బాలుడిగా వెళ్లి..ఇద్దరు పిల్లలతో ఇంటికి..
వెల్గటూరు(కరీంనగర్ జిల్లా): తెలిసీ తెలియనితనం... ఉన్న ఊరిని, తల్లిదండ్రులను వదిలివెళ్లి పోయిన ఓ బాలుడు.. పెద్దవాడై, పెళ్లి చేసుకుని తన నలుగురు పిల్లలతో శుక్రవారం ఆకస్మాత్తుగా తల్లిదండ్రుల ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఇన్నాళ్లూ ఉన్నాడో లేడోననుకున్న తమ ఒక్కగానొక్క కుమారుడు... పిల్లలతో సహా రావడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కుమారుడిని, అతడి పిల్లలను గుండెలకు హత్తుకుని పట్టరాని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.
కరీంనగర్ జిల్లా వెల్గటూర్ మండలం అంబారిపేటకు చెందిన సుంకె పోచయ్య-లక్ష్మి దంపతులకు కుమారుడు భూమన్న, ముగ్గురు కూతుళ్లు సంతానం. భూమన్న 12 ఏళ్ల వయసులో తెలిసినవారి వెంట ఇంట్లోంచి వెళ్లి తిరిగిరాలేదు. అతడి కోసం కొన్నేళ్లపాటు ఊరూరా వెతికారు. అయితే, భూమన్న అక్కడక్కడా తిరుగుతూ ముంబై చేరాడు. అక్కడ మేస్త్రీ వద్ద కూలీ పనిచేస్తూ పొట్టపోసుకున్నాడు. అక్కడినుంచి తమిళనాడులోని కన్యాకుమారి వెళ్లాడు. అక్కడే ఓ తమిళ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఓ కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు. అయితే, భూమన్న భార్య అతని తల్లిదండ్రుల గురించి ఆరా తీసింది. వారు ఎక్కడ ఉన్నారో.. ఎలా ఉన్నారో తెలుసుకోవాలని కోరింది. దీంతో తల్లిదండ్రుల జాడ తెలుసుకునేందుకు భూమన్న నాలుగు రోజుల క్రితం ఓ కుమారుడు, కుమార్తెను వెంటేసుకుని బయలుదేరాడు. చిన్నప్పుడే ఇంట్లోంచి వెళ్లిపోయిన అతడికి ఊరు పేరు అంబారిపేట తప్ప ఏమీ గుర్తు లేదు. చివరకు జిల్లాపేరు కూడా మర్చిపోయాడు. మెదక్ జిల్లా సిద్దిపేట సమీపంలోని అంబారిపేటకు వెళ్లాడు. అది కాదని తెలుసుకుని బుధవారం రాత్రి కరీంనగర్ చేరుకుని అక్కడ బస చేశాడు. కొందరిని వాకబు చేయగా వెల్గటూర్ మండలంలో అంబారిపేటకు వచ్చాడు. ఊళ్లో ఆరా తీస్తూ చివరికి ఇంటికి వచ్చాడు. జరిగింది చెప్పడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
కొడుకును, అతడి పిల్లలను గుండెలకు హత్తుకున్నారు. భూమన్న వచ్చాడని తెలుసుకుని ఆ ఇంటికి బంధువులు తరలివచ్చారు. ఇంటిల్లిపాది సంబరాల్లో మునిగితేలారు. తల్లిదండ్రులను తనతోపాటు తీసుకెళ్తానని, కొద్దిరోజులపాటు అక్కడ ఉంచుకుని స్వగ్రామానికి తీసుకువస్తానని తెలిపాడు. ఇన్నేళ్ల తర్వాత తల్లిదండ్రులను, అక్కాచెల్లెళ్లను, బంధువులను, స్నేహితులను కలుసుకోవడం ఆనందంగా ఉందని అతడు సంతోషంలో మునిగిపోయాడు. భూమన్నకు చిన్ననాడు ముక్కు కుట్టించిన రంధ్రాన్ని బట్టి తల్లిదండ్రులు కొడుకును గుర్తుపట్టినట్లు చెప్పారు.