
కర్నూలులో రైల్వే వ్యాగన్ హమాలీగా బియ్యం బస్తాలు మోస్తున్న భాస్కర్(ఫైల్)
గద్వాల: పదిమంది ఉన్న ఆ కుటుంబ పోషణకు ఆయన సంపాదనా ఓ ఆధారం.. పెద్దకొడుకుగా తన బాధ్యతలను నెరవేర్చేందుకు హమాలీగా బస్తాలు మోశాడు.. కూలీగా బరువులు ఎత్తాడు. సర్పంచ్‌గా గ్రామంలో మంచిపేరు సంపాదించాడు. అదృష్టం వరించడంతో మహబూబ్ నగర్ జిల్లా జెడ్పీ చైర్మన్ పీఠాన్ని అధిరోహించాడు ఓ పేదింటి బిడ్డ బండారి భాస్కర్.
గద్వాల మండలం కాకులారం గ్రామానికి చెందిన బండారి నారాయణ, దేవమ్మలకు ఎనిమిదిమంది సంతానంలో భాస్కర్ మొదటివాడు. ఏడో తరగతి వరకు చదువుకున్న ఆయన ఇంటికి పెద్దకొడుకు కావడంతో కుటుంబ పోషణ కోసం కర్నూలులో రైల్వేవ్యాగన్ హమాలీగా కొన్నాళ్ల పాటు పనిచేశారు.
సర్పంచ్‌గా పనిచేసిన తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని తాను కూడా ఒక దఫా సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. టీఆర్‌ఎస్‌లో చురుకైన నాయకుడిగా ఎదిగి.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గద్వాల జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. అనూహ్య పరిణామాల మధ్య నేడు జెడ్పీ చైర్మన్ పదవి వరించింది.