సాక్షి, హైదరాబాద్: హైకోర్టు విభజన విషయంలో అటు ప్రభుత్వం, ఇటు హైకోర్టు తమను ఏ దశలోనూ సంప్రదించడం లేదని, ఏ విషయం కూడా తమకు చెప్పడం లేదంటూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన న్యాయవాదులు అసంతృప్తిని వ్యక్తం చేసిన నేపథ్యంలో న్యాయమూర్తుల కమిటీ సోమవారం పలువురు సీనియర్ న్యాయవాదులతో సమావేశమైంది. ప్రస్తుతం నేలపాడులో నిర్మిస్తున్న తాత్కాలిక భవనాన్ని డిసెంబర్ 15కల్లా హైకోర్టుకు అప్పగిస్తామని సీఆర్‌డీఏ అధికారులు చెప్పిన విషయాన్ని న్యాయవాదులకు ఆ కమిటీ తెలియచేసింది. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తే డిసెంబర్ నెలాఖరు లేదా జనవరి మొదటివారం నాటికి తాత్కాలిక భవనం నుంచి హైకోర్టు కార్యకలాపాలు సాగించేందుకు వీలవుతుందని ఆ కమిటీ తెలిపింది. అంతేకాక హైకోర్టు భవనంలో న్యాయవాదులకు కల్పిస్తున్న సౌకర్యాలను ఆ కమిటీ వివరించింది.
అందుకు సంబంధించి సీఆర్‌డీఏ అధికారులు సిద్ధం చేసిన ప్లాన్‌లను న్యాయవాదులకు చూపింది. దాదాపు 3వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో న్యాయవాదుల కోసం ఓ హాల్‌ను నిర్మిస్తున్నట్లు తెలిపింది. అదేవిధంగా న్యాయవాదుల సంఘం కార్యవర్గం కోసం చేస్తున్న ఏర్పాట్లను కూడా కమిటీ వివరించింది. సీనియర్ న్యాయవాదులకు ప్రత్యేక ఛాంబర్లు, మహిళా న్యాయవాదులకు చేస్తున్న ప్రత్యేక ఏర్పాట్లు వారికి తెలియచేసింది. అలాగే పార్కింగ్ ఏర్పాట్లను కూడా కమిటీ వివరించింది. ఇదే సమయంలో న్యాయవాదులు తాము ఎదుర్కొనే ఇబ్బందులను కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. రవాణా సదుపాయంతో పాటు బ్యాంకు, పోస్టాఫీస్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని వారు కమిటీని కోరారు. వీటన్నింటినీ కూడా జస్టిస్ రామసుబ్రమణియన్ ఓ పుస్తకంలో నోట్ చేసుకున్నారు.
ఇబ్బందులు కలగకుండా తగిన సంఖ్యలో బస్సులను ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకుంటున్నామని కమిటీ న్యాయవాదులకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. అవసరాన్ని బట్టి మరోసారి సమావేశానికి పిలుస్తామని న్యాయవాదులకు తెలియచేసింది. న్యాయవాదులతో సమావేశమైన కమిటీలో న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఎస్.వి.భట్, జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ సునీల్ చౌదరి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తిలున్నారు. సీనియర్ న్యాయవాదులు డి.వి.సీతారామమూర్తి, టి.నాగార్జునరెడ్డి, ఎం.ఎస్.ప్రసాద్, ఆర్.రఘునందన్‌రావు, వై.వి.రవిప్రసాద్ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు రామన్నదొర, ఇతర కార్యవర్గ సభ్యులు, పలువురు న్యాయవాదులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
జనవరి మొదటివారం నుంచే..
Published Tue, Nov 27 2018 3:04 AM | Last Updated on Thu, Mar 28 2019 5:32 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment