సాక్షి, హైదరాబాద్ : తెల్లారితే ఏం జరుగుతుందో? ‘పుర’పదవులపై పెట్టుకున్న ఆశలు నిలబడతాయా? వమ్మవుతాయా? ఆశించిన చైర్‌పర్సన్ హోదా దక్కుతుందా.. సమీకరణల సాకుతో చేజారుతుందా..? మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఉత్కంఠ రేపుతున్న ప్రశ్నలివీ. మరో 24 గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండటంతో ఏం జరుగుతుందో అనే టెన్షన్ అన్ని పార్టీల అభ్యర్థులు, వారి అనుచరుల్లో కనిపిస్తోంది. పోలింగ్ ముగిసిన మరుసటి రోజు గురువారమంతా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల అభ్యర్థులు లెక్కలతోనే కుస్తీ పట్టారు. తమ వార్డు, డివిజన్ పరిధిలో ఎన్ని ఓట్లు పడ్డాయి.. అందులో ప్రత్యర్థులకు పడే ఓట్లు ఎన్ని? ఎన్ని ఓట్లు వస్తే తాము గెలుస్తాం..? అన్ని ఓట్లు పడ్డాయా లేదా అనే అంచనాల్లోనే తలమునకలయ్యారు. అయితే గెలుపోటములపై ఇప్పటికే దాదాపు ఓ అంచనాకు వచ్చారు.
గెలుస్తాం.. కానీ
వార్డు సభ్యులుగా గెలుపొందడంపై ఉన్న టెన్షన్‌కు తోడు మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లు, వైస్‌చైర్మన్లు, డిప్యూటీ మేయర్లను ఆశిస్తున్న నేతలకు గుబులు కూడా మొదలైంది. ఈనెల 27న పరోక్ష పద్ధతిన ఈ పదవులకు ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో అప్పుడే పైరవీల బాట పట్టారు. తమ ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ అధిష్టానాలను ప్రసన్నం చేసుకునే దారులు వెతుక్కుంటున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ నేతల్లో ఈ ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తోంది. పోలింగ్ సరళిని బట్టి మెజార్టీ స్థానాలను టీఆర్‌ఎస్ గెలుచుకుంటుందన్న అంచనాల నేపథ్యంలో ఆ పార్టీ నుంచి పెద్ద పదవులు ఆశిస్తున్న వారంతా ఆ పనిలో పడ్డారు. ఎన్ని వార్డుల్లో గెలుస్తాం.. ఎక్స్‌అఫీషియో ఓట్లు అవసరం అవుతాయా? ఇండిపెండెంట్ల అవసరం పడుతుందా? అనే లెక్కలు తీసుకుని పెద్ద నాయకుల వద్దకు పరుగులు పెడుతున్నారు. జనరల్ స్థానాల్లో చైర్మన్లు, మేయర్ పదవులను ఆశించే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అప్పుడే కుల సమీకరణలు మొదలయ్యాయి.
చైర్మన్లు, మేయర్ పదవుల ఎంపిక బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారు? రాష్ట్రం యూనిట్‌గా తీసుకుంటారా? స్థానికంగానే సమీకరణలు పూర్తి చేస్తారా అనే సందేహాలపై ప్రస్తుతానికి స్పష్టత లేనప్పటికీ రేసులో ముగ్గురు, నలుగురు ఉండటంతో తమ పేరు జాబితాలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక, రిజర్వ్‌డ్ స్థానాల్లో డిప్యూటీ పదవుల కోసం పలువురు ముఖ్య నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన పట్టణ స్థాయి నేతలు కూడా తాము టీఆర్‌ఎస్ కన్నా ఎక్కువ స్థానాలు గెలవగలమనే అంచనాలున్న చోట్ల కసరత్తు మొదలుపెట్టారు. అవసరమైతే గెలిచిన వారు చేజారకుండా వెంటనే క్యాంపులకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇండిపెండెంట్లు అవసరమైతే వారికి డిప్యూటీ, వైస్ పదవులను ఆఫర్ చేసైనా పీఠాలను దక్కించుకునే విధంగా వ్యూహరచనలు చేసుకుంటున్నారు. కో–ఆప్షన్ పదవులను ఆశిస్తున్న వారు కూడా ముఖ్య నేతల వద్దకు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
మొక్కులు.. బెట్టింగులు
మున్సిపోల్స్ ఫలితాలపై బెట్టింగులు కూడా గుట్టుచప్పుడు కాకుండా ప్రారంభమయ్యాయి. పలానా నాయకుడు పలానా వార్డులో గెలుస్తాడని, పలానా పార్టీ గెలిస్తే పలానా వ్యక్తి చైర్మన్ అవుతారనే దానిపై రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరుగానే బెట్టింగులు ప్రారంభమయ్యాయి. రూ.5 వేల నుంచి లక్ష వరకు సాగుతున్న ఈ బెట్టింగులు స్థానికంగానే ఎక్కువగా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇక, గెలిచిన తర్వాత తమ ఇష్టదైవాలకు మొక్కు తీర్చుకునేందుకు కూడా అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు, అనుచరులు సిద్ధమవుతున్నారు. తలనీలాలు, కానుకలు సమర్పించుకుంటామని ఇష్టదైవాలకు మొక్కుకుంటున్నారు. మొత్తంమీద మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు గడువు సమీపిస్తుండటంతో పార్టీల మాట ఎలా ఉన్నా పోటీలో ఉన్న అభ్యర్థులకు మాత్రం శుక్రవారం నిద్ర లేని రాత్రిని మిగల్చనుంది.
Comments
Please login to add a commentAdd a comment