
సాక్షి, హైదరాబాద్/నకిరేకల్: ప్రముఖ వాస్తు శిల్పి, రచయిత, మిర్యాలగూడ మాజీ ఎంపీ బద్దం నర్సింహారెడ్డి(86) కన్నుమూశారు. కొంత కాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.
ఆయనకు ముగ్గురు కూతుళ్లు రమాదేవి, ఉమాదేవి, హేమాదేవి. కొడుకు చంద్రశేఖర్‌రెడ్డి రెండేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. బీఎన్ రెడ్డి భార్య అలివేలమ్మ చాలా ఏళ్లక్రితమే చనిపోయారు. ఆయన మనుమడు సహస్రరెడ్డి అమెరికాలో చదువుకుంటున్నారు. తాత మరణవార్త తెలియగానే అక్కడ్నుంచి బయల్దేరారు. మంగళవారం హైదరాబాద్‌లో 10.30 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఇదీ ప్రస్థానం..
బీఎన్ రెడ్డిగా సుపరిచితులైన నర్సింహారెడ్డి నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో 1931 జూన్ 21న బద్దం రామచంద్రారెడ్డి శాంతమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్య నకిరేకల్‌లో చదివారు. నల్లగొండలో ఎస్‌ఎస్‌సీ, హైదరాబాద్ సిటీ కాలేజీలో ఇంటర్, ఉస్మానియా వర్సిటీలో బీటెక్ పూర్తి చేశారు. అమెరికా కొలరాడో విశ్వ విద్యాలయంలో ఎంటెక్ చేశారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఓయూలో కొంతకాలం లెక్చరర్‌గా పని చేశారు. ఆయన వాస్తుశిల్ప నైపుణ్యం అబ్బురపరిచేది. పేద, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండేలా కాలనీలు, అపార్ట్‌మెంట్‌లు కట్టించారు.
హౌజింగ్ బోర్డు 14 అంతస్తుల బిల్డింగ్‌తోపాటు జి.పుల్లారెడ్డి ఏడంతస్తుల భవనాన్ని డిజైన్ చేశారు. ఎన్టీఆర్ స్టూడియో కూడా ఆయనే డిజైన్ చేసిందే. బేగంపేట్ ఎయిర్‌పోర్టు వెనుక ప్రభుత్వం కట్టించిన బలహీన వర్గాల గృహ సముదాయానికి ఆయనే రూపకర్త. అప్పట్లో నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి బీఎన్‌రెడ్డి ప్రతిభను ప్రశంసించారు. అలా ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ఆయన్ను రాజకీయ రంగం వైపు నడిపించింది. 1989లో, 1996, 1998లో కాంగ్రెస్ నుంచి మూడుసార్లు మిర్యాలగూడ నుంచి ఎంపీగా గెలిచారు.
1968లో విర్గో పేరుతో ఆర్కిటెక్ట్ సంస్థను స్థాపించారు. అనేక భవన సముదాయాల నిర్మాణాన్ని చేపట్టారు. ఆయన పేరిట బీఎన్‌రెడ్డి నగర్ వెలిసింది. ప్రస్తుతం ఆయన నివాసమున్న జూబ్లీహిల్స్‌లోని బీఎన్‌ఆర్ హిల్స్ భవనాలు ఆయన సృష్టే. 1979లో చైతన్య భారతి విద్యాసంస్థలను ఏర్పాటు చేసిన ఆయన వాటికి మూడుసార్లు చైర్మన్‌గా పని చేశారు.
గొప్ప రచయిత కూడా..
బీఎన్‌రెడ్డి అనేక సామాజిక అంశాలపై పుస్తకాలు రాశారు. ‘సామాన్యుడి సందేశం’, కవితా సంపుటి ‘బీఎన్ భాషితాలు’, ‘బీఎన్. భావతరంగిణి’వంటి కవితలు రాశారు. 1986లో వాస్తు శాస్త్ర అధ్యయనంతో పాటు పరిశోధనలు చేపట్టారు.
1992లో ప్రాక్టికల్ వాస్తు అనే ఆంగ్ల గ్రంథ రచనతో పాటు ముద్రణ కూడా చేపట్టారు.‘గ్లిమ్‌సెస్ ఆఫ్ వాస్తు’అనే గ్రంథంతోపాటు మరో 8 వాస్తుశాస్త్ర గ్రంథాలు రాశారు. వాస్తుశాస్త్రంలో ఆయన రచనలకు దేశ, విదేశాల్లో విశేష ప్రాచూర్యం లభించింది. చెన్నై అన్నామలై యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టర్ అందుకున్నారు. ఆయన రాసిన ‘పెళ్ళికాని పెళ్ళి’కథకు ఉత్తమ కథకుడిగా నంది పురస్కారం, రాజీవ్‌గాంధీ పురస్కారం లభించాయి. 1994లో బీఎన్ సాహితీ పురస్కారం స్థాపించారు.
కాంగ్రెస్ నేతల సంతాపం
బీఎన్ రెడ్డి మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్షనేత కె.జానారెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క సంతాపాన్ని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment