సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గురుకులాల్లోని ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ) పోస్టులకు ఇప్పటివరకు 4,078 మందిని ఎంపిక చేసినట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. మొత్తంగా 10 సబ్జెక్టుల్లో 4,362 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా, 9 సబ్జెక్టులకు సంబంధించిన 4,078 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు పేర్కొంది. ఒక్క సైన్స్ సబ్జెక్టులో 284 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయలేదని పేర్కొంది. తాజాగా సోమవారం టీజీటీ ఇంగ్లిష్, హిందీ సబ్జెక్టుల పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు వెల్లడించింది.
ఫలితాలను తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. ఇందులో 752 టీజీటీ ఇంగ్లిష్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశామని, మరో 37 మంది వికలాంగుల ఫలితాలను మెడికల్ రిపోర్టులు వచ్చాక ప్రకటిస్తామని పేర్కొంది. అలాగే ఒక పోస్టుకు సంబంధించి కోర్టు కేసు ఉన్నందున పెండింగ్‌లో పెట్టినట్లు తెలిపింది. టీజీటీ హిందీ పోస్టులకు 354 మందిని ఎంపిక చేసినట్లు వెల్లడించింది. అందులో 20 మంది వికలాంగులకు సంబంధించిన ఫలితాలను వారి మెడికల్ రిపోర్టులు వచ్చాక ప్రకటిస్తామని వివరించింది.
నెల రోజుల వ్యవధిలోనే..
నెల రోజుల వ్యవధిలోనే 5,405 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసి, ఫలితాలను వెల్లడించినట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్ తెలిపారు. అందులో టీజీటీ పోస్టులకు 4,078 మందిని, ఏఈఈ పోస్టులకు 132 మందిని, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ పోస్టులకు నలుగురిని, గ్రేడ్–2 అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పోస్టులకు 851 మందిని, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు 340 మందిని ఎంపిక చేసి, ఫలితాలను ప్రకటించినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు టీఎస్‌పీఎస్సీ 30,490 పోస్టుల భర్తీకి 83 నోటిఫికేషన్లను జారీ చేసిందని, అందులో 11,023 పోస్టులను భర్తీ చేసిందని, మరో 19,024 పోస్టుల భర్తీ, ఫలితాల వెల్లడి వివిధ దశల్లో ఉంటుందన్నారు.
1న స్టాఫ్ నర్సు ఫైనల్ కీ..
స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫైనల్ కీని మే 1న వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్లు వాణీప్రసాద్ తెలిపారు. వివరాలను వెబ్‌సైట్‌లో పొందవచ్చన్నారు. ఫైనల్ కీపై అభ్యంతరాలు స్వీకరించబోమని వెల్లడించారు.
టీజీటీ పోస్టులకు 4,078 మంది ఎంపిక
Published Tue, May 1 2018 1:28 AM | Last Updated on Tue, May 1 2018 1:28 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment