
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరవుతున్న ఇవాంకా వెంట ఆ దేశానికి చెందిన ప్రత్యేక వైద్య బృందం కూడా వస్తోంది. పర్యటనలో భాగంగా ఆమెకు ఏదైనా అనారోగ్య సమస్య, అత్యవసర పరిస్థితి తలెత్తితే.. వెంటనే తగిన చికిత్స అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ సదస్సుకు ప్రధాని మోదీ సహా దేశ విదేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం కూడా వైద్య సేవల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
సదస్సు వేదిక వద్ద ప్రత్యేక క్లినిక్ ఏర్పాటు చేసి.. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు చెందిన ప్రముఖ వైద్య నిపుణులతో కూడిన మూడు బృందాలను అందుబాటులో ఉంచనుంది. అందులో కార్డియాలజిస్ట్, జనరల్ ఫిజీషియన్, అనెస్థీషియన్ సహా నర్సులు, పారామెడికల్ సిబ్బంది ఉంటారు. ప్రతినిధుల్లో ఎవరికైనా ఏ విధమైన అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్య సేవలు అందిస్తారు. ఇక సదస్సు ప్రాంగణం బయట మూడు అంబులెన్సులను సిద్ధంగా ఉంచనున్నారు. అత్యవసర పరిస్థితి తలెత్తితే వైద్యం అందించేలా.. హైటెక్‌సిటీ సమీపంలోని కిమ్స్, పంజాగుట్ట నిమ్స్, అపోలో ఆస్పత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో విందుకు సంబంధించి కూడా వైద్య సేవల కోసం ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment