‘అంజలి’కి కొండంత అండ..!
‘సాక్షి’ కథనానికి స్పందించిన పలువురు ప్రముఖులు
♦ ఆమె బాగోగులు చూసుకునే బాధ్యత అధికారులకు అప్పగించిన జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్
♦ పత్తి మిల్లులో రావాల్సిన డబ్బులు ఇప్పించాలని కార్మికశాఖ అధికారులకు ఆదేశాలు
♦ అంజలి చదువు బాధ్యతలను తీసుకుంటానన్న సీపీఐ జాతీయ నేత డాక్టర్. కె.నారాయణ
♦ అవే బాధ్యతలు మోసేందుకు ముందుకొచ్చిన టీఆర్ఆర్ గ్రూప్ మాజీ డెరైక్టర్
♦ అంజలికి తామూ బాసటగా ఉంటామని విన్ఫ్రిన్ ఫౌండేషన్ ప్రకటన
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: బాల్య వివాహ దురాచారాన్ని ధిక్కరించి... చదువుకోవాలన్న తన ఆసక్తిని లోకానికి చాటిచెప్పి నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచిన నల్లగొండ జిల్లా డిండి మండలం శేషాయకుంటకి చెందిన వరికుప్పల అంజలి(14)కి అండగా ఉంటామని పలువురు ముందుకొచ్చారు. ‘ప్రియమైన అంజలీ... నీకు జేజేలు’ శీర్షికన ‘సాక్షి’ ప్రధాన ఎడిషన్లో శనివారం ప్రచురితమైన కథనానికి స్పందిం చిన పలువురు ఆమెను ఆదుకుంటామని ప్రకటించారు. ఆమెకు కావాల్సిన సాయా న్ని చేస్తామని తమ ఉదారతను చాటుకున్నారు. ముఖ్యంగా నల్లగొండ జిల్లా అధికార యంత్రాంగం అంజలి పట్ల బాధ్యతగా స్పందించింది. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్. ఎన్. సత్యనారాయణ ‘సాక్షి’ కథనంపై ఆరా తీశారు.
అంజలి స్థితిగతుల గురించి మహిళా, శిశు సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంజలి బాగోగులను చూసుకోవాలని, ఎప్పటికప్పుడు ఆమె గురించిన వివరాలను తమకు తెలియజేయాలని జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ మోతీ, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి రాజశేఖర్లను ఆయన ఆదేశించారు. అదే విధంగా ఆమనగల్లో అంజలి పనిచేసిన కాటన్మిల్లు యాజమాన్యం ఆమెకు ఇవ్వాల్సిన రూ. లక్షన్నర రూపాయలను ఇప్పించాలని కూడా ఆయన కార్మిక శాఖ అధికారులను ఆదేశించారు. మహబూబ్నగర్లో ఉన్న కార్మిక శాఖ అధికారులతో మాట్లాడిన ఆయన అంజలికి రావాల్సిన డబ్బులన్నింటినీ ఇప్పించి ఆమె అకౌంట్లో జమ చేయాలని సూచించారు. అదే విధంగా బాలకార్మికురాలి చేత పనిచేయించుకున్న కాటన్మిల్ యాజమాన్యంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, ఆ మిల్లుపై జరిమానా విధించి, ఆ జరిమానా మొత్తాన్ని కూడా అంజలికి అందజేస్తామని ఆయన ‘సాక్షి’కి తెలిపారు. కాగా, అంజలికి తౌక్లాపూర్లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో ఎనిమిదో తరగతిలో అడ్మిషన్ ఇచ్చారు అధికారులు.
ఉదారతతో ముందుకొచ్చిన విద్యావేత్తలు
చదువుకోవాలన్న అంజలి తపనను చూసి చలించిన విద్యావేత్తలు కూడా ఆమెకు అండగా ఉంటామని ముందుకు వచ్చారు. ఖరగ్పూర్ ఐఐటీ మాజీ ప్రొఫెసర్, సీబీఐటీ కళాశాల మాజీ ప్రిన్సిపాల్, టీఆర్ఆర్ గ్రూపు విద్యాసంస్థల మాజీ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎస్.రామస్వామిరెడ్డి కూడా అంజలికి బాసటగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆమెతో మాట్లాడి ఆమె ఇష్టానుసారం తాను సాయం చేస్తానని చెప్పారు. అదే విధంగా యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కలిసి సామాజిక దృ క్పథంతో ఏర్పాటు చేసిన విన్ఫ్రిన్ ఫౌండేషన్ కూడా అంజలి పక్షాన ఉంటామని ప్రకటించింది. ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ చైతన్య ‘సాక్షి’తో మాట్లాడుతూ చదువుకునే విద్యార్థులను ప్రోత్సహించాలనే ఆలోచనతోనే తాము విన్ఫ్రిన్ ఫౌండేషన్ను ఏర్పాటు చేసుకున్నామని, అందుకే అంజలిని ఆదుకోవాలనే నిర్ణయానికి వచ్చామని ఆయన వెల్లడించారు. కాగా, అంజలి స్ఫూర్తిని ప్రపంచానికి చాటిచెప్పి సామాజిక బాధ్యతను నిర్వర్తించిన ‘సాక్షి’ని పలువురు ప్రశంసిస్తూ ఫోన్లు, ఎస్ఎంఎస్లు, సామాజిక మాధ్యమాల ద్వారా అభినందనలు తెలియజేశారు.
చదివించే బాధ్యత తీసుకుంటా
డాక్టర్ కె. నారాయణ
అంజలి విషయాన్ని ‘సాక్షి’ కథనం ద్వారా తెలుసుకున్న సీపీఐ జాతీయ నాయకుడు డాక్టర్. కె. నారాయణ వెంటనే స్పందిం చారు. ఆమె గురించి నల్లగొండ సాక్షి ప్రతి నిధితో మాట్లాడిన నారాయణ ఆమె అంగీ కారాన్ని బట్టి స్థానికంగా లేదంటే గుంటూరులోని ఏదైనా మంచి పాఠశాలలో చేర్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు నల్లగొండ జిల్లాకు చెందిన సెయింట్ మేరీస్ పాఠశాల కరస్పాండెంట్ పులిరాజు కూడా నారాయణ అభిమతం మేరకు ఆమెకు ఇంటర్మీడియట్ వరకు చదువు చెప్పిం చేందుకు ముందుకు వచ్చారు.