సాక్షి, అమరావతి: మానవాళిని కబళిస్తున్న ప్రమాదకరమైన వ్యాధుల్లో క్యాన్సర్ ప్రధానమైనది. ఈ వ్యాధి కారణంగా దేశంలో 2018–2020 మధ్య 22 లక్షలకుపైగా మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో ప్రతి లక్షమందిలో 120 మంది క్యాన్సర్ వ్యాధి బారినపడుతున్నట్టు అంచనా. ఈ క్రమంలో క్యాన్సర్ వ్యాధి నియంత్రణ, అధునాతన చికిత్సలకు వసతుల కల్పనపై సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్ ప్రత్యేకదృష్టి సారించింది. తొలిదశలో ఏడు వైద్యకళాశాలల్లో ఈ సదుపాయాల కల్పనకు రూ.119.58 కోట్లు కేటాయించింది.
ప్రారంభదశలోనే వ్యాధిని గుర్తించడంపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించాలని వైద్యశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా మహిళా హెచ్‌ఐవీ బాధితులు, హైరిస్క్‌లో ఉన్న వారికి క్యాన్సర్ స్క్రీనింగ్‌ను ఏపీ శాక్స్ ప్రారంభించింది. క్యాన్సర్ బారినపడటానికి హెచ్‌ఐవీ బాధితుల్లో ఆరురెట్లు, హైరిస్క్ బాధితుల్లో నాలుగురెట్ల అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో షేర్ ఇండియా సంస్థ సాంకేతిక సహకారంతో ఏపీ శాక్స్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హెచ్‌ఐవీ బాధిత, హైరిస్క్ మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రారంభించింది.
తొలివిడతలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, కాకినాడ జిల్లా పెద్దాపురం ప్రాంతాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ మొదలుపెట్టింది. శాక్స్ లెక్కల ప్రకారం ఈ రెండు ప్రాంతాల్లో హెచ్‌ఐవీ బాధిత, హైరిస్క్ మహిళలు 12,400 మంది ఉన్నారు. వీరందరికి నోటి, ఛాతీ, గర్భాశయ క్యాన్సర్ల గుర్తింపునకు స్క్రీనింగ్ చేస్తున్నారు. త్వరలో అన్నమయ్య జిల్లా మదనపల్లెలో క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రారంభించనున్నారు. అనంతరం అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా అగనంపూడి.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా స్క్రీనింగ్‌ను విస్తరించనున్నారు.
ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చు
దేశంలో ఏటా 1.3 మిలియన్ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. వీటిలో 60 శాతం కేసులు నియంత్రించదగ్గవేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. 2021–22లో రాష్ట్రంలో నమోదైన క్యాన్సర్ కేసుల్లో 16 శాతం ఛాతీ క్యాన్సర్‌కు సంబంధించినవి కావడం గమనార్హం. మహిళల్లో వచ్చే నోటి, ఛాతీ, గర్భాశయ క్యాన్సర్లలో 49.2 శాతం కేసుల్ని ప్రారంభదశలోనే గుర్తించి వైద్యంచేస్తే ప్రాణాపాయం తప్పుతుంది. ఇందుకు సామూహిక క్యాన్సర్ స్క్రీనింగ్ ఒకటే ప్రధాన మార్గమని ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పేర్కొన్నారు.
దేశంలోనే మొదటి సారి
దేశంలోనే మొదటిసారి మన రాష్ట్రంలో కాంప్రహెన్సివ్ క్యాన్సర్‌కు అడుగులు పడ్డాయి. వ్యాధి నివారణ, నియంత్రణ, పాలియేటివ్ కేర్ వంటి అన్ని అంశాలపైనా ప్రభుత్వం దృష్టిపెట్టింది. క్యాన్సర్ వ్యాధిపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. వ్యాధి లక్షణాలు, చికిత్సపై ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఏపీ శాక్స్ ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రారంభించాం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హెచ్‌ఐవీ బాధితులు, హైరిస్క్ మహిళలకు స్క్రీనింగ్ నిర్వహిస్తాం.
– నవీన్‌కుమార్, ప్రత్యేక కార్యదర్శి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ
Comments
Please login to add a commentAdd a comment