సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీలో పోటీ రోజురోజుకు పెరుగుతోంది. ఎవరికి తోచిన విధంగా వారు లాబీయింగ్ చేయడంలో నిమగ్నమైన ఆశావహ నేతలు గాంధీభవన్‌లో దరఖాస్తులు చేసుకున్నారు. మొదట ఈ నెల 14 వరకే దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించిన అధిష్టానం ఆదివారం సాయంత్రం వరకూ ఆశావహ నేతల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. కాగా పార్లమెంట్ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరు, పార్టీ శ్రేణులను అప్రమత్తం చేసి అభ్యర్థులను గెలిపించే వ్యూహాలపై కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని ముఖ్యనేతలు హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి వరకు భేటీ అయ్యారు.
పెద్దపల్లి, కరీంనగర్ లోక్‌సభ స్థానాల పరిధిలోని ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన 14 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ ఇన్‌చార్జీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస్‌కృష్ణన్, టీపీసీసీ చీప్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులతో సమావేశం నిర్వహించారు. అయితే పెద్దపల్లి, కరీంనగర్ స్థానాలకు దరఖాస్తు చేసుకున్న అశావహ నేతలపై తమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని డీసీసీ అధ్యక్షులకు సూచించినట్లు తెలిసింది. ఆఫీస్ బేరర్లు, ముఖ్య నేతలు కూడా తమ అభిప్రాయాలు ఇవ్వవచ్చని సూచించారు. ఈ అంశాలపై చర్చించేందుకు ఆదివారం సాయంత్రం మరోమారు ఈ రెండు సెగ్మెంట్ల పరిధిలోని నేతలతో సమావేశం కానున్నారు.
కరీంనగర్ తెరపైకి అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి..
నిన్న మొన్నటి వరకు కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే వ్యక్తుల్లో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేరు ప్రముఖంగా వినిపించింది. శుక్రవారం రాత్రి వరకు హైదరాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ నేతల సమావేశం అనంతరం హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ నుంచి టికెట్ ఆశించిన ప్రవీణ్‌రెడ్డి పొత్తులో భాగంగా ప్రజాకూటమి సీటును అభ్యర్థి, సీపీఐ నేత చాడ వెంకటరెడ్డికి కేటాయించడంతో పోటీ నుంచి తప్పుకున్నారు.
2014 వరకు హుస్నాబాద్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన ఆ ఎన్నికల్లో ఓటమి చెందారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కూటమి అభ్యర్థికి వెళ్లగా, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రవీణ్‌రెడ్డిని కరీంనగర్ నుంచి బరిలో దింపితే బాగుంటుందని కొందరు సీనియర్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. కరీంనగర్ టికెట్ రేసులో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రముఖంగా వినిపిస్తుండగా, డీసీసీ చైర్మన్ కటకం మృత్యుంజయం, నేరెళ్ల శారద, రేగులపాటి రమ్యారావు, ప్యాట రమేష్, ఆమ ఆనంద్, జువ్వాడి నిఖిల్ చక్రవర్తి తదితరులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఇదే సమయంలో అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి పేరు తెరమీదకు రావడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
పెద్దపల్లి ఎంపీ కోసం పోటాపోటీ..
2014 ఎన్నికలకు ముందే టీఆర్‌ఎస్ నుంచి మళ్లీ మాతృసంస్థ కాంగ్రెస్ పార్టీలో చేరిన వివేక్ ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన విషయం విదితమే. కాంగ్రెస్‌ను వీడిన వివేక్ ఈసారి టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేయనుండగా, కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు 15 మందికి పైగా దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత పీసీసీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్, డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణ, జెడ్పీ మాజీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, గుమ్మడి కుమారస్వామి, గోమాస శ్రీనివాస్, టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, గజ్జెల కాంతంతో పాటు సుమారు పదిహేను మంది ఈ స్థానంపై కన్నేశారు.
పెద్దపల్లి లోక్‌సభ స్థానంలో పూర్వ కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలోని పెద్దపల్లి, ధర్మపురి, రామగుండం, మంథని, చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో మంథనిలో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి డి.శ్రీధర్‌బాబు గెలుపొందగా, రామగుండంలో ఇండిపెండెంట్ గెలిచారు. పెద్దపల్లిలో టీఆర్‌ఎస్‌కు గతం కంటే మెజార్టీ తగ్గగా, ధర్మపురిలో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్‌కుమార్ నాలుగు వందల స్వల్ప మెజార్టీతో ఓటమి చెందారు. మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరులోనూ కాంగ్రెస్ పరిస్థితి ఫరవాలేదని భావిస్తున్న ఆ పార్టీ నేతలు పెద్దపల్లి సీటు కోసం ‘క్యూ’ కడుతున్నట్లు చెప్తున్నారు. ఈ సీటు విషయంలో మాజీ మంత్రి శ్రీ«ధర్‌బాబు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతుండగా, త్వరలోనే అభ్యర్థుల ఖరారుపై స్పష్టత రానుందని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment