బంద్ ప్రశాంతం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : వామపక్ష నేతల అరెస్టుకు నిరసనగా, మున్సిపల్ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో శుక్రవారం బంద్ ప్రశాంతంగా జరిగింది. 10 వామపక్ష పార్టీలు, ఆ పార్టీల అనుబంధ సంఘాలు ఉదయం నుంచే పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలు, విద్యా సంస్థలు మూసి వేయాలని కోరుతూ నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూరు, బోధన్, బాన్సువాడ, ఎల్లారెడ్డి తదితర ప్రాంతాల్లో ప్రధాన వీధులలో ప్రదర్శనలు చేశారు. నిజామాబాద్ ధర్నా చౌక్, కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బైఠారుుంచగా.. జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలు నిర్వహించారు.
వామపక్షాల బంద్‌కు వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ తదితర పార్టీలు మద్దతు పలికాయి. నిజామాబాద్ బస్టాండ్ వద్ద బస్సులను నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల నాయకులు కంజర భూమయ్య, దండి వెంకట్, వేల్పూరు భూమయ్య, వి.ప్రభాకర్ సహా పలువురు నాయకులు కార్యకర్తలు ఆందోళనకు దిగగా పోలీసులు వారిని అరెస్టు చేసి 4వ టౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. అరెస్టుకు నిరసనగా మున్సిపల్ కార్మికులు, వివిధ పార్టీల నాయకులు ధర్నాచౌక్ వద్ద, మున్సిపల్ కార్యాలయం వద్ద బైఠాయించి సంఘీభావం తెలిపారు. అర్మూరు పట్టణంలోనూ పోలీసులు 40 మంది అదుపులోకి తీసుకున్నారు.
నిజామాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఉన్న వామపక్ష పార్టీల నేతలను ఎమ్మెల్సీ ఆకుల లలిత, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, వైఎస్‌ఆర్ సీపీ అర్భన్ ఇన్‌చార్జ్ గైనిగాడి విజయలక్ష్మీ తదితరులు పరామర్శించారు. కాగా, బంద్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు అదుపులోకి తీసుకున్న పలువురిని శుక్రవారం సాయంత్రం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అనంతరం ఆయూ పార్టీల నాయకులు దండి వెంకట్, భూమయ్య, వి.ప్రభాకర్, అభిలాష్ మాట్లాడుతూ మున్సిపల్, గ్రామ పంచాయతీ, ఉపాధి హామీ కార్మికులు నెల రోజులుగా సమ్మె చేస్తున్నా కేసీఆర్ సర్కారు దున్నపోతుపై వర్షం పడుతున్నట్లుగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
కార్మికులు చాలీచాలనీ వేతనాలతో దుర్భర జీవితాలు గడుపుతున్నారని అన్నారు. కార్మికులను, దళితులను విస్మరిస్తున్న కేసీఆర్ విధానాలపై రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్టులు, దళితులు, కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బంద్‌కు సహకరించిన అన్ని వర్గాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.