సాక్షిప్రతినిధి, కరీంనగర్/సాక్షి, పెద్దపల్లి: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ముందస్తు కసరత్తు చేస్తోంది. ఈ నెల 10 నుంచి ఆశావహ నేతల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. గురువారం (14వ తేదీన) ఈ తతంగం ముగియనుంది. 15 నుంచి 17 వ తేదీ వరకు లోక్‌సభ స్థానాల పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్యనేతలు, నాయకులతో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం అందించారు. కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల ఇన్‌చార్జి శ్రీనివాసకృష్ణన్ ఈ రెండు నియోజకవర్గాల నేతలతోనే 15న హైదరాబాద్ గాంధీభవన్‌లో భేటీ కానున్నారు.
కరీంనగర్ ఎంపీ సీటు కోçసం పోటాపోటీ..
కరీంనగర్ లోక్‌సభ సీటును సిట్టింగ్ ఎంపీ వినోద్‌కుమార్‌కే మరోసారి టికెట్ ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్రసమితి ప్రకటించగా.. ఈ స్థానం నుంచి గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థినే బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యోచిస్తోంది. అయితే ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు చాలా మందే ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. కరీంనగర్ మాజీ ఎంపీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్‌కే కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కుతుందన్న ప్రచారం జరుగుతున్నా.. ఆశావహులు చాలా మంది దరఖాస్తు చేసుకోవడం ఆ పార్టీలో చర్చనీయంశంగా మారింది. ఈ నెల 10 నుంచి మంగళవారం వరకు పలువురు హైదరాబాద్‌లో దరఖాస్తు చేసుకున్నారు.
మహిళా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు నేరేళ్ల శారద, డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం, అధికార ప్రతినిధి రేగులపాటి రమ్యారావు, ఆ పార్టీ సీనియర్ పల్కల రాఘవరెడ్డిలతో పాటు మరో ఇద్దరు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 14కు పొడిగించడంతో మరికొందరు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇదిలా ఉంటే రాజకీయ చైతన్యం కలిగిన కరీంనగర్ పార్లమెంట్ స్థానంపై మాత్రం అభ్యర్థి ఎంపికలో అధిష్టానం సీరియస్‌గానే యోచిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ నెల 15న జిల్లా కమిటీల అధ్యక్షులు, పార్లమెంట్, అసెంబ్లీ ఇన్‌చార్జిలతో ఏఐసీసీ కార్యదర్శి, కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల ఇన్‌చార్జి శ్రీనివాస్‌కృష్ణన్ సమావేశం ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.
పెద్దపల్లికి పెరిగిన దరఖాస్తులు..
రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే రిజర్వుడ్ స్థానమైన పెద్దపల్లి లోక్‌సభ టికెట్ కోసం అధిక డిమాండ్ కనిపిస్తోంది. మంగళవారం నాటికే పది మందికి పైగా పెద్దపల్లి సీటు కోసం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. ఇందులో స్థానికుల నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్ హవా కొనసాగగా, పెద్దపల్లి లోకసభ సెగ్మెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీనిచ్చింది. మంథనిలో ఏకంగా కాంగ్రెస్ విజయం సాధించగా, ధర్మపురిలో అతిస్వల్ప తేడాతో ఓటమి చెందింది. పెద్దపల్లిలోనూ తక్కువ మెజార్టీతో వెనుకబడగా, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల్లో సైతం గట్టి పోటీ ఇచ్చింది.
దీంతో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారంలో ఉన్నంతగా టీఆర్‌ఎస్‌కు అనుకూల వాతావరణం ఉండదని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అలాగే సింగరేణి కార్మికులు అధికంగా ఉన్న రామగుండం నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఓడిపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. దీంతో సహజంగానే పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీలో పోటీ తీవ్రమైంది. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్, రాష్ట్ర నాయకుడు అద్దెంకి దయాకర్, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఊట్ల వరప్రసాద్, గుమ్మడి కుమారస్వామి, గోమాస శ్రీనివాస్, మన్నె క్రిశాంక్ తదితరులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉండడంతో మరింత మంది పెద్దపల్లికి పోటీపడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment