సాక్షి, హైదరాబాద్: కంది రైతులకు దక్కాల్సిన మద్దతు ధర దళారుల పాలవుతోంది. రైతు పేరు చెప్పి నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి వ్యాపారులు మోసం చేస్తున్నా మార్క్‌ఫెడ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దళారులతో వారు చెట్టపట్టాల్ వేసుకొని తిరుగుతున్నారు. దళారులు కందిని రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద మద్దతు ధరకు విక్రయిస్తున్నారు. వీరికి సహకరించిన అధికారులకు ముడుపులు అందుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఈ విషయం బయటపడినా, స్వయానా మార్కెటింగ్ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేసి సంబంధిత అధికారులను సస్పెండ్ చేయమని ఆదేశించినా ఇప్పటి వరకు చర్యలు లేవు. విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు.
కొనుగోలుపై పరిమితి ఉండటంతో...
వ్యవసాయశాఖ అంచనా ప్రకారం రాష్ట్రంలో 2.84 లక్షల మెట్రిక్ టన్నుల కంది ఉత్పత్తి అవుతుంది. రెండేళ్ల క్రితం క్వింటాలు కంది ధర మార్కెట్లో రూ.9 వేల వరకు పలికింది. కానీ ఇప్పుడు రూ.4 వేల వరకే ఉంటోంది. కేంద్రం కందికి మద్దతు ధర రూ.5,450 ప్రకటించింది. మార్కెట్లో కంది ధర పతనమవడంతో కేంద్రమే మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకోసం రాష్ట్రంలో 110 కంది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకు 1.13 లక్షల టన్నులు కొంటానని కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో దళారులు రంగంలోకి దిగారు. రైతుల నుంచి క్వింటాలు రూ.4 వేలకే కొనుగోలు చేసి, మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాల వద్ద రూ.5,450 చొప్పున అమ్ముకుని లబ్ధి పొందుతున్నారు.
కేవలం రైతుల నుంచే కొనుగోలు కేంద్రాల్లో కొనాలి. కానీ వ్యాపారుల నుంచి అక్రమంగా కొనుగోలు చేస్తున్నట్లు బయటపడింది. ఆదిలాబాద్, నిర్మల్, జనగామ జిల్లాల్లో మార్క్‌ఫెడ్ అధికారులు దళారులతో ఒప్పందం చేసుకొని అక్రమంగా కంది కొన్నారన్న ఆరోపణలు వచ్చాయి. దానికి బాధ్యులు ఆయా జిల్లాల మార్క్‌ఫెడ్ అధికారులేనని ప్రాథమిక విచారణలో తేలింది. వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు కోరడం, అధికారులు ప్రతిపాదనలు చేసినా సంబంధిత ఫైలును ఉన్నతాధికారులు పక్కన పెట్టినట్లు సమాచారం. ఉన్నతాధికారులే అక్రమార్కులను కాపాడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అక్రమాలున్న కొనుగోలు కేంద్రాలు రద్దు
అక్రమాలు జరిగినట్లు నిర్ధారించిన కంది కొనుగోలు కేంద్రాలను రద్దు చేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. కేవలం వ్యవసాయ మార్కెట్లలో ఉన్న కొనుగోలు కేంద్రాలకే కందిని రైతులు తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రైతుల పేరు చెప్పి ఎక్కడెక్కడ అక్రమంగా కొనుగోళ్లు జరిగాయో విచారణ చేయాల్సిందిగా మార్క్‌ఫెడ్ అధికారులను ఆదేశించారు. దీంతో నాలుగు బృందాలను విచారణ కోసం మార్క్‌ఫెడ్ నియమించిందని మంత్రి హరీశ్‌రావు కార్యాలయం తెలిపింది. అలాగే మహబూబ్‌నగర్ జిల్లాలో హాకా ఆధ్వర్యంలో ఉన్న 10 కంది కొనుగోలు కేంద్రాలను రద్దు చేశామని, కందిని కేవలం వ్యవసాయ మార్కెట్లకే తీసుకురావాలని రైతులకు ఆ సంస్థ ఎండీ సురేందర్ సూచించారు. ఇదిలావుండగా వేరుశనగ, శనగ కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్లలోనే ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment