నిందితుడు తిరుపతి
అమ్మాయిల పేరిట బోగస్ ఫేస్‌బుక్ అకౌంట్ సృష్టించి కోరుట్లకు చెందిన ప్రముఖులను బోల్తా కొట్టించిన వ్యక్తి కథలాపూర్ మండలం అంబారిపేట గ్రామానికి చెందిన తిరుపతి (32)గా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న ఇతడిని కోరుట్ల రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అతడు ఎన్ని బోగస్ ఫేస్‌బుక్ అకౌంట్లు సృష్టించి ఎంతమంది వలలో ఇరికించారన్న విషయమై పోలీసులు నిశితంగా విచారణ సాగిస్తున్నారు.
ఆరు వందల మందికి వల?
బోగస్ ఫేస్‌బుక్ అకౌంట్ మెయింటైన్ చేసిన వ్యక్తి కోరుట్లకు చెందిన 601 మందిని చాటింగ్ కోసం ఆహ్వానించినట్లు సమాచారం. దీంట్లో చాలా మంది ప్రముఖులు ఉండటం గమనార్హం. వీరిలో 72 మంది బోగస్ వ్యక్తి మెసేజ్‌కు రెగ్యులర్‌గా స్పందించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచా రం. వీరిని అశ్లీల మెసేజ్‌లు, ఫొటోలు, వీడియో క్లిప్పింగ్స్‌తో రెచ్చగొట్టి తన వలలో వేసుకున్నట్లు సమాచారం. అనంతరం డబ్బులు తన అకౌంట్‌లో వేయాలని బ్లాక్‌మెయిల్‌కు దిగినట్లు తెలిసింది. ఇలా మోసపోయిన చాలామంది పోలీసులకు ఫిర్యాదు చేయడానికి జంకుతున్నట్లు సమాచారం. కొంతమంది తాము ఫిర్యాదు చేస్తే ఎక్కడ పరువు పోతుందోనని ఆందోళన చెందుతున్నారు.
స్వదేశానికి చేరని తిరుపతి
అమ్మాయిల పేరిట బోగస్ ఫేస్‌బుక్ అకౌంట్ సృష్టించిన తిరుపతిని దుబాయ్ నుంచి కోరుట్లకు రప్పించేందుకు మూడురోజులుగా పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం లేదు. కోరుట్ల, కథలాపూర్‌లో ఉన్న అతని బంధువులతోపాటు సన్నిహితుల ద్వారా తిరుపతిని స్వదేశానికి రప్పించేందుకు పోలీసులు తీవ్ర ఒత్తిడి తె స్తున్నారు. మొదట స్వదేశానికి వస్తానని ఫోన్‌లో పోలీసులకు చెప్పిన తిరుపతి అనంతరం తప్పించుకునే రీతిలో వ్యవహరిస్తున్నట్లు సమాచారం. మధ్యవర్తుల ద్వారా అతనికి నచ్చజెప్పేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. తిరుపతి స్వదేశానికి వస్తే తప్ప ఫేస్‌బుక్ వ్యవహారంలో విచారణ మరింత ముందకు వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు.