మహిళా శక్తికి మచ్చుతునక  ‘ముల్కనూర్‌’ | The 16th Anniversary of Mulkanoor Swasakthi Dairy | Sakshi
Sakshi News home page

మహిళా శక్తికి మచ్చుతునక  ‘ముల్కనూర్‌’

Published Mon, Jul 30 2018 11:40 AM | Last Updated on Tue, Jun 4 2019 6:39 PM

The 16th Anniversary of Mulkanoor Swasakthi Dairy   - Sakshi

సభ్యులతో మాట్లాడుతున్న దివంగత మహానేత, అప్పటి సీఎం వైఎస్సార్‌(ఫైల్‌) 

భీమదేవరపల్లి(హుస్నాబాద్‌) :  ఆకలి తీరే మార్గం కానరాక అన్నం కోసం ఆకాశం వైపు ఎదురు చూసే ధీన పరిస్థితులవి.. కుటుంబ పోషణ బరువై వలసబాట పట్టిన రైతులు కొందరు కాగా.. ఆత్మ ధైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడిన రైతులు మరికొందరు. తీవ్ర కరువు పరిస్థితుల్లో అనేక పల్లెల బతుకు చిత్రాలివి.. అయితే ఆ పల్లెల్లోని కుటుంబాలు  ధైర్యాన్ని సడలించక వ్యవసాయ రంగాన్ని పాడివైపు మళ్లించారు.

పాడి పశువులను కొనుగోలు చేసుకొని క్రమంగా పాల ఉత్పత్తిని పెంచుకున్నారు. నీళ్ళు దొరకని ప్రాంతంలో క్షీర విప్లవంగా మార్చారు. ముల్కనూర్‌ పేరును ‘మిల్క్‌’నూర్‌గా మార్చేశారు. దేశంలోనే ప్రప్రథమంగా మహిళల భాగస్వామ్యంతో స్వకృషి డెయిరీని నెలకొల్పి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌ స్వకృషి డెయిరీ 16వ వసంతంలోకి అడుగుడితున్న సందర్భంగా  ‘సాక్షి’  ప్రత్యేక కథనం..  

వరస కరువుతో పంటలు ఎండిపోతూ... పెట్టుబడులు కూడా రాని పరిస్థితుల నుంచి గట్టెంకేందుకు మహిళలు పొదుపు మంత్రాన్ని ఎంచుకున్నారు. 1999లో మండలంలోని ముస్తఫాపూర్‌లో 20మంది మహిళలు పొదుపు సంఘాన్ని ఏర్పాటు చేసుకొని.. దినదినాభివృద్ధి సాధిస్తూ ఈ పొదుపు మంత్రాన్ని ఇతర గ్రామాల మహిళలకూ నేర్పించారు. ‘కవ్వమాడిన చోట కరువుండదు’ అనే సామెతను ఒంటబట్టించుకున్న మహిళలు పాడి పరిశ్రమపై దృష్టి సారించారు. పాల ద్వారా వస్తున్న డబ్బులను సంఘంలో రుణం చెల్లించేవారు.  వారికి వ్యవసాయం కంటే పాడి పోషణే లాభాసాటిగా మారింది. కరువు తాండవిస్తున్న కాలంలో పాడి పరిశ్రమలో లాభాలు గడిస్తూ.. ముల్కనూర్‌ స్వకృషి మహిళా డెయిరీ సభ్యులు తమ కుటుంబాలను పోషిస్తూ ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తున్నారు. 

ఉమ్మడి కరీంనగర్, వరంగల్‌ జిల్లాలోని 72గ్రామాల్లోని 5,200 మంది సభ్యులు.. రూ. 7కోట్లతో మండలంలోని ముల్కనూర్‌లో 17ఆగస్టు 2002లో మహిళ స్వకృషి డెయిరీ ప్రారంభమయింది. నేడు 159 గ్రామాల్లో 22వేల మంది సభ్యులతో రూ. 100 కోట్ల వ్యాపారం చేస్తూ లాభాల బాటలో పయనిస్తోంది. వీరి పట్టుదల, కృషి, ధృడ సంకల్పానికి  స్వయంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, గవర్నర్‌ నరసింహన్‌లు ముగ్ధులయ్యారు.

నాణ్యతలో రాజీ లేదు..ముల్కనూర్‌ స్వకృషి పాలు అంటే  నాణ్యతకు మారుపేరు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తునందుకుగాను నాలుగు పర్యాయాలు ఐఎస్‌ఓ గుర్తింపు లభించింది. 2012 డిసెంబర్‌ 6న అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా జాతీయ స్థాయిలో ‘ఉత్తమ సహకార సంఘం’ అవార్డును.. అధ్యక్షురాలు కడారి పుష్పలీల, జీఎం మార్పాటి భాస్కర్‌రెడ్డి అందుకున్నారు.  హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ సంస్థతో ఒప్పందం చేసుకున్న డెయిరీ తెలంగాణలోని 20 హెచ్‌పీ పెట్రోల్‌ పంపుల్లో  సైతం పాలను, పాల ఉత్పత్తులను విక్రయిస్తోంది.  

పాలు, పాల ఉత్పత్తులను తాజాగా విక్రయించేందుకు ఇటీవలే నాలుగు మొబైల్‌ ఫ్రీజర్‌ వాహనాలను కొనుగోలు చేశారు. డెయిరీ అందిస్తున్న సేవలు..పశవుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు  డెయిరీ ఆధ్వర్యంలో గ్రామాల్లో పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. పశువులకు దాణా, తౌడు, గడ్డి విత్తనాలు, మినరల్‌ మిక్షర్, వ్యాధి నిరోధక టీకాలు, కృత్రిమ గర్భధారణ చేయిస్తోంది.

పశుభీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది. మైక్రో ట్రైనింగ్‌ సెంటర్‌ను నెలకొల్పి రైతులకు శిక్షణ ఇస్తున్నారు. సంఘ సభ్యుల్లో ఎవరికైనా సాధారణ మరణం సంభవిస్తే రూ. 20వేలు ప్రమాదవశాత్తు మృతి చెందితే రూ. లక్ష అందిస్తున్నట్లు డెయిరీ అధ్యక్షురాలు గుర్రాల విజయ, జనరల్‌ మేనేజర్‌ భాస్కర్‌రెడ్డి తెలిపారు.

 వీఐపీల సందర్శన..

సుమారుగా 15 దేశాలకు చెందిన ప్రతినిధులు, గవర్నర్‌ నరసింహన్‌  డెయిరీని సందర్శించారు. సీఎం హోదాలో దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 2006 మార్చి 18న ముల్కనూర్‌కు వచ్చి మహిళలకు కితాబునిచ్చారు.సభ్యులకు ప్రోత్సాహకాలుపాల సంఘాలకు ఎక్కువ స్థాయిలో పాలను అందించిన సభ్యులను గుర్తించి ప్రతి ఏ టా జులై మాసంలో జరిగే మహసభలో అట్టి సభ్యులకు ప్రోత్సాహకాలు అందిస్తుంది డెయిరీ.

ఇక డెయిరీ 12మంది పాలక వర్గ సభ్యులు ప్రతి నెలా ప్రత్యేక సమావేశం నిర్వహించి సభ్యుల సంక్షేమం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై చర్చించుకుంటారు. సభ్యుల కు ప్రతి 15 రోజులకొకసారి పాల బిల్లును అం దిస్తారు. ముల్కనూర్‌ మహిళ డెయిరీలో ఈ నెల 31న 16 వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా.. ఆ రోజున డెయిరీ మహాసభ నిర్వహించనున్నట్లు జీఎం భాస్కర్‌రెడ్డి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/4

పాలు పోస్తున్న గిరిజన మహిళలు

2
2/4

అవార్డును అందుకుంటున్న అప్పటి అధ్యక్షురాలు పుష్పలీల(ఫైల్‌)

3
3/4

పాలు పోసేందుకు క్యూ కట్టిన మహిళలు

4
4/4

ముల్కనూరు డెయిరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement