ఐకేపీ సభ్యుల పిల్లలకు స్కాలర్‌షిప్ మంజూరు
ముకరంపుర:
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ-ఐకేపీ పథకంలో సభ్యులైన మహిళల పిల్లలకు సెర్ఫ్ (రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ) స్కాలర్‌షిప్‌లు మంజూరు చేసింది. 2013-14 సంవత్సరం ఉపకార వేతనాల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లావ్యాప్తంగా 91,142 మంది పిల్లలకు ప్రయోజనం చేకూరనుంది. వీరికి నెలకు రూ.100 చొప్పున ఏడాదికి రూ.1200 స్కాలర్‌షిప్ వారి ఖాతాలోకి జమ కానుంది. అందుకోసం జిల్లాకు రూ.10 కోట్ల 93 లక్షల 70 వేల 400 నిధులు డీఆర్‌డీఏ జిల్లా శాఖకు చేరాయి.
వాస్తవంగా మూడు నెలల క్రితమే ఈ స్కాలర్‌షిప్‌లు రావాల్సివుండగా ఎన్నికలు, రాష్ట్ర విభజన తదితర కారణాలతో ఆలస్యమయ్యింది. ఒక్కో విద్యార్థికి మంజూరైన రూ.1200లను ఆయా సభ్యుల ఖాతాల్లో జమ చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వారి ఖాతాలను సేకరించి నేరుగా జమ చేస్తున్నారు. నవంబర్ 15లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
డీఆర్‌డీఏ, ఐకేపీలో అమలవుతున్న ఆమ్ ఆద్మీ బీమా యోజన, అభయహస్తం, జన శ్రీ బీమా యోజన తదితర పథకాలలో సభ్యులైన మహిళల పిల్లలు వివిధ పాఠశాలలో చదువుకుంటున్నారు. వారి చదువుకు కనీస అవసరాలైన పెన్నులు, పెన్సిల్, పుస్తకాల కోసం ఖర్చు చేయడానికి నెలకు రూ. 100 చొప్పున విడుదల చేసింది.
జిల్లావ్యాప్తంగా ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకంలోని 23,143 సభ్యులు, అభయహస్తం లోని 62,447 సభ్యులు, జనశ్రీ బీమా యోజనలో సభ్యులైన 5,552 మంది పిల్లల కు ఈ స్కాలర్‌షిప్‌లు అందనున్నాయి. అత్యధికంగా హుజూరాబాద్ మండలంలో 2673 మంది పిల్లలకు రూ. 32 లక్షల 7వేల 600, అత్యల్పంగా ము త్తారం మండలంలోని 457 మంది పిల్లలకు రూ.5 లక్షల 48 వేల 400 విడుదలయ్యాయి.
అర్బన్ ప్రాంతాలలో అభయహస్తం సభ్యు ల పిల్లలకు స్కాలర్‌షిప్ నిధులు విడుదలయ్యాయి. అందులో కోరుట్ల 403 మంది పిల్లలకు రూ.4,83, 600, జగిత్యాలలో 263 మందికి రూ.3,15,600, మెట్‌పల్లిలో 210 మందికి రూ.2,52,000, జమ్మికుంటలో 176 మందికి రూ.2,11,200, సిరిసిల్లలో 889 మందికి రూ.10,96,000, రామగుండంలో 167 మందికి రూ.2,00,400, కరీంనగర్‌లో 135 మందికి రూ.1,62,000, హుస్నాబాద్‌లో 118 మందికి రూ.1,41,600, పెద్దపెల్లిలో 28 మందికి రూ.33,600, వేములవాడలో 8 మంది పిల్లలకు రూ.9,600 మంజూరయ్యాయి.
15లోగా ఆన్‌లైన్‌లో పంపిణీ
-తిరుపతి, ఐకేపీ డీఆర్‌డీఏ డీపీఎం
సెర్ఫ్‌ద్వారా ఐకేపీ సభ్యుల పిల్లలకు నిధులు విడుదలయ్యాయి. వాటిని పంపిణీ చేసే పనిలో వున్నాం. సభ్యులు గానీ వారి పిల్లల ఖాతాలను సేకరించి నమోదు చేస్తున్నాం. ఈనెల 15లోగా స్కాలర్‌షిప్‌ల పంపిణీ ప్రక్రియ పూర్తి చేస్తాం.