గుండెపోటుకు ‘స్టెమీ’ భరోసా! | Ambulances with advanced CATHELAB facilities | Sakshi
Sakshi News home page

గుండెపోటుకు ‘స్టెమీ’ భరోసా!

Published Sun, Feb 17 2019 3:53 AM | Last Updated on Sun, Feb 17 2019 3:53 AM

Ambulances with advanced CATHELAB facilities - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తీవ్రమైన గుండెపోటు రావడాన్ని ఎస్టీ ఎలివేషన్‌ మయోకార్డియల్‌ ఇన్‌ఫార్‌క్షన్‌ (స్టెమీ) అంటారు. అలా హఠాత్తుగా తీవ్రమైన గుండెపోటు వచ్చినవారిని వేగంగా ఆసుపత్రికి తీసుకెళ్తేగాని బతికించలేం. కానీ.. చాలాసందర్భాల్లో సత్వర చికిత్స అందకపోవడంతో.. ఆసుపత్రికి తీసుకెళ్లేలోగానే మరణాలు సంభవిస్తున్నాయి. 108 అంబులెన్సులున్నా సకాలంలో బాధితులను ఆసుపత్రికి తీసుకెళ్లలేకపోతే అంతేసంగతులు. ఆ పరిస్థితి నుంచి రోగిని బతికించేందుకే ‘జాతీయ స్టెమీ కార్యక్రమం’ప్రారంభమైంది. తమిళనాడులో  ఇది పైలట్‌ ప్రాజెక్టుగా అమలవుతోంది. తెలంగాణలోనూ దీన్ని ప్రారంభించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ నడుంబిగించింది. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. జాతీయ ఆరో గ్య మిషన్‌ కింద నిధులు కేటాయించాలని కోరింది. 

ఇదీ పరిస్థితి! 
చాలాకాలంగా గుండెలో రంధ్రాలు మూసుకుపోయి ఉండటం వల్ల ఒకేసారి తీవ్రమైన గుండెపోటు వస్తుంది. ఈ పరిస్థితినే ‘స్టెమీ’అంటారు. ఇటువంటి సందర్భంలో సమయం చాలా కీలకం. భారతదేశంలో ప్రతీ ఏడాది 20–26 లక్షల మంది స్టెమీ బారిన పడుతున్నారు. స్టెమీ వచ్చిన వారు చనిపోవడానికి ప్రధాన కారణం ఆసుపత్రికి తీసుకెళ్లే సమయం ఉండకపోవడం, రవాణా సదుపాయాలు లేకపోవడం. అంతేకాదు ప్రాథమిక స్థాయి ఆసుపత్రుల్లో తీవ్రమైన గుండెపోటును గుర్తించే పరిస్థితి ఉండక పోవడమేనని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలంటున్నాయి. ఉదాహరణకు గతేడాది ఉస్మానియా ఆసుపత్రికి 319 మంది స్టెమీ గుండెపోటుతో వచ్చినవారికి చికిత్స చేశారు. ఇందులో సకాలంలో ఆసుపత్రికి చేరుకోని 4% మంది చనిపోయారు. అలాగే గాంధీ ఆసుపత్రికి 389 మందిని స్టెమీ గుండెపోటుతో తీసుకురాగా, 3% మంది చనిపోయారు. వరంగల్‌ ఎంజీఎంకు స్టెమీ గుండెపోటుతో 174 మందిని తీసుకురాగా, అందులో 4% చనిపోయారు. ఈ స్థాయిలో అధికంగా చనిపోవడమనేది సకాలంలో తీసుకు రాకపోవడమే కారణంగా వైద్యులు విశ్లేషిస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ గత నెల్లో 500 గ్రామాల్లో జరిగిన మరణాలపై అధ్యయనం చేసింది. అందులో అత్యధికులు గుండె జబ్బులతోనేనని తేలింది. అందులో స్టెమీ కేసులే అధికంగా ఉన్నట్లు సమాచారం. 

అత్యాధునిక వసతులతో స్టెమీ అంబులెన్సులు 
సాధారణ అంబులెన్సుల్లో తీవ్రమైన గుండెపోటు వస్తే తీసుకోవాల్సిన ప్రత్యేక వ్యవస్థ ఉం డ దు. ఆక్సిజన్‌ ఇచ్చి ప్రాథమిక వైద్యం చేస్తూ సమీప ఆసుపత్రులకు తీసుకెళ్లడానికి మాత్రమే ఈ అంబులెన్సులు ఉపయోగపడుతున్నాయి. దీనివల్ల అం బులెన్సులు బాధిత వ్యక్తిని తీసుకెళ్లేందుకు వచ్చినా ప్రాణాలు కాపాడటం సాధ్యం కావడంలేదు. ఈ నేపథ్యంలో స్టెమీ అంబులెన్సులను ప్రవేశపెట్టాల ని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఇందులో క్యాథ్‌లాబ్‌లో ఉండే అన్ని రకాల అత్యాధునిక వసతులు ఉంటాయి. ఈసీజీ రికార్డు చేయడం నుంచి మొదలుకుని గుండె చికిత్సకు అవసరమైన ప్రొటోకాల్‌ వ్యవస్థ స్టెమీ అంబులెన్సులో ఉంటుంది. అడ్వాన్స్‌ లైఫ్‌ సపోర్టుతో వైద్యం అందుతుంది. ఎవరికైనా గ్రామాల్లోకానీ ఎక్కడైనా గుండెపోటు వచ్చిందంటే ఈ స్టెమీ అంబులెన్సులే వెళ్తాయి. 108 అత్యవసర వాహనాలకు స్టెమీని అనుసంధానం చేస్తారు. ఫలితంగా రోగికి అవసరమైన చికిత్స అందుతుంది.

ఈలోపు గుండె సంబంధిత ఆసుపత్రికి తీసుకెళ్లి పూర్తిస్థాయి చికిత్స అందించే వీలుంటుంది. ఇప్పుడు అంబులెన్సుల్లో దగ్గరలోని ఏదో ఒక ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. కానీ అక్కడ గుండెపోటుకు చికిత్సనందించే వసతుల్లేవు. గుండెవ్యాధి నిపుణుడి సంగతి సరేసరి. అందువల్ల స్టెమీ అంబులెన్సులతోపాటు ప్రతీ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో క్యాథ్‌లాబ్‌ ఏర్పాటు చేస్తారు. దానివల్ల రోగిని ఏదో ఆసుపత్రికి కాకుండా నేరుగా క్యాథ్‌లాబ్‌కే తీసుకెళ్లేందుకు వీలుంటుంది. రాష్ట్రం లో ప్రయోగాత్మకంగా 10 స్టెమీ అంబులెన్సులను అందుబాటులోకి తీసుకురావాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించినట్లు అధికారులు చెబుతు న్నారు. భారతదేశంలో స్టెమీ కార్యక్రమం అమలు చేస్తున్న చోట్ల గుండెపోటు కారణంగా సంభవించే మరణాలరేటును 19% తగ్గించగలిగారు. తమిళనాడులోని కోయంబత్తూరు, వెల్లూరు, చెన్నైల్లో స్టెమీ ప్రాజెక్టు పైలట్‌గా నడుస్తోంది. దీనివల్ల అక్కడ 1542 మంది ప్రాణాలను కాపాడగలిగారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement