నగరంలో 81 బృందాలు ఏర్పాటు: సోమేశ్
హైదరాబాద్: వర్షాలతో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చూసేందుకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. నాలాలు, డ్రైనేజీల పూడికతీతతో పాటు వర్షం నీరు నిలువ ఉండకుండా చర్యలు తీసుకోనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్‌లో ఇందుకోసం 81 బృందాలను ఏర్పాటు చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ తెలిపారు. ఇవి తమ పరిధిలో నాలాల పూడికతీత పనులను చేపడతాయని, ఈ పనుల నివేదికలను రోజువారీగా తనకు పంపించాలని ఆయన ఆదేశించారు. అదే విధంగా నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి, సంబంధిత బృందాల ఇన్‌ఛార్జిల ఫోన్ నంబర్లను పేర్లతో పాటు బోర్డులు ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను సోమేశ్ కోరారు.