పబ్‌లో ముజ్రా పార్టీ భగ్నం
18 మంది అరెస్టు
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని షాంగ్రిల్లా ప్లాజాలో ఆఖరి అంతస్తులో ఉన్న హైడ్రోజన్ పబ్‌లో బుధవారం రాత్రి ముజ్రా పార్టీపై వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. 11 మంది యువకులు, ఏడుగురు యువతులు ముజ్రా పార్టీలో భాగంగా మద్యం సేవిస్తూ నగ్నంగా నృత్యాలు చేస్తుండగా పోలీసులు దాడి చేసి వీరందరినీ అదుపులోకి తీసుకున్నారు. వీళ్లంతా విద్యార్థులు కాగా సంపన్న వర్గాలకు చెందిన వారు కావడం గమనార్హం. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల నుంచే కాకుండా గచ్చిబౌలి, బేగంపేట, పాతబస్తీలకు చెందిన యువతీ యువకులు కూడా ఇందులో పట్టుబడ్డారు.
వీరందరినీ జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. హైడ్రోజన్ పబ్ మేనేజర్ పద్మనాభంను అరెస్టు చేశారు. గురువారం వీరందరినీ కోర్టుకు హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు. ఇంకోవైపు ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున విదేశీ మద్యం, గంజాయి, ఖరీదైన సిగరెట్లు, కొంత డ్రగ్స్‌ను కూడా గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు వచ్చేలోపే చాలా వరకు గంజాయి, డ్రగ్స్ ప్యాకెట్లను బయటకు విసిరేసినట్లు సమాచారం. ఇంకోవైపు ఇక్కడ ముజ్రా పార్టీ జరుపుకోవడానికి రూ.3 లక్షలు అద్దె చెల్లించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మొత్తం 68 మంది యువతీ, యువకులు ఈ ముజ్రా పార్టీలో పాల్గొనాల్సి ఉండగా రాత్రంతా ఈ పార్టీ జరుపుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక్కొక్కరుగా 18 మంది జమ అయ్యేలోపు పోలీసులు దాడి చేసి వీరందరినీ అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఒక హిజ్రా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.