సాక్షి, హైదరాబాద్: ఒకే స్ట్రెచర్ మీద ఇద్దరు రోగులను తీసుకెళ్లే దుస్థితి గాంధీ ఆస్పత్రిలో నెలకొందని బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు అన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్‌రావు మాట్లాడుతూ.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా పర్యటనతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయన్నారు. ఒక్క బీజేపీ నేతకు ఆరుగురు టీఆర్‌ఎస్ నేతలు సమాధానమిస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా రాజకీయ విమర్శలు చేశారే తప్ప వ్యక్తిగత విమర్శలు చేయలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అవినీతిపై తాము చర్చకు సిద్ధమని వ్యాఖ్యానించారు. ఆయుష్మాన్ భారత్‌ను దేశంలో అనేక రాష్ట్రాలు అమలు పరుస్తున్నాయని, దీని ద్వారా లక్షలాదిమంది లబ్ది పొందారని గుర్తు చేశారు.
రాష్ట్రంలోని ప్రతీ పథకంలో కేంద్రం వాటా ఉందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు, డాక్టర్లు, నిరుద్యోగులు ఎన్ని ధర్నాలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విమర్శించారు. ఇంతవరకు తెలంగాణలో మానవహక్కుల సంఘం ఏర్పాటు చేయలేదని చెప్పిన ఆయన.. ఇక్కడ మానవ హక్కులు ఉండవా అని నిలదీశారు. టీఆర్‌ఎస్ ఒక్కటే ఉద్యమం చేయలేదని, బీజేపీ ఎలాంటి షరతులు లేకుండా తెలంగాణ ఉద్యమానికి మద్దతిచ్చిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment