ఏరో స్పేస్‌కు రేపు శంకుస్థాపన
► ఆదిబట్ల సెజ్‌లో ‘టాటా- బోయింగ్’
► వైమానిక విడి భాగాల తయారీ పరిశ్రమ
► 13 ఎకరాల్లో తొలి విడతలో రూ.400 కోట్లతో కార్యకలాపాలు
సాక్షి, హైదరాబాద్: వైమానిక దిగ్గజాలు బోయింగ్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్‌ఎల్)ల సంయుక్త భాగస్వామ్య సంస్థ ‘టాటా బోయింగ్ ఏరో స్పేస్ లిమిటెడ్’ కార్యకలాపాలు హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ శివార్లలోని ఆదిబట్ల ఏరోస్పేస్ సెజ్‌లో భాగస్వామ్య సంస్థ ఏర్పాటు చేస్తున్న వైమానిక విడిభాగాల తయారీ పరిశ్రమకు రక్షణ మంత్రి మనోహర్ పరీకర్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం శంకుస్థాపన చేయనున్నారు. మంత్రి కేటీఆర్‌తో పాటు బోయింగ్, టాటా సంస్థల ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆదిబట్లలో 13 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటవుతున్న ఈ సంస్థ తొలి విడతలో రూ.400 కోట్ల మేర పెట్టుబడితో కార్యకలాపాలు ప్రారంభమవుతుందని పరిశ్రమల శాఖ వర్గాలు వెల్లడించాయి.
అమెరికాతో పాటు ఇతర దేశాల రక్షణ దళాలు ఉపయోగిస్తున్న అత్యాధునిక అపాచీ ఏహెచ్-64 హెలికాప్టర్ కేబిన్‌తో పాటు విడిభాగాలను తొలి దశలో టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ తయారు చేస్తుంది. క్రమంగా వైమానిక రంగంలో అత్యాధునిక వ్యవస్థల అభివృద్ధిపై దృష్టి సారిస్తుంది. బోయింగ్‌కు చెందిన వాణిజ్య, రక్షణ ఆర్డర్లను పొందడం ద్వారా కార్యకలాపాలను విస్తరించాలని కూడా సంస్థ యోచిస్తోంది. ఏరో స్పేస్, రక్షణ రంగ ఉత్పత్తులకు హైదరాబాద్‌ను కేంద్రంగా తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు ఈ భాగస్వామ్య సంస్థ ఏర్పాటు మరింత ఊతమివ్వనుందని పారిశ్రామికవర్గాలు భావిస్తున్నాయి.
ఏరో స్పేస్‌లో పెట్టుబడులు లక్ష్యంగా
రక్షణ, విమాన , అంతరిక్ష రంగ పరిశ్రమల పరంగా జాతీయ స్థాయిలో బెంగళూరు తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో వుంది. రక్షణపరంగా వ్యూహాత్మక ప్రాంతమైన హైదరాబాద్ ఇప్పటికే డీఆర్‌డీఎల్, బీడీఎల్, డీఎంఆర్‌ఎల్, మిధానీ, ఎన్‌ఎఫ్‌సీ, ఎన్‌ఆర్‌ఎస్‌ఏ, భారత్ ఎలక్ట్రానిక్స్, ఓడిఎఫ్, బీహెచ్‌ఈఎల్, హెచ్‌ఏఎల్ వంటి పలు రక్షణ, అంతరిక్ష, వైమానిక రంగ పరిశ్రమలకు కేంద్రంగా ఉంది. వైమానిక విడిభాగాలు ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి అవుతున్న నేపథ్యంలో ఏరో స్పేస్ పరిశ్రమల ఏర్పాటుకు హైదరాబాద్ అనువైనదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆదిబట్లలో ఇప్పటికే రూ.3,000 కోట్లతో ప్రత్యేక ఏరో స్పేస్ సెజ్ ఏర్పాటు కాగా వెలిమినేడుతో పాటు మరో రెండు చోట్ల ఏరో స్పేస్ డిఫెన్స్ పార్కులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జీఎంఆర్, అస్ట్రా, జెన్, రాప్స్ వంటి పదికి పైగా ప్రైవేటు సంస్థలు కూడా ప్రైవేట్ ఏరో స్పేస్ పార్కుల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఫ్రెంచ్ భాగస్వామ్య సంస్థ ప్రాట్-విట్నీతో కలిసి ఏరో స్పేస్ స్కూల్ ఏర్పాటు చేయడంతో పాటు దీనికి సంబంధించి ఐఐటీ హైదరాబాద్‌లో ప్రత్యేక టీ-హబ్ ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.
నేడు రాష్ట్రానికి రక్షణ మంత్రి
రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ నేటి నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తారు. శుక్రవారం మధ్యాహ్నం బొల్లారంలో ఆర్మీ ఆస్పత్రిని ఆయన ప్రారంభించనున్నారు. అదే సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న విందులో పాల్గొంటారు. ఈ సందర్భంగా కటోన్మెంట్‌లో స్థానికంగా రహదారులకు సంబంధించిన సమస్యలను రక్షణ మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే రెండో రోజు శనివారం దుండిగల్‌లోని ఏయిర్‌ఫోర్స్ అకాడమిలో అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొనున్నారు.