ముదిరిన ‘ఎల్లమ్మ' వివాదం
సిరిసిల్ల రూరల్ :
మల్లాపూర్ ఎల్లమ్మ ఆలయ వివాదం ముదిరింది. రెండు గ్రామాల ప్రజలు పరస్పర దాడులకు తెగబడ్డారు. ఆలయం తమదంటే తమదని జిల్లెల, మల్లాపూర్ వాసులు ఆదివారం ఒకరిపై ఒకరు కట్టెలతో దాడులకు దిగారు. రాళ్లు రువ్వుకున్నారు. వివరాలు.. నిన్న మొన్నటి వరకు కలిసి ఉన్న రెండు గ్రామాల ప్రజలు పంచాయతీల విభజనతో శత్రువులయ్యారు. జిల్లెల్ల పరిధిలోని మల్లాపూర్, ఇందిరానగర్‌లను వేరు చేసి ప్రభుత్వం ఇటీవలే ఇందిరానగర్ ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటుచేసింది.
మల్లాపూర్‌లో ఉన్న ఎల్లమ్మ దేవాలయం 40 సంవత్సరాలుగా జిల్లెల్ల గౌడ సంఘం నిర్వహణలో ఉంది. పంచాయతీల విభజనతో ఎల్లమ్మ దేవాలయం ఇందిరానగర్ పంచాయతీలోకి వచ్చిందని.. అప్పటి నుంచి ఆలయ నిర్వహణ, అభివృద్ధి తామే చూసుకుంటామని మల్లాపూర్ ప్రజలు నిర్ణయించారు. కాదుకాదు ఆలయం మాదేనని.. అన్ని మేమే చూసుకుంటామని జిల్లెల్ల గౌడ సంఘం వారు మల్లాపూర్ వాసులకు తేల్చిచెప్పారు. ఈ రెండు గ్రామాల మధ్య ఈ విషయమై నాలుగు నెలలుగా వివాదం కొనసాగుతోంది. విషయం పోలీసులకు చేరడంతో సిరిసిల్ల పట్టణ సీఐ విజయ్‌కుమార్ ఆర్డీవో బిక్షానాయక్, తహశీల్దార్ ప్రభాకర్‌లు ఇప్పటికి మూడు సార్లు రెండు గ్రామాల ప్రజలను సిరిసిల్లకు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఒక కమిటీ వేసుకుని ఆలయ నిర్వహణ చేపట్టాలని సూచించారు.
కానీ.. మధ్యలో జిల్లెల గౌడ సంఘం వారు గుడి నిర్వహణ హక్కు తమకే ఉంటుందని కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. దీంతో కథ మొదటికొచ్చింది. ఆదివారం జిల్లెల నుంచి సుమారు 200 మంది, మల్లాపూర్‌కు చెందిన 150 మంది ఎల్లమ్మ ఆలయ పరిసరాల్లోకి చేరుకున్నారు. రెండు గ్రామాల ప్రజలు ఆలయం మాదంటే మాదని ఆందోళనకు దిగారు. ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. తలలు పగులగొట్టుకున్నారు. ఈ ఘటనలో 31 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఆందోళనకారులను చెదరగొట్టారు. క్షతగాత్రులను 108, పోలీసు జీపు, ఆటోల్లో సిరిసిల్ల ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. పట్టణ సీఐ విజయ్‌కుమార్, ఏఎస్సై చీనా నాయక్ సంఘటన విచారణ చేపట్టారు. దేవాలయానికి తాత్కలికంగా తాళం వేయించారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటుచేశారు. శాంతి భద్రలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదని.. చట్టరీత్య చర్యలు తప్పవని సీఐ ఇరు వర్గాలను హెచ్చరించారు. తమపైనే దాడి చేశారంటే.. తమపైనే దాడి చేశారని ఇరు గ్రామాల ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై డీఎస్సీ దామెర నర్సయ్య విచారణ జరుపుతున్నారు.
గాయపడ్డది వీరే..
మల్లాపూర్‌కు చెందిన సామనపల్లి బాబు, దయా కిరణ్, మద్దెల రాజయ్య, బాస బాలయ్య, ఎల్లవ్వ, తాటిపల్లి ఎల్లవ్వ, లక్ష్మి, బొదపల్లి మల్లయ్య, బచ్చపల్లి రాజయ్య, మద్దెల లక్ష్మీనారయణ, చిమలపల్లి సంతోష్, దేవనర్సింహులు, రాములు, బర్ల రాజయ్య, మందరపు శ్రీనివాస్, మల్లేవారి బాలయ్య, ఎర్ర శ్రీను, ప్రకాశ్, జిల్లెల్లకు చెందిన బొల్గం రాములు గౌడ్, పూనం తిరుపతి, కోడూరి మల్లేశం, కట్కూరి మల్లేశం, కట్కూరి కిషన్, అంజయ్య, కోడూరి సత్యనారయణ, హన్మండ్లు, బాలయ్య, లింగం, కోడూరి యాదయ్య, వ సుద గాయపడ్డారు. వీరిలో పది మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతి, బాబు, రాముల పరిస్థితి విషమంగా ఉంది.
శాంతిభద్రతలకు
విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు..
జిల్లెల్ల, మల్లాపూర్ గ్రామాల ప్రజలు సంయయనం పాటించాలని డీఎస్పీ దామెర నర్సయ్య కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోమని.. చట్టరీత్య చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఘర్షణకు దారి తీసిన వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. దేవుళ్ల పేరిట ఘర్షణలకు పాల్పడటం సబబు కాదని, కలసి మెలసి ఉండాలన్నారు.