సాక్షి, హైదరాబాద్: ‘ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయొప్పునే గౌరమ్మ...’ అంటూ తీరొక్క పువ్వులను పేర్చి భక్తితో కొలిచే తెలంగాణ ప్రత్యేక పండుగ బతుకమ్మకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బతుకమ్మ పండుగ ఉత్సవాలు మంగళవారం మొదలవ్వనున్నాయి. ఆటపాటలతో పల్లెల్లో ఆనందం నింపే ఈ పండుగ 9 రోజుల పాటు సాగనుంది. అక్టోబర్ 17న సద్దుల బతుకమ్మతో ఉత్సవాలు ముగియనున్నాయి. అన్ని గ్రామాల్లోనూ బతుకమ్మను ఘనంగా నిర్వహిం చాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. బతుకమ్మ ఉత్సవాల నిర్వహణ కోసం ప్రతి జిల్లా కేంద్రంలో ఉత్సవాలకు రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం కేటాయించింది.
ప్రత్యేకతల పండుగ...
బతుకమ్మ పండుగకు ఓ విశిష్టత ఉంది. ఈ పండుగలో పాటలదే ప్రాధాన్యత. పూర్తిగా ప్రకృతి, ఆత్మీయతలు, జీవనశైలిని తెలియజెప్పేలా పాటలుం టాయి. తెలంగాణ ఉద్యమంలో భాగంగా సాంస్కృ తిక అస్తిత్వం నిలుపుకునే ప్రక్రియలో బతుకమ్మ పండుగకు ప్రాధాన్యత పెరిగింది. వానాకాలం ముగింపు, చలికాలం మొదలయ్యే రోజుల్లో ఈ పండుగ వస్తుంది. ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున తొలిరోజు (ఎంగిలిపూల) బతుకమ్మతో పండుగ మొదలవుతుంది. తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మతో పండుగ ముగుస్తుంది. బతుకమ్మను పూలతో పేర్చడం, మట్టిలో ఆడటం, నీళ్లలో కలపడం అంతా ప్రకృతితో మమేకమైన ప్రక్రియ. బతుకమ్మకు వినియోగించే ఒక్కో పువ్వులో ఒక్కో రకమైన రోగ నిరోధక శక్తి ఉంటుంది. బతుకమ్మ పండుగ సందర్భంగా తయారు చేసే ప్రసాదాల్లోనూ ప్రత్యేకత ఉంది. వర్షాకాలంలో వచ్చే ఆహార పంటలతో ప్రసాదాలను తయారు చేస్తారు.
హైదరాబాద్‌లో 9 రోజుల పాటు...
బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. గతేడాది కంటే ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి అన్ని శాఖలను ఆదేశించారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్, పీపుల్స్‌ప్లాజా, రవీంద్రభారతి, బైసన్‌పోలో, పరేడ్‌గ్రౌండ్స్, తెలంగాణ కళాభారతి మైదానాల్లో 9 రోజులు వివిధ కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. సద్దుల బతుకమ్మ రోజున 21 దేశాలకు చెందిన మహిళలు ఉత్సవాల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో, ఢిల్లీల్లోని తెలంగాణభవన్‌లోనూ బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment