మూడోవంతు ఉఫ్! | 50 thousand Rejection of application of Regulation | Sakshi
Sakshi News home page

మూడోవంతు ఉఫ్!

Published Fri, Feb 6 2015 2:25 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

మూడోవంతు ఉఫ్! - Sakshi

మూడోవంతు ఉఫ్!

* 50వేల క్రమబద్ధీకరణ దరఖాస్తుల తిరస్కరణ
* అభ్యంతరకర స్థలాల్లో కట్టడాలుండడమే కారణం
* దరఖాస్తులను వడపోసిన జిల్లా యంత్రాంగం
* ఈ నెల 20 నుంచి ఇళ్ల పట్టాల పంపిణీకి సన్నాహాలు

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పేదలకు ఇళ్ల పట్టాలివ్వాలనే ప్రభుత్వ సంకల్పానికి ఆదిలోనే హంసపాదు పడింది. అభ్యంతరకర స్థలాల్లో ఇళ్లు నిర్మించారనే కారణంతో మూడోవంతు దరఖాస్తులను జిల్లా యంత్రాంగం పక్కనపెట్టింది. గత ఐదు రోజులపాటు దరఖాస్తులను వడపోసిన అధికారగణం 48,110 అర్జీలను తిరస్కరించింది. మల్కాజిగిరి, ఘట్‌కేసర్, శంషాబాద్ మండలాలకు సంబంధించిన సమాచారం ఇంకా రాకపోవడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 125 చదరపు గజాల ప్రభుత్వ స్థలంలో నిర్మించుకున్న ఇళ్ల క్రమబద్ధీకరణకు వెసులుబాటు కల్పించడంతో జిల్లావ్యాప్తంగా 1,51,675 దరఖాస్తులు వచ్చాయి. ప్రాథమికంగా వీటిని పరిశీలించిన రెవెన్యూ అధికారులు.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న చాలా దరఖాస్తులను అనర్హమైనవిగా తేల్చారు.
 
నిషేధిత స్థలాల్లో ఉండడంతో..

అజ్జెక్షన్‌లేని ఆక్రమణలనే క్రమబద్ధీకరణ పరిధిలోకి తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యంగా శిఖం, నాలాల పైనా, భూదాన్, పైగా, దేవాదాయ భూములు, అసైన్‌‌డ, కోర్టు కేసులు,  హెవేల పక్కన వెలిసిన నిర్మాణాలను క్రమబద్ధీకరించకూడదని తేల్చిచెప్పింది. రికార్డుల ప్రకారం సర్వే నంబర్లను పరిశీలించిన ఆయా మండలాల తహసీల్దార్లు అభ్యంతరం తెలుపుతూ దాదాపు 50వేల దరఖాస్తులను తోసిపుచ్చారు. వీటిలో అధికంగా బాలానగర్, శేరిలింగంపల్లిలో ఉన్నాయి. ఈ రెండు మండలాల్లో 24 వేల అర్జీలను అనర్హమైనవిగా గుర్తించారు. కుత్బుల్లాపూర్ 9వేలు, కీసర 5వేలు, సరూర్‌నగర్ 1300, హయత్‌నగర్ 1100 దరఖాస్తులను తిరస్కరించారు. కాగా, పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ కేటగిరీలో అతి ఎక్కువగా దరఖాస్తులు వచ్చిన మల్కాజిగిరి మండల పరిధిలో వడపోత ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు.
 
పరిశీలన చకచకా..
50 జీఓ కింద దరఖాస్తుల పరిశీలనకు జిల్లా యంత్రాంగం 61 ప్రత్యేక బృందాలను నియమించింది. తహసీల్దార్ సారథ్యంలో డిప్యూటీ తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్, సర్వేయర్‌ను 125 గజాల స్థలాల నిర్మాణాలను పరిశీలించే పనికి వినియోగించింది. వడపోసిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన పిదప ఆర్డీఓ నేతృత్వంలోని కమిటీ ఈ స్థలాల రెగ్యులరైజేషన్‌కు శ్రీకారం చుట్టాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి అనుగుణంగా షెడ్యూల్‌ను ఖరారు చేసింది.
 
ఈ నేపథ్యంలో ఈ నెల 20వ తేదీలోపు బీపీఎల్ కేటగిరీలోని దరఖాస్తులన్నింటినీ క్లియర్ చేయాలని ఆదేశించింది. అనంతరం పేదలకు ఇళ్ల క్రమబద్ధీకరణ పట్టాలివ్వనున్నట్లు పేర్కొంది. దీంతో యుద్ధప్రాతిపదికన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పూర్తి చేసేలా జిల్లా యంత్రాంగం కసరత్తు పూర్తి చేసింది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement