
సాక్షి, హైదరాబాద్/మంచిర్యాల: దేశంలో ఎంపిక చేసిన 25 అత్యుత్తమ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం 8వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) సంస్థ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గడిచిన ఆరు నెలల కాలంలో దేశంలో అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్) సాధించిన 25 విద్యుత్ కేంద్రాలకు ర్యాంకులు ప్రకటించింది. అందులో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం 86.87 శాతం పీఎల్‌ఎఫ్‌తో జాతీయ స్థాయిలో 8వ ర్యాంకు సాధించింది. అది మినహా తెలుగు రాష్ట్రాల నుంచి మరే విద్యుత్ కేంద్రం టాప్–10లో చోటు దక్కించుకోలేకపోయింది. రామగుండంలో ఎన్టీపీసీకి చెందిన సూపర్ విద్యుత్ కేంద్రం ఒక్కటే 82.04 శాతం పీఎల్‌ఎఫ్‌తో 19వ ర్యాంకు సాధించి 25 విద్యుత్ కేంద్రాల జాబితాలో చోటు సంపాదించింది.
ఒక విద్యుత్ కేంద్రం విద్యుదుత్పత్తి సామర్థ్యంతో పోల్చితే.. ఓ ఏడాది కాలంలో ఆ విద్యుత్ కేంద్రం సాధించిన ఉత్పత్తి శాతాన్ని పీఎల్‌ఎఫ్‌గా పరిగణిస్తారు. ప్రభుత్వ రంగానికి సంబంధించిన విద్యుత్ కేంద్రాలు నష్టాల బాట పట్టకుండా ఉండాలంటే ఏటా మెరుగైన పీఎల్‌ఎఫ్ సాధించాల్సి ఉంటుంది. 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం గత ఆరు నెలల్లో 4,613 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిపి 4,325 మిలియన్ యూనిట్లను రాష్ట్రానికి (గ్రిడ్‌కు) సరఫరా చేసింది. ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభమైనప్పటి నుంచి ఈ సెప్టెంబర్ వరకు 8,862 మిలి యన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగా 8,272 మిలియన్ యూనిట్లను రాష్ట్రానికి సరఫరా చేసింది. ఇక సీఈఏ ప్రకటించిన జాబితాలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన 750 మెగావాట్ల బుడ్గె బుడ్గె థర్మల్ విద్యుత్ కేంద్రం 99.77 శాతం పీఎల్‌ఎఫ్‌తో ప్రథమ స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయిలో సింగరేణి సంస్థ 8వ స్థానంలో నిలవడంపై సింగరేణి బొగ్గు గనుల సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. విద్యుత్ ప్లాంట్ ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.
మొదటి నుంచి ఉత్తమ స్థాయిలోనే..
జైపూర్ థర్మల్ విద్యుత్ కేంద్రం మొదటి నుంచి మంచి పీఎల్‌ఎఫ్‌తో ముందుకెళ్తోంది. గత ఆగస్టులో ఈ కేంద్రం అత్యధికంగా 98.43 శాతం పీఎల్‌ఎఫ్‌తో రికార్డు సాధించింది. కేంద్రంలోని యూనిట్–1 గత ఏప్రిల్‌లో 100 శాతం పీఎల్‌ఎఫ్ సాధించగా యూనిట్–2 గత ఫిబ్రవరి, మే నెలల్లో 100 శాతం పీఎల్‌ఎఫ్‌ను నమోదు చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment