హైదరాబాద్: తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కమలనాథులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణలోని అన్ని గ్రామాల్లో ఆవిర్భావ సంబరాలు జరపాలని నేతలను పార్టీ ఆదేశించింది. తెలంగాణ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలపడమే కాకుండా, బిల్లు ఆమోదం తెలిపే వేళ బీజేపీ పూర్తి సహకారాన్ని అందించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ తెచ్చిన పార్టీల్లో ఒకటిగా తమకు ప్రజల్లో ఆదరణ ఉంటుందని పార్టీ పెద్దలు భావించారు. అయితే, అందుకు వ్యతిరేకంగా ఫలితం రావడంతో కంగుతినాల్సిన పరిస్థితి ఎదురైంది.
ఈ క్రమంలో తెలంగాణ తెచ్చిన పార్టీగా ప్రజల్లో ఆదరణ పెంచుకునే దిశగా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. ఇందులో భాగంగా తొలి అడుగు వేస్తూ తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావ వేడుకలను వేదికగా మలచుకోవాలని భావిస్తున్నారు. తెలంగాణ అపాయింటెడ్ డే అయిన జూన్ 2వ తేదీ కంటే ముందు ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.
ఆదివారం అర్ధరాత్రి పార్టీ రాష్ర్ట కార్యాలయంలో బాణ సంచా పేల్చి వేడుకలను ప్రారంభిస్తారు. అనంతరం ముఖ్యనేతలు, కార్యకర్తలు నాంపల్లి గన్‌పార్కుకు చేరుకుని అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటిస్తారు. అదే సమయంలో జిల్లా ప్రధాన కేంద్రాల్లో తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. సోమవారం ఉదయం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంతోపాటు, జిల్లా, మండల కేంద్రాల్లోని పార్టీ కార్యాలయ భవనాలపై జాతీయ పతాకాలను ఆవిష్కరిస్తారు.
తెలంగాణలోని అన్ని గ్రామాల్లో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తారు.బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మండపంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ వ్యవహారాల బాధ్యతను తాత్కాలికంగా పర్యవేక్షిస్తున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి జగత్ ప్రకాశ్ నడ్డా హాజరవుతారు.
ఆవిర్భావ సంబురాల్లో బీజేపీ
Published Sun, Jun 1 2014 12:55 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement