ఏ-గ్రేడ్ మక్కలే కొంటాం | buy only a-grade corn : Market Yard officers | Sakshi
Sakshi News home page

ఏ-గ్రేడ్ మక్కలే కొంటాం

Published Tue, Nov 25 2014 11:23 PM | Last Updated on Sat, Sep 2 2017 5:06 PM

buy only a-grade corn : Market Yard officers

 సిద్దిపేట జోన్: నిబంధనలకు విరుద్ధంగా నాసిరకం మక్కలను కొనుగోలు చేసి నిల్వల కోసం సీడబ్ల్యూసీ గోదాముకు పంపిన అధికారుల వైఖరిని సిద్దిపేట సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్(సీడబ్ల్యూసీ) అధికారులు మంగళవారం ఆక్షేపించారు. ఓ దశలో స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనుగోలు చేసిన 94 బస్తాలను నాసిరకంగా ఉన్నాయంటూ అధికారులు తిరస్కరించారు. దీంతో మార్కెట్ యార్డు అధికారులు కేవలం ఏ-గ్రేడ్ మక్కలనే కొనుగోలు చేస్తామంటూ తేల్చిచెప్పారు. దీంతో మక్క రైతులంతా ఆందోళనకు దిగారు.  

 తీరుమార్చుకోని అధికారులు
 సిద్దిపేట డివిజన్ పరిధిలో రైతులు పండించే మక్కలను మార్క్‌ఫెడ్ అధికారులు ఐకేపీ, పీఏసీఎస్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసిన మక్కలను స్థానిక సీడబ్ల్యూసీ గోదాంలో నిల్వ చేసేవారు. అయితే మార్క్‌ఫెడ్ అధికారులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మక్కలను కొనుగోలు చేసి సీడబ్ల్యూసీ గోదాముకు పంపగా, ఈ నెల 4న సీడబ్ల్యూసీ అధికారులు గుర్తించారు.

ఒక దశలో దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి ఐకేపీకి చెందిన 450 బస్తాలను నాసిరకంగా ఉన్నట్లు గుర్తించి వాటిని సీడబ్ల్యూసీ అధికారులు తిరస్కరించారు. ఇదే విషయాన్ని అప్పట్లో ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో జాయింట్ కలెక్టర్ శరత్ విచారణకు సైతం ఆదేశాలు జారీ చేశారు. ఈ సంఘటన మరిచి పోకముందే మంగళవారం మరోసారి సిద్దిపేట గోదాములో నాసిరకం మక్కను సీడబ్ల్యూసీ అధికారులు గుర్తించారు.

స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో పీఏసీఎస్ కొనుగోలు చేసిన లారీ లోడ్ మక్కల్లో 94 బస్తాలు నాసిరకంగా ఉన్న విషయాన్ని స్థానిక సీడబ్ల్యూసీ మేనేజర్ ప్రసాద్ గుర్తించి తిరస్కరించారు. విషయం తెలుసుకున్న పీఏసీఎస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ కార్యదర్శి సంగయ్యలు గోదాముకు చేరుకొని వివరాలు సేకరించారు. చేసేది లేక సంబంధిత 94 బస్తాలను తిరిగి మార్కెట్ యార్డుకు వెనక్కి తీసుకొచ్చారు.

 నాణ్యతను సాకుగా చూపి
 మార్క్‌ఫెడ్ కొన్న మక్కలను కేంద్ర గిడ్డంగుల సంస్థ అధికారులు  వెనక్కు పంపడంతో మార్క్‌ఫెడ్ అధికారులు కేవలం ఏ-గ్రేడ్ మక్కలే కొనుగోలు చేస్తామని తేల్చిచెప్పారు. దీంతో సిద్దిపేట యార్డులో మంగళవారం పీఏసీఎస్ అధికారులు కేవలం ఏ- గ్రేడ్ మక్కలనే కొనుగోలు చేశారు. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. ఒక దశలో సాయంత్రం మార్కెట్ కమిటీ కార్యదర్శి, పీఏసీఎస్ చైర్మన్‌లను ఇదే విషయంపై ప్రశ్నించారు.

 ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి కొనుగోలు చేస్తే సీడబ్ల్యూసీ అధికారులు అనుమతించరని, అందువల్ల ఏ-గ్రేడ్ మక్కలనే కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. దీంతో రైతులంతా అధికారులపై మండిపడ్డారు. ఇన్నాళ్లూ గ్రేడింగ్ విధానాన్ని అమలు చేసి, ఇపుడు  కేవలం ఏ-గ్రేడ్ మక్కలే కొంటామనడం ఎంతవరకు సమంజసమన్నారు. యార్డుకు తెచ్చిన మక్కలన్నీ కొనాలంటూ నినదించారు. పరిస్థితిని గ్రహించిన మార్క్‌ఫెడ్ అధికారులు వారికి సర్దిచెప్పారు.

 రెండు రోజులుగా కొనుగోలు చేసిన మక్కలు, ధాన్యాన్ని ఎగుమతి చేసిన తర్వాత తప్పనిసరిగా అందరి మక్కలను కొంటామని హామీ ఇచ్చారు. దీంతో మంగళవారం రాత్రి రైతులు తమ ఆందోళనను విరమించారు. మరోవైపు పట్టణ శివారులోని జగదాంబ రైస్ మిల్లులో చిన్నకోడూరు మండలం గుర్రాల గొంది కొనుగోలు కేంద్రానికి చెందిన 270 క్వింటాళ్ల వరి ధాన్యం దిగుమతికి రాగా, వాటిలో పొల్లు శాతం అధిక ఉందంటూ మిల్లర్ యజమాని దిగుమతికి నిరాకరించారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ ఆంజనేయులు, ఏఈఓ స్వప్న, ఐకేపీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement