House tracks
-
జగనన్న కాలనీలు ఆధునిక లోగిళ్లు
సాక్షి, అమరావతి: జగనన్న కాలనీల్లో శాశ్వతప్రాతిపదికన అత్యాధునిక మౌలిక సౌకర్యాలు కల్పించి, ఆధునిక లోగిళ్లుగా తీర్చిదిద్దుతున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు. శుక్రవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మాట్లాడారు. త్వరలోనే జగనన్న కాలనీలు పూర్తవుతాయని, రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం ఒక చరిత్ర అని చెప్పారు. 4బీ అప్లికేషన్ జియో ట్యాగ్ విషయంలో చర్యలు తీసుకుంటామన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీకి చంద్రబాబు అడ్డంకులు సృష్టిస్తున్నారని, చివరికి కోర్టులో కేసులు కూడా వేయించారని తెలిపారు. భూములను కొని మరీ పేదవారికి ఇళ్లు ఇస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. జగనన్న కాలనీల్లో అత్యాధునిక సౌకర్యాలు కల్పించడం గొప్ప విషయమని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఏ పార్టీ వారైనా ఇళ్లు లేని ప్రతి ఒక్కరికీ సీఎం జగన్ ఇళ్లు కట్టించి ఇస్తున్నారని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. వేలాది ఎకరాల భూమి కొనుగోలు చేసి సంతృప్తస్థాయిలో పేదలందరికీ ఇళ్లు ఇవ్వడం ఓ చరిత్ర అని ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి కొనియాడారు. కొన్నిచోట్ల పట్టా కేటాయించిన తర్వాత రద్దవడంపై పరిశీలన జరపాలని ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు కోరారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు ఇళ్లను అమ్ముకునేవని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి అన్నారు. సాంకేతిక సమస్యలతో ఇళ్లు లభించని వారికి వేరే చోట పట్టాలివ్వాలని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ కోరారు. సీఎం జగన్ చేపడుతున్న కార్యక్రమాలు అద్భుతమని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి చెప్పారు. శ్రీకృష్ణదేవరాయలు తరం, వైఎస్ జగన్మోహన్రెడ్డి తరం అని చరిత్ర చెప్పుకుంటుందని అన్నారు. టీడీపీ హయాంలో అనారోగ్యశ్రీగా మార్చారు - మంత్రి రజిని టీడీపీ హయాంలో ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె మాట్లాడుతూ... టీడీపీ హయాంలో 107 ప్రొసీజర్లు పెంచితే, ఆరోగ్యశ్రీలో 3,138 ప్రొసీజర్లు పెంచిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కు దక్కుతుందని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకానికి ఆరోగ్యశ్రీ స్ఫూర్తిగా నిలిచిందని మంత్రి తెలిపారు. మత్స్యకారులకు అండగా ఉంటాం- మంత్రి సీదిరి అప్పలరాజు వేట నిషేధ సమయంలో ప్రతి మత్స్యకారునికి మత్స్యకార భరోసా అందిస్తున్నామని పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. ప్రమాదంలో మరణించిన మత్స్యకారుడు కుటుంబ పెద్ద కాకపోయినప్పటికీ పరిహారం అందిస్తున్నామని చెప్పారు. భీమిలి, చింతపల్లి, రాజయ్యపేట వద్ద ఎఫ్‌ఎల్‌సీలకు టెండర్ల ప్రక్రియ త్వరలో ప్రారంభిస్తామన్నారు. అవసరమైతే సబ్సిడీ మొత్తాన్ని పెంచుతామన్నారు. మత్స్యకార భరోసా కుటుంబంలో అందిరికీ వర్తింపజేయాలని ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్ కోరారు. 15 రోజుల శిక్షణతో అర్చకత్వం హిందూ ధర్మ ప్రచారం, రక్షణకు చర్యలు తీసుకుంటున్నామని దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ ఏడాది 2,900 దేవాలయాలు నిర్మిస్తున్నామని, ధూపదీప నైవేద్యాల కింద రూ.27.47 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ధూపదీప నైవేద్యాల పెండింగ్ బిల్లులు పది రోజుల్లో క్లియర్ చేస్తామన్నారు. దేవాలయానికి సంబంధం ఉన్న ప్రతి కమిటీకి ఏటా రూ.15 కోట్లు ఇస్తున్నామని వెల్లడించారు. దేవాలయాల్లో పని చేసేందుకు ఆసక్తితో ఉన్న వారికి 15 రోజులు శిక్షణ ఇచ్చి అర్చకత్వంలో నియమిస్తామని చెప్పారు. 16 ఏళ్లు నిండిన తరువాత వంశపారంపర్య అర్చకులుగా నియమిస్తామన్నారు. హిందూధర్మ పరిరక్షణకు జగన్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేసిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు చెప్పారు. చంద్రబాబు కూల్చేసిన ఆలయాలను సీఎం జగన్ పునర్మిస్తున్నారని తెలిపారు. -
మూడోవంతు ఉఫ్!
* 50వేల క్రమబద్ధీకరణ దరఖాస్తుల తిరస్కరణ * అభ్యంతరకర స్థలాల్లో కట్టడాలుండడమే కారణం * దరఖాస్తులను వడపోసిన జిల్లా యంత్రాంగం * ఈ నెల 20 నుంచి ఇళ్ల పట్టాల పంపిణీకి సన్నాహాలు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పేదలకు ఇళ్ల పట్టాలివ్వాలనే ప్రభుత్వ సంకల్పానికి ఆదిలోనే హంసపాదు పడింది. అభ్యంతరకర స్థలాల్లో ఇళ్లు నిర్మించారనే కారణంతో మూడోవంతు దరఖాస్తులను జిల్లా యంత్రాంగం పక్కనపెట్టింది. గత ఐదు రోజులపాటు దరఖాస్తులను వడపోసిన అధికారగణం 48,110 అర్జీలను తిరస్కరించింది. మల్కాజిగిరి, ఘట్కేసర్, శంషాబాద్ మండలాలకు సంబంధించిన సమాచారం ఇంకా రాకపోవడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 125 చదరపు గజాల ప్రభుత్వ స్థలంలో నిర్మించుకున్న ఇళ్ల క్రమబద్ధీకరణకు వెసులుబాటు కల్పించడంతో జిల్లావ్యాప్తంగా 1,51,675 దరఖాస్తులు వచ్చాయి. ప్రాథమికంగా వీటిని పరిశీలించిన రెవెన్యూ అధికారులు.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న చాలా దరఖాస్తులను అనర్హమైనవిగా తేల్చారు. నిషేధిత స్థలాల్లో ఉండడంతో.. అజ్జెక్షన్లేని ఆక్రమణలనే క్రమబద్ధీకరణ పరిధిలోకి తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యంగా శిఖం, నాలాల పైనా, భూదాన్, పైగా, దేవాదాయ భూములు, అసైన్డ, కోర్టు కేసులు, హెవేల పక్కన వెలిసిన నిర్మాణాలను క్రమబద్ధీకరించకూడదని తేల్చిచెప్పింది. రికార్డుల ప్రకారం సర్వే నంబర్లను పరిశీలించిన ఆయా మండలాల తహసీల్దార్లు అభ్యంతరం తెలుపుతూ దాదాపు 50వేల దరఖాస్తులను తోసిపుచ్చారు. వీటిలో అధికంగా బాలానగర్, శేరిలింగంపల్లిలో ఉన్నాయి. ఈ రెండు మండలాల్లో 24 వేల అర్జీలను అనర్హమైనవిగా గుర్తించారు. కుత్బుల్లాపూర్ 9వేలు, కీసర 5వేలు, సరూర్‌నగర్ 1300, హయత్‌నగర్ 1100 దరఖాస్తులను తిరస్కరించారు. కాగా, పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ కేటగిరీలో అతి ఎక్కువగా దరఖాస్తులు వచ్చిన మల్కాజిగిరి మండల పరిధిలో వడపోత ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. పరిశీలన చకచకా.. 50 జీఓ కింద దరఖాస్తుల పరిశీలనకు జిల్లా యంత్రాంగం 61 ప్రత్యేక బృందాలను నియమించింది. తహసీల్దార్ సారథ్యంలో డిప్యూటీ తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్‌ను 125 గజాల స్థలాల నిర్మాణాలను పరిశీలించే పనికి వినియోగించింది. వడపోసిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన పిదప ఆర్డీఓ నేతృత్వంలోని కమిటీ ఈ స్థలాల రెగ్యులరైజేషన్‌కు శ్రీకారం చుట్టాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి అనుగుణంగా షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 20వ తేదీలోపు బీపీఎల్ కేటగిరీలోని దరఖాస్తులన్నింటినీ క్లియర్ చేయాలని ఆదేశించింది. అనంతరం పేదలకు ఇళ్ల క్రమబద్ధీకరణ పట్టాలివ్వనున్నట్లు పేర్కొంది. దీంతో యుద్ధప్రాతిపదికన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పూర్తి చేసేలా జిల్లా యంత్రాంగం కసరత్తు పూర్తి చేసింది.