ఏప్రిల్ 30లోగా మిషన్ భగీరథ పనులు పూర్తి
అధికారులకు కలెక్టర్ రోనాల్ట్ రాస్ ఆదేశం
సంగారెడ్డిజోన్: గజ్వేల్ సెగ్మెంట్‌లో మిషన్ భగీరథ పనులను ఏప్రిల్ 30వ తేదిలోగా పూర్తి చేయాలని కలెక్టర్ రోనాల్ట్ రాస్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ మినీ సమావేశ మందిరంలో మిషన్ భగీరథ పనుల పురోగతిపై గ్రామీణాభివృద్ధిశాఖ ఇంజినీర్లు, సంబంధిత కాంట్రాక్టర్లతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గజ్వేల్ సెగ్మెంట్‌లో మిషన్ భగీరథ పథకం కింద నిర్మిస్తున్న ట్యాంకులు, పైపు లైన్ల పనులను వచ్చే నెల చివరి నాటికి పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలన్నారు. సంగారెడ్డి, మెదక్, నర్సాపూర్ సెగ్మెంట్ల పనులన్నింటినీ జూన్‌లోగా పూర్తి చేసేందుకు పైప్‌లైన్ పనులను వేగవంతం చేయాలన్నారు. పైప్‌లైన్లు వేసేందుకు ప్రస్తుతం పని చేస్తున్న బృందాలు(బ్యాచ్‌లు) సరిపోవని, అదనపు బ్యాచ్‌లను వెంటనే ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. బ్యాచ్‌లను ఏర్పాటు చేసేందుకు ఇబ్బందులు ఎదురైతే ఇతర ప్రాంతాల నుంచి రప్పిస్తామని హామీ ఇచ్చారు.
సంగారెడ్డి, మెదక్, నర్సాపూర్ సెగ్మెంట్‌ల్లోని అన్ని గ్రామాల్లో నిర్మించివలసిన నీటి ట్యాంకులు, పైపులైన్ల(ఇంట్రా) పనులను ఈ నెలాఖరులోగా ప్రజాప్రతినిధులతో శంకుస్థాపనలు చేయించి పనులు ప్రారంభించాలన్నారు. వర్షాకాలం ప్రారంభమయ్యేలోగా పైప్‌లైన్లు వేసి మట్టిని పూడ్చకపోతే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. పైప్‌లైన్ల విషయంలో ఎవరైనా రైతులు సహకరించకపోతే తన దృష్టికి వెంటనే తేవాలని సంబంధిత ఆర్‌డీఓను, తహశీల్దార్‌ను పంపించి సమస్యను పరిష్కరిస్తానన్నారు. సమీక్షలో వాటర్‌గ్రిడ్ ఎస్‌ఈ విజయప్రకాష్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ చక్రవర్తి, కార్యనిర్వాహక ఇంజనీర్లు, సంబంధిత కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.