తెలంగాణకు భవనాల కేటాయింపు | buildings allotted for Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణకు భవనాల కేటాయింపు

Published Sat, May 31 2014 2:04 AM | Last Updated on Sat, Sep 2 2017 8:05 AM

buildings allotted for Telangana

సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు సచివాలయం, చట్టసభలు, మంత్రుల నివాసాలు, ఎమ్మెల్యేల క్వార్టర్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ కేటాయింపులన్నీ తాత్కాలిక ప్రాతిపదికన చేసినట్లు ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంగా ప్రస్తుత సీఎం క్యాంపు కార్యాలయం కేటాయించారు. ఆ క్యాంపు కార్యాలయాలు తమకు అవసరం లేదని, కుందన్‌బాగ్‌లోని రెండు క్వార్టర్లను విలీనం చేసి అక్కడ కార్యాలయం ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కోరడం... అందుకు అనుగుణంగా గతంలో ఉత్తర్వులు జారీ కావడం తెలిసిందే. అయినా మళ్లీ ఇప్పుడు ప్రస్తుత సీఎం క్యాంపు కార్యాలయాన్ని తెలంగాణ సీఎంకు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం. సచివాలయంలోని ఏ,బీ,సీ,డీ బ్లాకులను పూర్తిగా తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి కేటాయించారు. ‘సీ’ (సమత) బ్లాకులోని ఆరో అంతస్తులో ముఖ్యమంత్రి చాంబర్ ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మూడో అంతస్తులో ప్రస్తుత సీఎస్ కార్యాలయాన్ని, మంత్రివర్గ సమావేశ మందిరాన్ని కేటాయించారు. తెలంగాణకు కేటాయించిన నాలుగు బ్లాకుల్లో ఏ అంతస్తులో ఈ కార్యాలయం ఉండాలన్న వివరాలను కూడా ఉత్తర్వుల్లో పొందుపరిచారు. అలాగే కొత్త అసెంబ్లీని తెలంగాణకు, దానిని అనుకుని ఉన్న మంత్రుల చాంబర్లను తెలంగాణ మంత్రుల కోసం కేటాయించారు. ఇక జూబ్లీహాల్‌ను తెలంగాణ శాసనమండలిగా నిర్ణయించారు. దీనికి అవసరమైన మరమ్మతులు చేపట్టనున్నారు. ఇక మంత్రుల నివాసాలకు సంబంధించి బంజారాిహ ల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలోని 1 నుంచి 15వ భవనం వరకు తెలంగాణ మంత్రులకు కేటాయించారు. ఆదర్శ్‌నగర్‌లోని 1 నుంచి 10 బ్లాక్‌లు, 24వ బ్లాకు, డాక్టర్స్ క్వార్టర్లను తెలంగాణ శాసన సభ్యుల నివాస ప్రాంతాలుగా నిర్ణయించారు.
 
 సచివాలయంలో ఏ బ్లాకులో ఏ శాఖలు?
 
 సీ బ్లాకు..
 ఆరో అంతస్తు: సీఎం కార్యాలయం
 ఐదో అంతస్తు: సీఎం కార్యదర్శులు, సాధారణ పరిపాలన శాఖ
 నాల్గవ అంతస్తు: సీఎం ముఖ్య కార్యదర్శి కార్యాలయం, సాధారణ పరిపాలన శాఖ, కాన్ఫరెన్స్ హాలు
 మూడో అంతస్తు: సీఎస్ కార్యాలయం, కేబినెట్ సమావేశ మందిరం
 రెండో అంతస్తు: సాధారణ పరిపాలన శాఖ
 మొదటి అంతస్తు: సాధారణ పరిపాలన శాఖ, సీఎం ప్రెస్ సెక్రటరీ కార్యాలయం
 డీ బ్లాకు..
 మొదటి అంతస్తు: గిరిజన, వెనుకబడిన తరగతులు, సాంఘిక, మైనారిటీ సంక్షేమ శాఖలు, మహిళా శిశు అభివృద్ది, పాఠశాల, ఉన్నత విద్య శాఖలు
 రెండో అంతస్తు: వ్యవసాయం, సహకారం, పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ, పశు సంవర్ధక, మత్స్య, పరిశ్రమలు, వాణిజ్య, మౌలిక సదుపాయాలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, కార్మిక ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖలు, ఇంధన, ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ శాఖలు
 మూడో అంతస్తు: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, గృహ నిర్మాణం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలు
 నాల్గవ అంతస్తు: ఆర్థిక, రెవెన్యూ, ప్రణాళిక శాఖలు
 బీ బ్లాకు..
 మొదటి అంతస్తు: సాధారణ పరిపాలన శాఖ(ఎన్నికలు)
 రెండో అంతస్తు: సాధారణ పరిపాలన శాఖ
 మూడో అంతస్తు: యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కతిక శాఖ
 నాలుగు, ఐదు, ఆరో అంతస్తులు: సాగునీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖలు
 ఏ బ్లాకు..
 మొదటి అంతస్తు: పర్యావరణ,అటవీ, శాస్త్ర సాంకేతిక విజ్ఞాన శాఖ
 రెండో అంతస్తు: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ శాఖలు
 మూడో అంతస్తు: న్యాయశాఖ
 నాల్గవ అంతస్తు: హోం శాఖ
 ఐదో అంతస్తు: రవాణ, రహదారులు, భవనాల శాఖ
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement