అన్ని జిల్లాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్లు
హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా వీటిని ఐదు జిల్లాల్లో ప్రారంభించనుంది. గురువారం ఎంఎన్‌జె (మహదీ నవాజ్ జంగ్) క్యాన్సర్ ఆస్పత్రిలో జరిగిన 9వ పాలక మండలి సమావేశంలో మంత్రి సి. లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలందరికీ బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడం ద్వారా ఈ మహమ్మారిని నిర్మూలించవచ్చని తెలిపారు.
క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్లను ప్రస్తుతానికి మహబూబ్‌నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో స్క్రీనింగ్ సెంటర్లను ముందుగా ప్రారంభించాలని తీర్మానించారు. అలాగే, సర్వైకల్ తదితర క్యాన్సర్‌లపైనా దృష్టి పెట్టాలని నిర్ణయానికి వచ్చారు. ఇక, హైదరాబాద్‌లోని ఎంఎన్జె క్యాన్సర్ ఆస్పత్రిని విస్తరించనున్నారు. అధునాతన 500 పడకల నూతన భవన సముదాయానికి త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. ఈలోగా అవసరమైన అదనపు, స్టాఫ్ రిక్రూట్‌మెంట్ జరపాలని మంత్రి సూచించారు. సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్ తివారీ, ఎంఎన్ జె డైరెక్టర్ డాక్టర్ జయలత, కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి, పాల్గొన్నారు.