నుల్లో ప్రస్తుతం రాష్ట్రాలకున్న వాటా 32 శాతం నుంచి 42 శాతానికి పెరిగింది. దీంతో రాబోయే ఐదేళ్లలో(2015-2020) తెలంగాణకు కేంద్ర పన్నుల ద్వారా మొత్తం రూ. 96,217 కోట్లు అందుతాయని అంచనా. ప్రస్తుతం ఏటా రూ. 10 వేల కోట్ల నుంచి రూ. 11 వేల కోట్లు మాత్రమే వస్తున్నాయి.
ఒక్కసారిగా పది శాతం వాటా పెంపుతో రాష్ట్రాలకు నిధుల రాక భారీగా పెరగడం శుభపరిణామం. అదే సమయంలో పన్నుల వాటాను రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడంలో అనుసరించే విధానం వల్ల తెలంగాణకు కొంత నష్టం జరిగింది. ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం రాష్ట్రాలకు 42 శాతం పన్నుల వాటాలో తెలంగాణకు 2.437 శాతం నిధులు పంపిణీ అవుతాయి. నిజానికి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు 2.91 శాతం పన్నుల వాటా విడుదలైంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రాతిపదికనే కేంద్రం నిధులు కేటాయించింది. తాజాగా 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోకుండా.. 2001లో ఉన్న జనాభా ప్రకారమే వాటాలను ఆర్థిక సంఘం లెక్కించింది. దీంతో రాబోయే ఐదేళ్లు తెలంగాణకు 2.43 శాతం చొప్పునే నిధులు దక్కుతాయి. దీంతో 0.5 శాతం నిధుల వాటాను రాష్ర్టం నష్టపోయినట్లయింది. కొత్త జనాభాను పరిగణనలోకి తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని రాష్ట్ర ఆర్థిక శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
స్థానిక సంస్థలకు రూ. 8,764.38 కోట్లు
జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థలకు ఇచ్చే గ్రాంట్లలో తెలంగాణకు వచ్చే ఐదేళ్లలో రూ. 8,764.38 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక సంఘం ప్రకటించింది. ప్రాథమిక గ్రాంట్లు, పనితీరు ఆధారంగా ఇచ్చే గ్రాంట్లుగా వీటిని రెండుగా విభజించింది. జనాభా ప్రాతిపదికన ఇచ్చే ఈ గ్రాంట్లను తలసరిగా రూ. 488 చొప్పున ఇవ్వాలని ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. ఈ లెక్కన తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు ఐదేళ్లలో రూ. 4,837.75 కోట్లు, నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు రూ. 2,711.12 కోట్లు గ్రాంట్లుగా అందుతాయి.
ఇక స్థానిక సంస్థల పనితీరు ఆధారంగా ఫెర్‌ఫార్మెన్స్ గ్రాంట్లను 2016 నుంచి విడుదల చేస్తారు. ఈ పద్దులో గ్రామ పంచాయతీలకు రూ. 537.53 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ. 677.78 కోట్లు అందే అవకాశముంది. అలాగే రాబోయే ఐదేళ్లలో విపత్తుల నిర్వహణకు విడుదల చేసే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద తెలంగాణకు రూ. 1,515 కోట్లు ఇవ్వాలని ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. ఇందులో పది శాతం రాష్ర్ట వాటా కాగా, మిగతా 90 శాతం కేంద్రం గ్రాంట్లు.
రాష్ట్ర విజ్ఞప్తులు బుట్టదాఖలు
లోటు రెవెన్యూ ఉన్నందున ఏపీకి భారీ మొత్తంలో గ్రాంట్లు సిఫారసు చేసిన ఆర్థిక సంఘం.. తెలంగాణకు మొండిచెయ్యి చూపింది. ఐదేళ్లలో కేంద్రం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ. 20,950 కోట్లు ఇవ్వాలని ఆర్థిక సంఘాన్ని సీఎం కేసీఆర్ కోరారు. వాటర్‌గ్రిడ్‌కు రూ. 7,700 కోట్లు, హరితహారానికి రూ. 1,046 కోట్లు, రోడ్లు, వంతెనల నిర్వహణకు రూ. 1,000 కోట్లు, విద్యుత్ శాఖకు రూ. 1,316 కోట్లు కావాలని విజ్ఞప్తి చేశారు. ఇవేవీ పరిగణనలోకి తీసుకోకపోవడంతో ప్రత్యేక గ్రాంట్లేమీ రాష్ట్రానికి దక్కలేదు. దీనికి తోడు రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీకి 2011 జనాభాను ప్రాతిపదికగా తీసుకోవాలని రాష్ర్ట ప్రభుత్వం కోరినా వినలేదు.