ప్రభుత్వ చెల్లింపులన్నీ ఆన్ లైన్
► రాష్ట్రాన్ని నగదు రహితంగా తీర్చిదిద్దుతాం: కేటీఆర్
► త్వరలోనే అందుబాటులోకి టీ వ్యాలెట్
► డిజిటల్ చెల్లింపులపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను సంపూర్ణ నగదు రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే కంపెనీలతో ప్రభుత్వం పని చేస్తుందన్నారు. రాష్ట్రంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు కేటీఆర్ నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఈటల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, మహేందర్ రెడ్డి, జగదీశ్ రెడ్డిలతో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం సచివాలయంలో సమావేశమైంది.
సిద్దిపేటలో నగదు రహిత చెల్లింపుల కోసం చేపట్టిన కార్యక్రమాలు, బ్యాంకుల సహకారం, ప్రజల్లో వచ్చిన చైతన్యం తదితర అంశాలపై ఉపసంఘం చర్చించింది. ఈ సమావేశంలో మొబైల్ వ్యాలెట్ కంపెనీల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ లావాదేవీలన్నీ ఆన్ లైన్ లేదా డిజిటల్ చెల్లింపుల ద్వారా ప్రజలకు ఉచితంగా అందుబాటులో తెస్తామన్నారు.
ప్రభుత్వ సేవలు, చెల్లింపులను సైతం ఆన్ లైన్ చేస్తామన్నారు. వ్యాపారులు, వినియోగదారుల మధ్య అత్యంత తక్కువ మొత్తాల చెల్లింపులు సైతం నగదు రహితంగా జరిగితేనే సంపూర్ణ నగదు రహిత రాష్ట్రం సాధ్యం అవుతుందన్నారు. డిజిటల్ చెల్లింపుల సేవలు అందించే వివిధ సంస్థల మధ్య సమన్వయంతో పరస్పర చెల్లింపులకు అవకాశం ఉండాలన్నారు. ఇందుకు అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐని కోరుతామన్నారు. టీ వ్యాలెట్ సేవలను అందించేందుకు ముందుకు వచ్చిన పలు కంపెనీలు ఈ సందర్భంగా తాము రూపొందించిన వ్యాలెట్ల సేవలు, పనిచేసే తీరు విధానాన్ని మంత్రులకు వివరించారు. త్వరలోనే టీ వ్యాలెట్ సేవలు, సౌకర్యాలను ఖరారు చేసి, యాప్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది.