
దోషులే బాధితులు..!
- ‘సత్యం’ కేసులో ప్రత్యేక కోర్టుకు
- దోషుల తరఫు లాయర్ల నివేదన
- ఆర్థికంగా చితికిపోయారు, కుటుంబాలు గడవడమే కష్టం
- ఈడీ అధీనంలో బ్యాంకు ఖాతాలు, ఆస్తులు
- అప్పు ఇచ్చేవారు లేరు, జరిమానా చెల్లించలేని పరిస్థితి
- అప్పీళ్లపై ఇప్పట్లో విచారణ పూర్తయ్యేలా లేదు
- శిక్ష అమలును నిలిపివేసి బెయిల్ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: ‘సత్యం’ కుంభకోణం కేసులో దోషులు ఇప్పటికే దాదాపు మూడేళ్లు జైలులో ఉన్నారని, ఆ తర్వాత కూడా రోజు వారీ విచారణకు హాజరయ్యారని వారి తరఫు లాయర్లు కోర్టుకు తెలియజేశారు. ఆరేళ్లుగా వారికి ఉపాధి లేదని, సమాజ బహిష్కరణను ఎదుర్కొంటున్నారని, తీవ్రమైన మానసిక క్షోభను అనుభవించారని వివరిం చారు. ఈ కేసులో ప్రత్యేక కోర్టు విధించిన ఏడేళ్ల జైలు శిక్ష అమలును తాత్కాలికంగా నిలిపివేయాలని కోరారు. ఈ మేరకు రామలింగరాజు సహా ఇతరులు పెట్టుకున్న పిటిషన్లను 8వ అదనపు ఎంఎస్‌జే, ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు గురువారం విచారించింది. తీవ్రమైన నేరాలకు పాల్పడిన కేసుల్లో, సమాజానికి ప్రమాదకరమని భావించే కేసుల్లో మినహా దోషులు చేసుకున్న అప్పీళ్లపై విచారణ సమయంలో వారిని జైలులో ఉంచాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అనేక కేసుల్లో తీర్పులిచ్చినట్లు వారి తరఫు న్యాయవాదులు నివేదించారు. ఈ కేసులో మదుపుదారులెవరికీ నష్టం జరగలేదని, దోషులు మాత్రమే బాధితులుగా మిగిలిపోయారని పేర్కొన్నారు.
రోడ్డున పడిన కుటుంబాలు
2009 జనవరిలో ‘సత్యం’ నిందితులను అరెస్టు చేసి జైలుకు తరలించారని వారి లాయర్లు కోర్టుకు వివరించారు. ‘రామలింగరాజు, రామరాజు, వడ్లమాని శ్రీనివాస్‌లు దాదాపు 35 నెలలు, ఇతరులు రెండేళ్లకుపైగా జైలులో ఉన్నారు. దీంతో వారు ఆర్థికంగా చితికిపోయారు. కుటుంబాలు రోడ్డునపడ్డాయి. బంధుమిత్రులు దూరమయ్యారు. సామాజిక బహిష్కరణను ఎదుర్కొంటున్నా రు. బ్యాంకు ఖాతాలు, ఆస్తులు ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్నాయి. దీంతో వారికి ఉపాధి పోయింది. ప్రస్తుతం ఆ కుటుంబాల జీవనం గడవడమే కష్టంగా ఉంది. ప్రత్యేకకోర్టు భారీగా విధించిన జరిమానా కూడా చెల్లించే పరిస్థితుల్లో లేరు. కనీసం అప్పు ఇచ్చేవారు కూడా లేరు. అప్పీళ్లపై నిర్ణయం తీసుకోవాలంటే దాదాపు 20 వేల డాక్యుమెంట్లను 226 మంది సాక్ష్యుల వాంగ్మూలాలు, 3 వేల పైచిలుకు కీలక పత్రాలను పరిశీలించాల్సి ఉంటుంది.’ అని న్యాయవాదులు వివరిం చారు. అప్పీళ్లపై విచారణను నెల రోజుల్లో పూర్తి చేస్తామంటే శిక్ష అమలును నిలిపివేయాలని తాము కోరబోమని, అయితే అది అసాధ్యమని పేర్కొన్నారు.
ప్రత్యేక కోర్టులోనే రెండున్నరేళ్లు..
ఈ కేసు విచారణ కోసమే ప్రత్యేకంగా ఒక కోర్టును ఏర్పాటు చేసి రోజువారీ పద్ధతిలో విచారణ చేపడితేనే తీర్పు వచ్చేందుకు రెండున్నరేళ్లు పట్టిందని దోషుల తరఫు లాయర్లు గుర్తు చేశారు. ఆదాయపన్ను శాఖ దాఖలు చేసిన కేసులతోపాటు ఇతర ఆర్థిక నేరాలకు సంబంధించిన అనేక కేసులు ప్రస్తుతం విచారణలో ఉన్న నేపథ్యంలో దోషుల అప్పీళ్ల విచారణకు కనీసం మూడేళ్లు పడుతుందన్నారు. తమిళనాడు మాజీ సీఎం జయలలిత కేసులో అప్పీళ్లు విచారణలో ఉన్న సమయంలో సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రత్యేక కోర్టు భారీగా జరిమానా విధించిందని, దోషులు అంత డబ్బు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారని నివేదించారు. జరిమానాకు మినహాయింపునిస్తూ నిందితులకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు.
అయితే దీన్ని సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. పదేళ్లపాటు లోతుగా కుట్ర చేసి ఈ కుంభకోణానికి పాల్పడ్డారని, దీంతో మదుపుదారులు తీవ్రంగా నష్టపోయారని సీబీఐ లాయర్ సురేంద్ర వాదించారు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా శిక్ష అమలును నిలిపివేయొద్దని కోరారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జోక్యం చేసుకుని అప్పీళ్లపై విచారణకు ఎంత సమయం పడుతుందని ప్రశ్నించగా.. రెండు వారాల్లో తమ వాదనలు పూర్తి చేస్తామని సురేంద్ర పేర్కొన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం తీర్పును కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.