cancer screening centers
-
క్యాన్సర్ నియంత్రణకు స్క్రీనింగ్ అస్త్రం
సాక్షి, అమరావతి: మానవాళిని కబళిస్తున్న ప్రమాదకరమైన వ్యాధుల్లో క్యాన్సర్ ప్రధానమైనది. ఈ వ్యాధి కారణంగా దేశంలో 2018–2020 మధ్య 22 లక్షలకుపైగా మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో ప్రతి లక్షమందిలో 120 మంది క్యాన్సర్ వ్యాధి బారినపడుతున్నట్టు అంచనా. ఈ క్రమంలో క్యాన్సర్ వ్యాధి నియంత్రణ, అధునాతన చికిత్సలకు వసతుల కల్పనపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ ప్రత్యేకదృష్టి సారించింది. తొలిదశలో ఏడు వైద్యకళాశాలల్లో ఈ సదుపాయాల కల్పనకు రూ.119.58 కోట్లు కేటాయించింది. ప్రారంభదశలోనే వ్యాధిని గుర్తించడంపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించాలని వైద్యశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా మహిళా హెచ్ఐవీ బాధితులు, హైరిస్క్‌లో ఉన్న వారికి క్యాన్సర్ స్క్రీనింగ్‌ను ఏపీ శాక్స్ ప్రారంభించింది. క్యాన్సర్ బారినపడటానికి హెచ్ఐవీ బాధితుల్లో ఆరురెట్లు, హైరిస్క్ బాధితుల్లో నాలుగురెట్ల అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో షేర్ ఇండియా సంస్థ సాంకేతిక సహకారంతో ఏపీ శాక్స్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హెచ్ఐవీ బాధిత, హైరిస్క్ మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రారంభించింది. తొలివిడతలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, కాకినాడ జిల్లా పెద్దాపురం ప్రాంతాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ మొదలుపెట్టింది. శాక్స్ లెక్కల ప్రకారం ఈ రెండు ప్రాంతాల్లో హెచ్ఐవీ బాధిత, హైరిస్క్ మహిళలు 12,400 మంది ఉన్నారు. వీరందరికి నోటి, ఛాతీ, గర్భాశయ క్యాన్సర్ల గుర్తింపునకు స్క్రీనింగ్ చేస్తున్నారు. త్వరలో అన్నమయ్య జిల్లా మదనపల్లెలో క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రారంభించనున్నారు. అనంతరం అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా అగనంపూడి.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా స్క్రీనింగ్‌ను విస్తరించనున్నారు. ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చు దేశంలో ఏటా 1.3 మిలియన్ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. వీటిలో 60 శాతం కేసులు నియంత్రించదగ్గవేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. 2021–22లో రాష్ట్రంలో నమోదైన క్యాన్సర్ కేసుల్లో 16 శాతం ఛాతీ క్యాన్సర్‌కు సంబంధించినవి కావడం గమనార్హం. మహిళల్లో వచ్చే నోటి, ఛాతీ, గర్భాశయ క్యాన్సర్లలో 49.2 శాతం కేసుల్ని ప్రారంభదశలోనే గుర్తించి వైద్యంచేస్తే ప్రాణాపాయం తప్పుతుంది. ఇందుకు సామూహిక క్యాన్సర్ స్క్రీనింగ్ ఒకటే ప్రధాన మార్గమని ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పేర్కొన్నారు. దేశంలోనే మొదటి సారి దేశంలోనే మొదటిసారి మన రాష్ట్రంలో కాంప్రహెన్సివ్ క్యాన్సర్‌కు అడుగులు పడ్డాయి. వ్యాధి నివారణ, నియంత్రణ, పాలియేటివ్ కేర్ వంటి అన్ని అంశాలపైనా ప్రభుత్వం దృష్టిపెట్టింది. క్యాన్సర్ వ్యాధిపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. వ్యాధి లక్షణాలు, చికిత్సపై ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఏపీ శాక్స్ ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రారంభించాం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హెచ్ఐవీ బాధితులు, హైరిస్క్ మహిళలకు స్క్రీనింగ్ నిర్వహిస్తాం. – నవీన్‌కుమార్, ప్రత్యేక కార్యదర్శి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ -
5 లక్షల మందిలో.. 2 వేల మందికి కేన్సర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఏర్పాటు చేసిన కేన్సర్ స్క్రీనింగ్ కేంద్రాల ద్వారా 5 లక్షల మందిని పరీక్షించగా, రెండు వేల మందికి కేన్సర్ నిర్ధారణ అయిందని వైద్య, ఆరోగ్య మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి వెల్లడించారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు కర్నె ప్రభాకర్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. స్క్రీనింగ్ కేంద్రాల ద్వారా కేన్సర్‌ను ముందుగానే గుర్తించడానికి వీలవుతుందన్నారు. త్వరలో అన్ని జిల్లాల్లోనూ కేన్సర్ స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో ప్రైవేటు కంటే అత్యాధునిక పరికరాలు, వైద్యం అందుబాటులో ఉన్నాయన్నారు. మిషన్ కాకతీయపై సభ్యులు పాతూరి సుధాకర్‌రెడ్డి, గంగాధర్‌గౌడ్‌లు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్‌రావు సమాధానమిచ్చారు. మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టు సాగులోకి రానుందన్నారు. ఇప్పటివరకు 2.85 లక్షల ఆయకట్టు స్థిరీకరించగలిగామని చెప్పారు. పంట దిగుబడులు పెరిగాయన్నారు. వరి ఉత్పాదకత 4.4 శాతం పెరిగిందన్నారు. పత్తి ఉత్పాదకత 11.6 శాతం, మొక్కజొన్న 6.7 శాతం పెరిగిందన్నారు. చేపల దిగుబడి 36 నుంచి 39 శాతానికి పెరిగిందన్నారు. మిషన్ కాకతీయతకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వస్తున్నాయని తెలిపారు. మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా కేంద్రం ఒక్క పైసా విడుదల చేయలేదని విమర్శించారు. మహారాష్ట్రలోనూ మిషన్ కాకతీయ స్ఫూర్తితో కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఖమ్మంలో పండ్ల మార్కెట్: హరీశ్‌రావు పండ్ల మార్కెట్లపై సభ్యులు బోడకుంటి వెంకటేశ్వర్లు, బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు అడిగిన ప్రశ్నకు హరీశ్‌రావు సమాధానమిస్తూ, అవసరమైన చోట్ల పండ్ల మార్కెట్లకు అనుమతి ఇస్తామని చెప్పారు. సభ్యుల కోరిక మేరకు ఖమ్మంలోనూ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పండ్లను మాగబెట్టడానికి కాల్షియం కార్బైడ్ వాడినట్లు రుజువైతే చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే 19 మందిపై కేసులు వేసి, జైలుకు పంపించామన్నారు. గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ను రంగారెడ్డి జిల్లా కొహెడలో, జగిత్యాల మామిడి పండ్ల మార్కెట్‌ను చెల్గల్ గ్రామంలో ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలని ప్రతిపాదించామన్నారు. వారికి ‘పెట్టుబడి’ ఇవ్వలేం మహమూద్ అలీ పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ.4 వేలు ఇవ్వడం సాధ్యం కాదని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. సభ్యులు కర్రె ప్రభాకర్, బాలసాని లక్ష్మీనారాయణలు అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 2004కు ముందు పోడు చేసు కునే వారికి పట్టాలు ఇవ్వాలని చెప్పారని, కానీ వారికి పట్టాలు ఇవ్వలేదని బాలసాని పేర్కొన్నారు. కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ, రాచకొండ ప్రాంతం లో మంచాల్, సంస్థాన్‌నారాయణపురం మండలాల్లో పట్టాలు ఇచ్చారన్నారు. 2015 వరకు వారికి పహాణీలు కూడా ఇచ్చారని తెలిపారు. కానీ ఇప్పుడు పేర్లు లేకపోవడంతో వారికి రూ.4 వేల చొప్పున పెట్టు బడి సాయం అంద దని అన్నారు. దీన్ని పరిష్కరించాలని కోరారు. అదంతా అటవీ శాఖ పరిధిలోదని మహమూద్‌అలీ పేర్కొనగా, కాదని కర్నె అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల ఎకరాలకు పైగా ఉన్న పోడు భూములను సాగు చేసుకునే గిరిజనులకు ఎలా రక్షణ ఇస్తారని సభ్యులు రామచందర్‌రావు ప్రశ్నించారు. సానుకూలంగా స్పందిస్తామని మహమూద్‌అలీ పేర్కొన్నారు. మల్లెపల్లి ఐటీఐకి చెందిన భూములపై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ, నైస్ ఆస్పతికి ఎకరా భూమిని గత ప్రభుత్వం లీజుకు ఇచ్చిందని, అందులో నిర్మాణం జరిగిందని, లీజు రద్దుపై ఆలోచిస్తున్నామని చెప్పారు. -
అన్ని జిల్లాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్లు
హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా వీటిని ఐదు జిల్లాల్లో ప్రారంభించనుంది. గురువారం ఎంఎన్‌జె (మహదీ నవాజ్ జంగ్) క్యాన్సర్ ఆస్పత్రిలో జరిగిన 9వ పాలక మండలి సమావేశంలో మంత్రి సి. లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలందరికీ బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడం ద్వారా ఈ మహమ్మారిని నిర్మూలించవచ్చని తెలిపారు. క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్లను ప్రస్తుతానికి మహబూబ్‌నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో స్క్రీనింగ్ సెంటర్లను ముందుగా ప్రారంభించాలని తీర్మానించారు. అలాగే, సర్వైకల్ తదితర క్యాన్సర్లపైనా దృష్టి పెట్టాలని నిర్ణయానికి వచ్చారు. ఇక, హైదరాబాద్‌లోని ఎంఎన్‌జె క్యాన్సర్ ఆస్పత్రిని విస్తరించనున్నారు. అధునాతన 500 పడకల నూతన భవన సముదాయానికి త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. ఈలోగా అవసరమైన అదనపు, స్టాఫ్ రిక్రూట్మెంట్ జరపాలని మంత్రి సూచించారు. సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్ తివారీ, ఎంఎన్ జె డైరెక్టర్ డాక్టర్ జయలత, కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి, పాల్గొన్నారు.