సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఏర్పాటు చేసిన కేన్సర్ స్క్రీనింగ్ కేంద్రాల ద్వారా 5 లక్షల మందిని పరీక్షించగా, రెండు వేల మందికి కేన్సర్ నిర్ధారణ అయిందని వైద్య, ఆరోగ్య మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి వెల్లడించారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు కర్నె ప్రభాకర్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. స్క్రీనింగ్ కేంద్రాల ద్వారా కేన్సర్‌ను ముందుగానే గుర్తించడానికి వీలవుతుందన్నారు. త్వరలో అన్ని జిల్లాల్లోనూ కేన్సర్ స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో ప్రైవేటు కంటే అత్యాధునిక పరికరాలు, వైద్యం అందుబాటులో ఉన్నాయన్నారు. మిషన్ కాకతీయపై సభ్యులు పాతూరి సుధాకర్‌రెడ్డి, గంగాధర్‌గౌడ్‌లు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్‌రావు సమాధానమిచ్చారు. మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టు సాగులోకి రానుందన్నారు. ఇప్పటివరకు 2.85 లక్షల ఆయకట్టు స్థిరీకరించగలిగామని చెప్పారు.
పంట దిగుబడులు పెరిగాయన్నారు. వరి ఉత్పాదకత 4.4 శాతం పెరిగిందన్నారు. పత్తి ఉత్పాదకత 11.6 శాతం, మొక్కజొన్న 6.7 శాతం పెరిగిందన్నారు. చేపల దిగుబడి 36 నుంచి 39 శాతానికి పెరిగిందన్నారు. మిషన్ కాకతీయతకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వస్తున్నాయని తెలిపారు. మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా కేంద్రం ఒక్క పైసా విడుదల చేయలేదని విమర్శించారు. మహారాష్ట్రలోనూ మిషన్ కాకతీయ స్ఫూర్తితో కార్యక్రమాలు చేపట్టారన్నారు.
ఖమ్మంలో పండ్ల మార్కెట్: హరీశ్‌రావు
పండ్ల మార్కెట్లపై సభ్యులు బోడకుంటి వెంకటేశ్వర్లు, బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు అడిగిన ప్రశ్నకు హరీశ్‌రావు సమాధానమిస్తూ, అవసరమైన చోట్ల పండ్ల మార్కెట్లకు అనుమతి ఇస్తామని చెప్పారు. సభ్యుల కోరిక మేరకు ఖమ్మంలోనూ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
పండ్లను మాగబెట్టడానికి కాల్షియం కార్బైడ్ వాడినట్లు రుజువైతే చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే 19 మందిపై కేసులు వేసి, జైలుకు పంపించామన్నారు. గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ను రంగారెడ్డి జిల్లా కొహెడలో, జగిత్యాల మామిడి పండ్ల మార్కెట్‌ను చెల్గల్ గ్రామంలో ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలని ప్రతిపాదించామన్నారు.
వారికి ‘పెట్టుబడి’ ఇవ్వలేం మహమూద్ అలీ
పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ.4 వేలు ఇవ్వడం సాధ్యం కాదని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. సభ్యులు కర్రె ప్రభాకర్, బాలసాని లక్ష్మీనారాయణలు అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 2004కు ముందు పోడు చేసు కునే వారికి పట్టాలు ఇవ్వాలని చెప్పారని, కానీ వారికి పట్టాలు ఇవ్వలేదని బాలసాని పేర్కొన్నారు.
కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ, రాచకొండ ప్రాంతం లో మంచాల్, సంస్థాన్‌నారాయణపురం మండలాల్లో పట్టాలు ఇచ్చారన్నారు. 2015 వరకు వారికి పహాణీలు కూడా ఇచ్చారని తెలిపారు. కానీ ఇప్పుడు పేర్లు లేకపోవడంతో వారికి రూ.4 వేల చొప్పున పెట్టు బడి సాయం అంద దని అన్నారు. దీన్ని పరిష్కరించాలని కోరారు. అదంతా అటవీ శాఖ పరిధిలోదని మహమూద్‌అలీ పేర్కొనగా, కాదని కర్నె అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల ఎకరాలకు పైగా ఉన్న పోడు భూములను సాగు చేసుకునే గిరిజనులకు ఎలా రక్షణ ఇస్తారని సభ్యులు రామచందర్‌రావు ప్రశ్నించారు. సానుకూలంగా స్పందిస్తామని మహమూద్‌అలీ పేర్కొన్నారు. మల్లెపల్లి ఐటీఐకి చెందిన భూములపై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ, నైస్ ఆస్పతికి ఎకరా భూమిని గత ప్రభుత్వం లీజుకు ఇచ్చిందని, అందులో నిర్మాణం జరిగిందని, లీజు రద్దుపై ఆలోచిస్తున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment